Harish Rao | హైదరాబాద్ : రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. 30 వేల ఉద్యోగాల కథ ఎట్ట ఉన్నదో.. సీతారామ ప్రాజెక్టు కథ కూడా అట్లనే ఉందని హరీశ్‌రావు పేర్కొన్నారు. సీతారామ ప్రాజెక్టు బీఆర్ఎస్ హయాంలోనే 90 శాతం పూర్తయింది.. కానీ మేమే ఈ ప్రాజెక్టును పూర్తి చేసినట్లు కాంగ్రెస్ నేతలు కటింగ్ ఇస్తున్నారంటూ హరీశ్‌రావు మండిపడ్డారు. తెలంగాణ భవన్లో హరీశ్‌రావు మీడియాతో మాట్లాడారు.
ఈ ప్రభుత్వంలో మంత్రులు సీతారామ ప్రాజెక్టు ప్రారంభోత్సవం కోసం సన్నాహక సమావేశాల పేరు మీద నెత్తిమీద నీళ్లు చల్లుకుంటూ పోటీలు పడుతున్నారు. ఒక మంత్రి మొదటి పంపు హౌజ్ బటన్ నొక్కి నీళ్లు నెత్తిమీద చల్లుకొని భూమికి దండం పెట్టిండు. వెంటనే ఇంకో మంత్రి వెళ్లి తన కంటే ముందు క్రెడిట్ కొట్టేయాలని ట్రాక్టర్ నడుపుతూ వెళ్లి ఇది నేనే చేస్తున్నట్టు నటించారు. నేను కదా నీటి పారుదల మంత్రిని అని చెప్పి.. ఆయన కూడా నిన్న వెళ్లి కట్కా ఒత్తి ఇది నా సొంతమని చెప్పకనే చెప్పారు. ఈ ముగ్గురు మంత్రులు క్రెడిట్‌కు పోయారు. ఇక 15న ముఖ్యమంత్రి వెళ్తారట అని హరీశ్‌రావు విమర్శించారు.
రాష్ట్రంలో సీతారామ ఎత్తపోతల పథకాన్ని.. కేసీఆర్ తన ఇష్టమైన ప్రాజెక్టుగా రూపొందించారు. కేసీఆర్ హయాంలో నిర్మించిన ప్రాజెక్టుపై క్రెడిట్ కొట్టేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం అపసోపాలు పడుతుంది. పదేండ్లలో బీఆర్ఎస్ చేసిన కృషి, సాధించిన గొప్ప విజయాలను తమ విజయాలుగా చెప్పుకునేందుకు కాంగ్రెస్ సర్కార్ ఫీట్లు పడుతుంది. ఖమ్మం జిల్లా కరువు బాధలు తీర్చాలని సీతారామ ప్రాజెక్టు నిర్మాణానికి కేసీఆర్ సంకల్పించారు. పవిత్రమైన ఈ ప్రాజెక్టుకు సాక్షాత్తు సీతారామచంద్రుల పేరే ఉండాలని వారి పేరు నామకరణం చేసి శరవేగంగా పూర్తి చేశారు అని హరీశ్‌రావు గుర్తు చేశారు.
