Manne Krishank | ప్రచార ఆర్భాటం కోసం రూ.839 కోట్ల పెట్టుబడులు అని చెప్పి.. రాష్ట్రంలోకి మరో బోగస్ కంపెనీని తీసుకొస్తే ఎట్లా అని సీఎం రేవంత్ రెడ్డిని బీఆర్ఎస్ నేత మన్నె క్రిశాంక్ ప్రశ్నించారు. పెట్టుబడులు తీసుకురావడంలో కేటీఆర్‌తో పోటీ పడాలని ఫ్రాడ్ కంపెనీలు, బోగస్ కంపెనీలు తెచ్చి ప్రచారం ఎందుకు చేసుకుంటున్నారని మండిపడ్డారు. హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్లో మన్నె క్రిశాంక్ మాట్లాడుతూ.. రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఎవరిని కలిసినా, ఎవరితో వ్యాపారం చేసినా వారి ట్రాక్ రికార్డు బాగుండాలని సూచించారు. ఇలా ఎవరిని పడితే వాళ్లను కలిసి, స్ట్రైక్ఆఫ్ అయిన కంపెనీతో ఒప్పందాలు చేసుకుని వస్తే ఎవరూ ఊరుకోరని హెచ్చరించారు.
కేసీఆర్ హయాంలో తీసుకున్న నిర్ణయాలతో తెలంగాణలో పెట్టుబడులు పెరిగాయని బీఆర్ఎస్ నేత మన్నె క్రిశాంక్ అన్నారు. బీఆర్ఎస్ హయాంలో ఐటీ పెట్టుబడులు గణనీయంగా పెరిగాయని తెలిపారు. 2022-23 చూస్తే ఐటీ ఎగుమతులు 57,706 కోట్లు ఉందని.. 2023-24కి వచ్చేసరికి ఐటీ ఎగుమతులు 26,948 కోట్లకు పడిపోయిందని అన్నారు. కాంగ్రెస్ పాలనలో పెట్టుబడులు సగానికి పడిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు.
గతంలో దావోస్‌కు వెళ్లినప్పుడు రేవంత్ రెడ్డి చాలా ప్రచారం చేసుకున్నారని క్రిశాంక్ గుర్తుచేశారు. దావోస్‌లో గోధి ఇండియా అనే సంస్థతో ఒప్పందం కుదుర్చుకున్నారని తెలిపారు. రూ.27 లక్షల వార్షిక లాభం లేని సంస్థ ఇన్ని వేల కోట్ల పెట్టుబడులు ఎలా పెడుతుందని యాన్వల్ స్టేట్మెంట్ తెప్పించి అడిగితే సీఎం గప్‌చుప్ అయ్యారని విమర్శించారు. అలాగే మూసీ సుందరీకరణ ప్రాజెక్టుపై రూ.లక్షన్నర కోట్లకు అంచనాలను పెంచారని తెలిపారు. ఈ ప్రాజెక్టును మెయిన్ హార్ట్ అనే సంస్థకు కట్టబెట్టేందుకు ప్రభుత్వం చూస్తుందని పేర్కొన్నారు. మెయిన్ హార్ట్ సంస్థ పాకిస్థాన్‌లో 3000 కోట్లు దోచుకుని పారిపోయి వచ్చిందని తెలిపారు. ఆ సంస్థపై ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీలు, ఫెడరల్ ఏజెన్సీలు లుకౌట్ నోటీసులు పెట్టిందని వెల్లడించారు. ఈ రెండు ఇలా ఉంటే.. తెలంగాణలో రూ.839 కోట్ల పెట్టబడులకు వాల్స్ కర్రా హోల్డింగ్స్‌తో ఒప్పందం జరిగిందని ప్రచారం చేస్తున్నారని తెలిపారు.
ప్రచార ఆర్భాటం కోసం 839 కోట్ల పెట్టబడులు అని చెప్పి రాష్ట్రంలోకి మరో బోగస్ కంపెనీని తీసుకొస్తే ఎట్లా అని మన్నె క్రిశాంక్ ప్రశ్నించారు. వాల్ష్ కర్రా హోల్డింగ్స్ అనే కంపెనీ కేవలం నాలుగు నెలల కిందటే ప్రారంభమైందని తెలిపారు. ఈ కంపెనీలో ఇద్దరే డైరెక్టర్లు ఉన్నారని చెప్పారు. వీళ్ల యాన్వుల్ స్టేట్మెంట్స్, రిపోర్టులు, పాత ట్రాక్ రికార్డులు ఏమీ లేవని పేర్కొన్నారు. వాల్ష్ కర్రా హోల్డింగ్స్ డైరెక్టర్స్‌లో ఒకరైన ఫణి కర్రా గతంలో విట్స్లీ ఐటీ సొల్యూషన్స్ ప్రైవేటు లిమిటెడ్‌కు డైరెక్టర్‌గా పనిచేశారని.. ఆ కంపెనీ యాన్వల్స్టేట్మెంట్ కూడా పెట్టకుండా స్ట్రైక్ ఆఫ్ అయ్యిందని చెప్పారు. ఈ విషయాన్ని మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ ఎఫైర్స్ స్వయంగా వెల్లడించిందని పేర్కొన్నారు. ఇలాంటి ట్రాక్ రికార్డు ఉన్న వీళ్లు ఎక్కడి నుంచి 839 కోట్లు తీసుకొచ్చి తెలంగాణలో పెట్టుబడి పెడతారని ప్రశ్నించారు. ఫ్రాడ్ కంపెనీల కోసం రేవంత్ రెడ్డి అమెరికా వెళ్లారా? అని నిలదీశారు.
తెలంగాణ ప్రజాధనంతో సీఎం రేవంత్ రెడ్డి అమెరికా వెళ్లారని.. కేటీఆర్‌తో పోటీపడాలని.. ఆయన కంటే మెరుగ్గా పనిచేస్తున్నానని చెప్పుకోవడం కోసం ప్రయత్నిస్తున్నారని క్రిశాంక్ అన్నారు. కేటీఆర్‌తో పోటీపడాలని అనుకున్నప్పుడు ఒరిజినల్ కంపెనీలను తీసుకురావాలి కానీ.. ఫ్రాడ్ కంపెనీలను ఎందుకు తీసుకొస్తున్నారని ప్రశ్నించారు. ఇది తెలంగాణకు అంత మంచిది కాదని అన్నారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరిని కలిసినా.. ఎవరితో వ్యాపారం చేసినా వారి ట్రాక్ రికార్డు బాగుండాలని సూచించారు. ఇలా ఎవరిని పడితే వాళ్లను కలిసి.. స్ట్రైక్ఆఫ్ అయిన కంపెనీలతో ఒప్పందాలు చేసుకుని వస్తే ఎవరూ ఊరుకోరని స్పష్టం చేశారు. రానున్న రోజుల్లో అయినా ఎవరితో సమావేశం అవుతున్నారనేది తెలుసుకుని చేయాలని విజ్ఞప్తి చేశారు.