Harish Rao | హైదరాబాద్ : తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ప్రజా పాలన ప్రతాపం చూసి పాపం కాళోజీ ఆత్మ ఎంత తల్లడిల్లిందో.. నా గొడవ ఎంత ఘోషించిందో అని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావు పేర్కొన్నారు. శాసనసభలో బడ్జెట్‌పై చర్చ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలోని మొదటి పేజీ చాప్టర్1, మొదటి లైన్లో చెప్పిందేమిటంటే ‘పూర్తి స్థాయి ప్రజాస్వామిక పరిపాలన‘ అందిస్తామన్నరు. పూర్తి ప్రజాస్వామిక పాలన అంటే ప్రజల భావ ప్రకటనా స్వేచ్చకు, నిరసన తెలియజేసే హక్కుకు హామీపడతామనే కదా అధ్యక్షా? కానీ వాస్తవంలో జరుగుతున్నది ఏమిటి అధ్యక్షా..! అని రేవంత్ ప్రభుత్వాన్ని హరీశ్‌రావు నిలదీశారు.
చదువుల తల్లి నిలయమైన సిటీ సెంట్రల్ లైబ్రరీలో పరీక్షలకోసం విద్యార్థులు చదువుకుంటూ ఉంటే, అక్రమంగా పోలీసులు చొరబడి గేట్లకు తాళాలేసి విద్యార్థులను నిర్బందించి, లాఠీలతో వీరంగం వేసి వీపులు చిట్ల గొట్టారు. ఈ సంఘటన చూసి సరస్వతీ దేవి కూడా కన్నీరు పెట్టుకొని ఉంటది. ఆ లైబ్రరీలో ఉన్న పుస్తకాల రచయితల ఆత్మలు ఘోషించి ఉంటాయి అధ్యక్షా. అందులో చంద్రబాబు నాయుడికి రేవంత్ రెడ్డి బహూకరించిన కాళోజీ నా గొడవ పుస్తకం కూడా ఉండే ఉంటది. రేవంత్ రెడ్డి ప్రజా పాలన ప్రతాపం చూసి పాపం కాళోజీ ఆత్మ ఎంత తల్లడిల్లిందో. కాళోజీ నా గొడవ ఎంత ఘోషించిందో. ఒక నిరుద్యోగ విద్యార్థి సోషల్ మీడియాలో కాళోజీ కవిత పెట్టిండు. ఏమనంటే అధ్యక్షా.. “ఓటిచ్చునప్పుడే ఉండాలి బుద్ధి, ఎన్నుకొని తలబాదుకున్ననేమగును’’ ఇగ ఇంత కంటే నేను చెప్ప అధ్యక్షా అని హరీశ్‌రావు పేర్కొన్నారు.
ఆదిలాబాద్‌లో రైతులు ఎరువులు అడిగినందుకు లాఠీచార్జే సమాధానం. నడిరోడ్డు మీద నిరుద్యోగులపై లాఠీలు ఝుళిపించడమేనా మీరు చెప్పిన పూర్తి స్థాయి ప్రజాస్వామ్యం. ఆర్ట్స్ కాలేజీలో జరుగుతున్న లాఠీచార్జీని చిత్రీకరిస్తున్న జర్నలిస్టును అసభ్య పదజాలంతో బూతులూ తిట్టి, కొట్టడమేనా కాంగ్రెస్ మార్కు ప్రజాస్వామ్యమా ? ఇందిరమ్మ పాలననా ? అంగన్వాడీలు, ఆశావర్కర్లు తమ డిమాండ్ల సాధన కోసం రోడ్డెక్కితే అణచివేతనే. ప్రతిపక్ష కార్యకర్తలపై ప్రతీకార దాడులు. ప్రభుత్వాన్ని ప్రశ్నించే వారిపై అక్రమ కేసులు – నిలదీసిన వారిపై దాడులు. చివరికి సోషల్ మీడియాలో పోస్టులు పెడితే కూడా బెదిరింపూలూ, కేసులు. జైళ్లు. మొత్తం మీద కాంగ్రెస్ తెచ్చిన మార్పు ఎట్లా ఉందంటే విద్యార్థి నులకు ఇస్తామన్న స్కూటీలా లేదు. పోలీసులు విచ్చలవిడిగా ప్రయోగిస్తున్న లాఠీలా ఉంది. ఇదేనా మీరు చెప్పిన పూర్తి స్థాయి ప్రజాస్వామిక సుపరిపాలనా ముఖచిత్రం..? ప్రజల గొంతులు నొక్కేస్తూ, వీపులు వాయగొడుతూ ప్రజాపాలనఅని చెప్పుకోవడం మీకే చెల్లింది. ఎంతైనా ఎమర్జెన్సీ ప్రయోగించిన ఇందిరమ్మ రాజ్యం ఎట్లాఉండాలనోగట్లే ఉన్నది అని హరీశ్‌రావు ధ్వజమెత్తారు.
ఇవి కూడా చదవండి..
Harish Rao | బీర్లు, లిక్కర్ ధరలు భారీగా పెంచబోతున్నారు..! : హరీశ్‌రావు
TG EdCET | టీజీ ఎడ్‌సెట్, టీజీ పీఈసెట్ కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల
Harish Rao | అధ్యక్షా ఆయనకు హాఫ్ నాలెడ్జ్.. మంత్రి కోమటిరెడ్డిపై హరీశ్ రావు ఫైర్