Road accident : జమ్మూ నగరం (Jammu city) లో ఘోర రోడ్డు ప్రమాదం (Road Acident) జరిగింది. స్థానిక శకుంతల ఫ్లైఓవర్‌పై విద్యార్థులతో వెళ్తున్న మినీబస్సు అదుపుతప్పి బోల్తా పడింది. ఆదివారం రాత్రి జరిగిన ఈ ఘటనలో 29 మంది విద్యార్థులు గాయపడ్డారు. క్షతగాత్రులను వెంటనే ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వీరిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. ఈ విషయాన్ని జమ్మూ ప్రభుత్వ వైద్య కళాశాల అధికారులు వెల్లడించారు.
ప్రమాదంలో కొందరికి ఎముకలు విరిగినట్లు అధికారులు తెలిపారు. తిరంగా ర్యాలీలో పాల్గొనేందుకు విద్యార్థులు బాగ్-ఎ-బహు ప్రాంతానికి వెళ్లారు. అక్కడి నుంచి ముబారక్ మండీకి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఆ విద్యార్థినులంతా డిఫెన్స్ సర్వీసెస్, పోలీసు ఉద్యోగాల కోసం శిక్షణ పొందుతున్నారు. గాయపడిన వారిలో జమ్మూలోని వివిధ ప్రాంతాలకు చెందిన విద్యార్థినులు ఉన్నారు.
గాయపడిన 29 మంది విద్యార్థినిల్లో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉందని అధికారులు చెప్పారు. ఈ ఘటనపై జమ్మూకశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా తీవ్ర ఆవేదన వ్యక్తంచేశారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.