న్యూఢిల్లీ, మార్చి 11: దేశంలో గ్యాస్ సంక్షోభం తీవ్రమవుతున్నది. పశ్చిమాసియా యుద్ధం నేపథ్యంలో గ్యాస్ సరఫరాలో అంతరాయం కారణంగా ఏర్పడిన ఎల్పీజీ సిలిండర్ల కొరత దేశంలోని అనేక ప్రాంతాల్లో తీవ్ర ప్రభావం చూపుతున్నది. దీంతో హోటళ్లు, రెస్టారెంట్లు, ప్రజా క్యాంటీన్లు తమ కార్యకలాపాలపై కోత విధించుకోగా కొన్ని ప్రత్యామ్నాయ ఇంధనాల వైపు మళ్లాయి. కొన్ని చోట్ల హోటళ్లు, రెస్టారెంట్లు తాత్కాలికంగా మూతపడ్డాయి. ప్రత్యేకంగా పట్టణ ప్రాంతాల్లోని రెస్టారెంట్లు తీవ్ర వాణిజ్య ఎల్పీజీ సిలిండర్ల కొరతను ఎదుర్కొంటున్నాయి. దీంతో అనేక హోటళ్లు తమ మెనూను తగ్గించుకోక తప్పలేదు. హోటళ్ల నిర్వహణకు అవరోధం ఏర్పడకూడదన్న ఉద్దేశంతో ప్రత్యామ్నాయ వంట పద్ధతులను అవలంబిస్తున్నాయి. ఎల్పీజీ సిలిండర్లను సరఫరా చేయడానికి విక్రేతలు నిరాకరించడంతో వ్యాపారం పూర్తిగా నిలిచిపోయిందని ఢిల్లీలోని వసంత్ కుంజ్‌లో క్లౌడ్ కిచెన్ నిర్వహిస్తున్న గగన్‌దీప్ సింగ్ సప్రా అనే వ్యాపారి తెలిపారు.
దోస కౌంటర్లు తొలగింపు
ముంబైలో గ్యాస్ అధికంగా ఖర్చయ్యే వంటకాలపై ఇప్పటికే కొన్ని రెస్టారెంట్లు కోత విధించాయి. ప్రముఖ రెస్టారెంట్ వసంత్ భువన్‌లో దోస, పావ్ భాజీ తయారుచేసే లైవ్ కౌంటర్లు మూతపడ్డాయి. రెస్టారెంట్లో వంటల తయారీకి ఇండక్షన్ స్టవ్‌లు, బొగ్గు ఆధారిత కుంపట్లను ఉపయోగిస్తున్నారు. గ్యాస్ సరఫరా త్వరలో పునరుద్ధరణ కాకపోతే తమ కార్యకలాపాలను పూర్తిగా నిలిపివేయాల్సి వస్తుందని రెస్టారెంట్ యజమానులు తెలిపారు. చెన్నైపై కూడా ఎల్పీజీ కొరత తీవ్ర ప్రభావం చూపుతున్నది. దాదాపు ఐదు లక్షల వాణిజ్య ఎల్పీజీ సిలిండర్ల సరఫరాను నిలిపివేయడంతో పరిస్థితి ఆందోళనకరంగా మారిందని గ్యాస్ పంపిణీ కంపెనీ వర్గాలు తెలిపాయి. ప్రత్యామ్నాయ ఇంధన వనరుల కోసం చూడాలని హోటళ్లు, పరిశ్రమలకు సూచించినట్లు ఆ వర్గాలు చెప్పాయి. తదుపరి విడత వాణిజ్య సిలిండర్లు మార్చి 28న సరఫరా అయ్యే అవకాశం ఉందని వారు చెప్పారు. తమిళనాడులో ఇప్పటికే అనేక హోటళ్లు, రెస్టారెంట్లు మూతపడ్డాయి.
ఎల్పీజీ సరఫరా లేకపోవడంతో మార్చి 11న హోటల్‌ను మూసివేస్తున్నట్లు చెన్నైలోని ఓ హోటల్ నోటీసు అంటించింది. బిర్యానీకి పేరుపొందిన హైదరాబాద్‌లోని ప్రముఖ రెస్టారెంట్ చెయిన్ షా గౌస్ కేఫ్ ఎల్పీజీ సిలిండర్ల కొరత కారణంగా సంప్రదాయ కట్టెల పొయ్యికి మారింది. రంజాన్ మాసంలో ఫుడ్ బిజినెస్ జోరుగా సాగుతుందని, ఎల్పీజీ సరఫరాలో అంతరాయం కారణంగా నగరంలోని అనేక రెస్టారెంట్లు మూతపడగా కొన్ని తమ మెనూను తగ్గించుకోవలసి వచ్చిందని షా గౌస్ కేఫ్ యజమానులు తెలిపారు. దేశ రాజధానిలో కూడా గ్యాస్ కొరత ప్రభావం కనిపిస్తున్నది. ఎల్పీజీ సిలిండర్ల కొరత కారణంగా వండిన ఆహారాన్ని అందచేయలేమని తెలియచేస్తూ ఢిల్లీ హైకోర్టు లాయర్ల క్యాంటీన్లో అన్ని టేబుళ్ల వద్ద నోటీసులు అతికించారు. దీర్ఘకాలిక అంతరాయానికి వ్యాపార సంస్థలు సిద్ధంగా ఉండాలని పరిశ్రమల సంఘాలు సూచిస్తున్నాయి.
