Varanasi | దర్శకధీరుడు రాజమౌళి, సూపర్‌స్టార్ మహేశ్‌బాబు కాంబినేషన్లో తెరకెక్కుతున్న అత్యంత ప్రతిష్ఠాత్మక చిత్రం ‘వారణాసి’. ‘ఆర్ఆర్ఆర్’తో అంతర్జాతీయ స్థాయిలో సంచలనం సృష్టించిన తర్వాత రాజమౌళి రూపొందిస్తున్న సినిమా కావడంతో ఈ ప్రాజెక్ట్‌పై మొదటి నుంచే భారీ అంచనాలు నెలకొన్నాయి. అందుకు తగ్గట్టుగానే సినిమా నుంచి వస్తున్న ప్రతి అప్డేట్ అభిమానుల్లో ఆసక్తిని పెంచుతోంది. ఇప్పుడు ఈ చిత్రానికి సంబంధించి ఓ ఆసక్తికరమైన మల్టీస్టారర్ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. మహేశ్‌బాబు కెరీర్లో 29వ చిత్రంగా రూపొందుతున్న ‘వారణాసి’లో గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా, మలయాళ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. భారీ స్థాయిలో అడ్వెంచర్, యాక్షన్ అంశాలతో తెరకెక్కుతున్న ఈ సినిమాలో పలు కాలాలను, విభిన్న ప్రపంచాలను కలిపి రాజమౌళి సరికొత్త అనుభూతిని అందించబోతున్నట్లు ఇప్పటికే ప్రచారం జరుగుతోంది.
‘వారణాసి’ కథలో త్రేతాయుగానికి సంబంధించిన కీలకమైన ఎపిసోడ్ ఉంటుందని, ఆ భాగంలో మహేశ్‌బాబు శ్రీరాముడి పాత్రలో కనిపించనున్నారని ఇప్పటికే వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఇప్పుడు మరో ఆసక్తికరమైన అంశం తెరపైకి వచ్చింది. శ్రీరాముడి పాత్రలో మహేశ్‌బాబు కనిపించే ఎపిసోడ్లో హనుమంతుడిగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించనున్నారనే ప్రచారం సినీ వర్గాల్లో జోరుగా సాగుతోంది.అయితే ఈ విషయంపై ఇప్పటివరకు చిత్ర బృందం నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. మొదట హనుమంతుడి పాత్ర కోసం మరో నటుడి పేరు వినిపించినప్పటికీ, ఈ పాత్రకు కావాల్సిన పవర్ఫుల్ స్క్రీన్ ప్రెజెన్స్, బాడీ లాంగ్వేజ్ దృష్ట్యా రామ్ చరణ్ అయితే మరింత ప్రభావవంతంగా ఉంటుందని రాజమౌళి భావిస్తున్నారనే టాక్ వినిపిస్తోంది.
రాజమౌళి, రామ్ చరణ్ కాంబినేషన్‌కు ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. ‘ఆర్ఆర్ఆర్’లో అల్లూరి సీతారామరాజుగా చరణ్‌ను అద్భుతంగా ఆవిష్కరించిన రాజమౌళి.. క్లైమాక్స్‌లో ఆయనను రాముడి రూపంలో చూపించిన విధానం ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. ఇప్పుడు అదే దర్శకుడు ‘వారణాసి’లో చరణ్‌ను హనుమంతుడి పాత్రలో చూపిస్తే అది సినిమాకే ప్రత్యేక ఆకర్షణగా మారుతుందని అభిమానులు భావిస్తున్నారు.ఇటీవల ‘పెద్ది’తో చరణ్ తన కెరీర్లో మరో భారీ విజయాన్ని అందుకున్న నేపథ్యంలో ఆయన లుక్, యాక్షన్, బాడీ లాంగ్వేజ్‌పై కూడా అభిమానుల్లో భారీ క్రేజ్ ఉంది. అలాంటి చరణ్‌ను హనుమంతుడి పాత్రలో చూపిస్తే వెండితెరపై ఆ పాత్ర ఏ స్థాయిలో ప్రభావం చూపుతుందోననే ఆసక్తి నెలకొంది.