Harish Rao | ఖమ్మం : రాష్ట్రంలో భారీ వర్షాలు, వరదలకు చనిపోయిన వారి విషయంలోనూ సీఎం రేవంత్ రెడ్డి అబద్ధాలు చెబుతున్నారని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌రావు మండిపడ్డారు. చనిపోయిన వారి విషయంలో సంఖ్య తక్కువ చేసి చూపించే ప్రయత్నం చేస్తున్నారు అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఖమ్మం జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ కార్యాలయంలో హరీశ్‌రావు మీడియాతో మాట్లాడారు.
సీఎం రేవంత్ రెడ్డి 16 మంది చనిపోయినట్టు చెప్పారు. కానీ మా వద్ద స్పష్టంగా వివరాలు ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలకు, వరదలకు 30 మంది చనిపోయిన వారి వివరాలు ఉన్నాయి. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 11 మంది, మహబూబాబాద్‌లో 3, సూర్యాపేటలో ఇద్దరు, , ములుగులో ఇద్దరు, ఆదిలాబాద్‌లో ఒక్కరు, నారాయణపేటలో ఇద్దరు, నాగర్‌కర్నూల్‌లో గుర్తు తెలియని డెడ్ బాడీ దొరికింది. వనపర్తిలో ఒకరు, పెద్దపల్లిలో ఇద్దరు, కామారెడ్డిలో ఒకరు, సిద్దిపేటలో ఇద్దరు, రంగారెడ్డిలో ఇద్దరు చనిపోయారు. ప్రభుత్వం ఏమో 16 మంది అని చెబుతున్నారు. మరణాల విషయంలోనూ ప్రజలను రాష్ట్ర ప్రభుత్వం తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తుందని హరీశ్‌రావు మండిపడ్డారు.
భక్తరామదాసు, పాలమూరు ఎత్తిపోతల పంప్ హౌస్‌లు నీట మునిగాయి. దీనికి పూర్తిగా ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణం. 2 వేల ఎకరాల్లో పంట నష్టం జరిగింది. ప్రభుత్వ యంత్రాంగం సకాలంలో స్పందించి ఉంటే వేల ఎకరాల్లో పంట నష్టం జరిగి ఉండకపోయేది. నష్టపోయిన పంటకు ఎకరానికి రూ. 30 వేలు ఇవ్వాలని గతంలో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి డిమాండ్ చేశారు. ప్రతి ఎకరాకు రూ. 30 వేలు ఇచ్చి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. మీ తప్పిదం వల్ల సాగర్ కెనాల్ తెగిపోయింది. రైతులు బాధపడుతున్నారు. కన్నీళ్లు పెట్టుకున్నారని హరీశ్‌రావు తెలిపారు.
అన్ని మేమే చేస్తే సీఎం కుర్చీలో నువ్వు ఎందుకు రేవంత్ రెడ్డి. రైతు రుణమాఫీ కాలేదంటే హరీష్ రావు ఇంటింటికి పోయి కాగితాలు జమచేసి తెచ్చి ఇవ్వాలంటాడు. కేంద్రం బడ్జెట్లో నిధులు కేటాయించకపోతే కేసీఆర్ వెళ్లి ఢిల్లీలో దీక్ష చేయాలంటాడు. వరదలు వచ్చినాయి సహాయం చేయండి అంటే బీఆర్ఎస్ వాళ్ళు చేయాలంటాడు. అన్ని మేమే చేస్తే సీఎం కుర్చీలో నువ్వు ఎందుకు రేవంత్ రెడ్డి? అని హరీశ్‌రావు నిలదీశారు.
ఇవి కూడా చదవండి..
Harish Rao | సీఎం రేవంత్ రెడ్డికి వ్యంగ్యం ఎక్కువ.. పనితనం తక్కువ : హరీశ్ రావు
Jagadish Reddy | దాడులకు భయపడుతామనుకుంటే అది మీ భ్రమ, ప్రజల తరఫున పోరాడుతాం : జగదీశ్వర్ రెడ్డి
KTR | ఖమ్మంలో బీఆర్ఎస్ నేతలపై దాడి చేయడం కాంగ్రెస్ అసహనానికి నిదర్శనం : కేటీఆర్