Harish Rao | హైదరాబాద్ : సీతారామ ప్రాజెక్టు కేసీఆర్ క్రెడిట్ కాదని గుండెల మీద చేయి వేసుకోని చెప్పమనండి అని మంత్రి తుమ్మల నాగేశ్వర్రావుకు మాజీ నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు సవాల్ విసిరారు. సీతారామ ప్రాజెక్టు నా జీవిత కల.. దాన్ని కేసీఆర్ సాకారం చేశారని గతంలో ఇదే తుమ్మల నాగేశ్వర్ రావు మాట్లాడారని హరీశ్‌రావు గుర్తు చేశారు. తెలంగాణ భవన్లో హరీశ్‌రావు మీడియాతో మాట్లాడారు.
కేసీఆర్ ఆనవాళ్లు చెరిపేస్తామని బీరాలు పలికిన కాంగ్రెస్ నాయకులు.. కేసీఆర్ సాధించిన విజయాలను మీవిగా చెప్పుకోవడానికి తాపత్రయం పడుతున్నారంటేనే అది మా నైతిక విజయానికి సూచిక. మీ తండ్లాట చూస్తుంటే మేం నైతికంగా గెలిచినట్లే. ఈ ఎనిమిది నెలల కాలంలో ఒక్క మంచి పని కూడా చేయలేదు. సీతారామ ప్రాజెక్టు నిర్మాణం కోసం మేం కృషి చేస్తుంటే ఇదే కాంగ్రెస్ నాయకులు కోర్టుల్లో కేసులు వేశారు. ఈ ప్రాజెక్టు శంకుస్థాపన చేసిన సందర్భంగా తుమ్మల నాగేశ్వర్ రావు మాట్లాడుతూ.. సీతారామ ప్రాజెక్టు తన జీవిత కల, ఆకాంక్ష అని చెప్పారు. ఈ రోజు మాత్రం అదే తుమ్మల నాగేశ్వర్ రావు మాట మార్చారు. సీతారామ ప్రాజెక్టు నిర్మాణం బీఆర్ఎస్ పార్టీ ఘనత కాదని తుమ్మలను గుండెల మీద చేయి వేసుకోని చెప్పమనండి. కేసీఆర్ లేకుండా ఉంటే అంత గొప్పగా సీతారామ ప్రాజెక్టుకు రూపకల్పన జరిగేదా..? సీతారామ కేసీఆర్ కల.. ఇది ఆయన కృషి ఫలితం. చాలా దూరదృష్టితో కేసీఆర్ ఆలోచించారు అని హరీశ్‌రావు తెలిపారు.
గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం.. రాజీవ్ సాగర్, ఇందిరా సాగర్‌లో కూడా కొన్ని మండలాలు, నియోజకవర్గాలు వదిలిపెట్టేసింది. ప్రతి ఏడాది కృష్ణాలో ఆలస్యంగా నీరు రావడంతో ఒక పంట మాత్రమే వేసేవారు. గోదావరిని ఒడిసి పట్టుకుని ఖమ్మం జిల్లా ప్రవహిస్తోంది. ఎన్నో ప్రభుత్వాలు వచ్చాయి కానీ ఖమ్మం జిల్లాకు గోదావరి నీళ్లు రాలేదు. ఖమ్మం జిల్లాను రెండు పంటలు పండే జిల్లాగా మార్చాలని సీతారామ ఎత్తిపోతలకు కేసీఆర్ రూపకల్పన చేశారు. రాజీవ్ సాగర్, ఇందిరా సాగర్‌లో నీటి సామర్థ్యం 3 వేల క్యూసెక్కులు. కానీ సీతారామ ప్రాజెక్టుకు 9 వేల క్యూసెక్కులు తెచ్చే విధంగా కేసీఆర్ ఆలోచించారు. ఓట్ల కోసం ప్రాజెక్టులు నిర్మించరు. భవిష్యత్ అవసరాల కోసం ప్రాజెక్టులు నిర్మిస్తారు. కృష్ణాలో నీళ్లు రాకపోయినా.. గోదావరి జలాలతో సాగర్ ఆయకట్టును సప్లిమెంట్ చేయాలని కేసీఆర్ అనుకున్నారు. ఖమ్మం జిల్లాలోని ప్రతి ఎకరానికి సాగునీరు అందించే విధంగా సీతారామ ప్రాజెక్టుకు కేసీఆర్ రూపకల్పన చేశారు అని హరీశ్‌రావు తెలిపారు.
కానీ సీతారామ ప్రాజెక్టు మేమే పూర్తి చేశామని కాంగ్రెస్ మంత్రులు అంటున్నారు. సీతారామ ప్రాజెక్టు మెయిన్ కెనాల్లో 8 ప్యాకేజీలు ఉన్నాయి. 5 ప్యాకేజీలు కంప్లీట్ పూర్తయ్యాయి. మిగతా 3 ప్యాకేజీల్లో 80 శాతం పని పూర్తయింది. ఓవరాల్‌గా బీఆర్ఎస్ హయాంలో 90 శాతం ప్రాజెక్టు పూర్తయింది. పంపులు, మోటార్లు కూడా అప్పుడే పెట్టాం. సబ్ స్టేషన్ల నిర్మాణం కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలోనే జరిగింది. ఇది అందరికీ తెలుసు. ఇక అక్కడికి వెళ్లి నీళ్లు చల్లుకుంటే తమ పాపాలు పోతాయని వారు అనుకుంటున్నారు. ఇదంతా కాంగ్రెస్ ప్రభుత్వం చేసినట్లు ప్రజలను నమ్మించడం పొరపాటు. ఎందుకంటే అది సీతారామ ప్రాజెక్టు.. శ్రీరామచంద్రుల సత్యవాక్కు పరిపాలనకు, సత్యానికి, ధర్మానికి ప్రతిరూపం.. ఆయన పేరు మీద కట్టిన ప్రాజెక్టుపై అసత్య ప్రచారాలు చేస్తే ఆ భగవంతుడు కూడా మిమ్మల్ని క్షమించడు. మీ పరిపాలనలో నిర్మించినప్పుడు మీ ఘనతగా చెప్పుకుంటే మాకు అభ్యంతరం లేదు. ఇతరుల ఘనతను తమ ఘనతగా చెప్పుకునే దరిద్రం నుంచి బయటకు రావాలని హరీశ్‌రావు సూచించారు.
నాడు సీతారామ ప్రాజెక్టు క్రెడిట్ కేసీఆర్‌దే అని చెప్పిన మంత్రి తుమ్మల ఇప్పుడు అదే మాట గుండెలపైనే చెయ్యేసుకుని చెప్పాలి.
⁃ మాజీ మంత్రి, ఎమ్మెల్యే @brsharish#SitaramaProject pic.twitter.com/OiU7X9CNAe
— BRS Party (@BRSparty) August 12, 2024
ఇవి కూడా చదవండి..
KTR | విద్యార్థుల తల్లిదండ్రులకు గర్భశోకం మిగల్చొద్దు.. కాంగ్రెస్ సర్కారుకు కేటీఆర్ సూచన
Nagarjuna Sagar | నాగార్జున సాగర్ డ్యాం క్రస్ట్ గేట్లు మూసివేత..