సీతారామ ప్రాజెక్టుపై కాంగ్రెస్ నేతలు కోర్టుల్లో అనేక కేసులు వేసి అడ్డంకులు సృష్టించేందుకు ప్రయత్నం చేసినప్పటికీ, ఎప్పటికప్పుడు సమస్యలను పరిష్కరించుకుంటూ వేగంగా నిర్మించే ప్రయత్నం చేసింది బీఆర్ఎస్ ప్రభుత్వం. ప్రభుత్వం మారడంతో ఆ ప్రాజెక్టును ప్రారంభించే అవకాశం కాంగ్రెస్ సర్కార్‌కు దక్కింది. రిబ్బన్ కంటిగ్ అవకాశం వచ్చిందని చెప్పి ప్రాజెక్టే తాము కట్టినట్టు కటింగ్ ఇస్తే ప్రజలు నవ్వుకుంటారు. ఇతరుల ఘనత తమ ఘనతగా చెప్పుకునే వారిని పరన్నాజీవులు అంటారు. ఇవాళ కాంగ్రెసోళ్లను చూస్తుంటే పక్కా పరాన్నజీవులు అనిపిస్తుంది. ఒక ప్రాజెక్టు కట్టాలంటే సర్వే, డీపీఆర్, భూసేకరణ, టెండర్ల ప్రక్రియ, నిధులు సమకూర్చాలి.. ఇలా ఎన్నో దశలు పూర్తి కావాలి. ఇవన్నీ పూర్తి కావాలంటే కనీసం కొన్ని సంవత్సరాలు పడుతుంది. మరి ఏడెనిమిది నెలల్లోనే ఇన్ని దశలు దాటి మీరు కట్టేశారా..? డీపీఆర్, సర్వేలు, టెండర్లు, భూసేకరణ, పంపులు, మోటార్లు బిగించి ప్రారంభిస్తున్నారా..? మిమ్మల్ని చూసి ప్రజలు నవ్వుకుంటున్నారు అని హరీశ్‌రావు మండిపడ్డారు.
30 వేల ఉద్యోగాల కథ ఎట్ట ఉన్నదో సీతారామ ప్రాజెక్టు కథ కూడా అట్లనే ఉన్నది. బీఆర్ఎస్ హయాంలో నోటిఫికేషన్లు ఇచ్చి, పరీక్షలు నిర్వహించి, ఫిజికల్, మెడికల్ టెస్టులు చేసి ఫలితాలు విడుదల చేశాం. ఎన్నికల కోడ్, కోర్టు కేసులు, సాంకేతిక కారణాల వల్ల అపాయింట్మెంట్ ఆర్డర్లు ఆగిపోయాయి. కానీ ఇవాళ అపాయింట్మెంట్ ఆర్డర్లు ఇచ్చే అవకాశం ఇస్తే 30 వేల ఉద్యోగాలు ఇచ్చామని చెబుతున్నారు. అయితే సీతారామ ప్రాజెక్టు 90 శాతం బీఆర్ఎస్ చేసిందని నిజాలు చెప్పే ధైర్యం కాంగ్రెస్ మంత్రులకు లేదు. కానీ ఆ ధైర్యం కేసీఆర్‌కు ఉండే. నిండు శాసనసభలో సీఎం హోదాలో కేసీఆర్ మాట్లాడుతూ.. రాజీవ్ ఆరోగ్య శ్రీ, ఫీజు రీయింబర్స్మెంట్, 108 అంబులెన్స్‌లు.. రాజశేఖర్ రెడ్డి హయాంలో వచ్చిన వీటన్నింటిని యథావిధిగా కొనసాగిస్తామని ధైర్యంగా చెప్పిండు. సంస్కారం ఉన్న నాయకుడు కాబట్టి కేసీఆర్ బహిరంగంగా ప్రకటించారు. కానీ మీ సంస్కారం ఏంటి.. పాఠ్య పుస్తకాల్లో కేసీఆర్ పేరు, ఫొటో ఉన్నదని చెప్పి పేపర్లు చింపి తమ పేర్లను అతికించుకున్న చరిత్ర రేవంత్ రెడ్డిది. తమ హయాంలో పూర్తి చేసిన ఫ్లై ఓవర్లను, ప్రాజెక్టులను మాత్రమే ప్రారంభిస్తున్నారు. తమ హయాంలో ఆర్డర్లు ఇచ్చిన బస్సులకు జెండాలు ఊపుతున్నారు. కల్యాణలక్ష్మి చెక్కులు పంపిణీ చేస్తూ కాంగ్రెస్ నేతలు కాలం గడుపుతున్నారని హరీశ్‌రావు ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇవి కూడా చదవండి..
Nagarjuna Sagar | నాగార్జున సాగర్ డ్యాం క్రస్ట్ గేట్లు మూసివేత..
KTR | దళిత వాడలో వారం రోజులుగా నో కరెంట్.. డిప్యూటీ సీఎం గారూ జర చూడండి : కేటీఆర్
Abhishek Bachchan | ఐశ్వర్యారాయ్‌తో విడాకులు.. అభిషేక్ బచ్చన్ రియాక్షన్ ఇదే…!