ఎల్పీజీపై ఆధారపడడం మాని ఎలక్ట్రిక్ కుకింగ్కు మారాలని ఛత్తీస్‌గఢ్ హోటల్ అండ్ రెస్టారెంట్ అసోసియేషన్ రాష్ట్రంలోని హోటళ్లు, రెస్టారెంట్లు, ఫుడ్ పాయింట్లకు సూచించింది. ప్రజా క్యాటరింగ్ సర్వీసులపై కూడా ఎల్పీజీ సిలిండర్ల కొరత ప్రభావం చూపిస్తున్నది. మైక్రోవేవ్‌లు, ఇండక్షన్ కుక్‌టాప్‌లు వంటి ప్రత్యామ్నాయ కుకింగ్ పద్ధతులకు మారిపోవాలని ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్(ఐఆర్సీటీసీ) రైల్వే స్టేషన్లలోని క్యాటరింగ్ యూనిట్లను ఆదేశించింది. ఎల్పీజీ ఆధారిత వంట లభ్యం కాని పక్షంలో రెడీ టు ఈట్ ఆహార పదార్థాల నిల్వలు ఉంచుకోవాలని కోరింది.
వంటింటిపై ప్రభావం
వంట గ్యాస్ కొరత దేశంలోని అనేక నగరాల్లో గృహ వినియోగదారులపై కూడా ప్రభావం చూపుతున్నది. భోపాల్, చండీగఢ్‌లో గ్యాస్ ఏజెన్సీల వెలుపల ప్రజలు పెద్ద సంఖ్యలో బారులు తీరి నిలబడిన దృశ్యాలు కనిపిస్తున్నాయి. ఆన్లైన్ బుకింగ్ వ్యవస్థ పనిచేయకపోవడంతో ప్రజలు స్వయంగా ఖాళీ సిలిండర్లతో గ్యాస్ ఏజెన్సీలకు చేరుకుంటున్నారు. తమిళనాడులోని తిరుపూర్‌లో చిన్న వ్యాపార సంస్థలపై గ్యాస్ కొరత తీవ్ర ప్రభావం చూపుతున్నది. 50కిపైగా వెల్డింగ్ షాపులు మూతపడ్డాయి. రోజుకు కనీసం మూడు సిలిండర్లు అవసరమవుతాయని వాటి యజమానులు చెప్పారు. కాగా, గ్యాస్ కొరత మరింత దిగజారిన పక్షంలో తీసుకోవలసిన అత్యవసర చర్యలపై కొన్ని రాష్ర్టాలు ప్రత్యామ్నాయ ప్రణాళికలు రూపొందిస్తున్నాయి. ఎల్పీజీ సరఫరాల అంతరాయం కొనసాగితే వ్యాపార సంస్థలు తమ కార్యకలాపాలను కొనసాగించేందుకు వంట చెరకును సరఫరా చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు ఉత్తరాఖండ్ అటవీ శాఖ మంత్రి సుబోధ్ చెప్పారు. ఎల్పీజీ సరఫరాను వెంటనే పునరుద్ధరించకపోతే రానున్న రోజుల్లో దేశవ్యాప్తంగా రెస్టారెంట్లు, ఫుడ్ పాయింట్లు, చిన్న వ్యాపార సంస్థలు తాత్కాలికంగా మూతపడే ప్రమాదం ఉందని, ఇది దేశ ఆర్థిక పరిస్థితిని దెబ్బతీయగలదని పరిశ్రమ వర్గాలు ప్రభుత్వాన్ని హెచ్చరించాయి.
పీజీ హాస్టల్స్‌లో భోజనం కట్
వాణిజ్య గ్యాస్ కొరత బెంగళూరులోని పేయింగ్ గెస్ట్(పీజీ) హాస్టళ్లపై ప్రభావం చూపింది. గ్యాస్ వాడకాన్ని ఆదాచేసి పేయింగ్ గెస్టులకు నిరంతర ఆహార సరఫరా జరిగేలా చూసే లక్ష్యంతో పీజీ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ తాత్కాలిక మార్గదర్శకాలను జారీచేసింది. నగరంలో లక్షలాది మందికి ఆహారం అందచేస్తున్న పీజీ వసతి సముదాయాలు గ్యాస్ ఎక్కువ ఖర్చయ్యే వంటకాల జోలికి పోరాదని అసోసియేషన్ ఆదేశించింది. అంతేగాక ఎల్పీజీకి ప్రత్యామ్నాయ కుకింగ్ పద్ధతులను అన్వేషించాలని కూడా కోరింది. ప్రస్తుత పరిస్థితుల్లో వాణిజ్య సిలిండర్లు దొరకడం లేదని పలువురు పీజీ ఓనర్లు తెలిపారు. తాత్కాలిక చర్యల్లో భాగంగా సోమవారం నుంచి శుక్రవారం వరకు రోజుకు రెండు సార్లు మాత్రమే భోజనం సమకూర్చాలని పీజీ నిర్వాహకులను ఓనర్ల సంఘం ఆదేశించింది. శని, ఆదివారాలు మాత్రం మూడు పూటలా భోజనం పెట్టాలని సూచించింది. గ్యాస్ ఎక్కువ ఖర్చయ్యే పూరీ, దోశ, చపాతి వంటి ఆహార పదార్థాల తయారీని నిలిపివేయాలని పీజీల నిర్వాహకులను సంఘం కోరింది. బియ్యంతో తయారయ్యే బిసిబేలీబాత్, చిత్రాన్నం, పులిహోర వంటి ప్రత్యామ్నాయాలకు ప్రాధాన్యం ఇవ్వాలని కోరింది.