దుబాయ్, మార్చి 11: పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. హొర్ముజ్ జలసంధి గుండా భారత్ వస్తున్న ఓ నౌకపై దాడి జరిగింది. ఈ ఘటనలో ముగ్గురు గల్లంతు కాగా, 20 మందిని రక్షించారు. థాయ్‌లాండ్ జెండాతో యూఏఈలోని పోర్టు నుంచి గుజరాత్‌లోని కండ్లా రేవుకు వెళుతున్న ఈ రవాణా నౌకపై హొర్ముజ్ జలసంధిలో బుధవారం దాడి జరిగింది. దాడి అనంతరం నౌకకు నిప్పంటుకుంది. మంటలను విపత్తు రక్షక బృందాలు అదుపులోకి తెచ్చాయి. నౌక నుంచి 20 మందిని రక్షించారని, ముగ్గురు గల్లంతయ్యారని ఒమన్ అధికారులు తెలిపారు. ఒమన్ ఉత్తర తీరానికి 11 నాటికల్ మైళ్ల దూరంలో ప్రిషియస్ కంపెనీకి చెందిన ఈ మయుశ్రీ నారీ నౌకపై గుర్తు తెలియని ఆయుధాలతో దాడి జరిగిందని రాయల్ థాయ్ నేవీ, యునైటెడ్ కింగ్డమ్ సముద్ర కార్యకలాపాల విభాగం ప్రకటించాయి. ప్రమాదం జరిగిన వెంటనే ఒమన్ నావికా దళం రక్షణ కార్యక్రమాలు చేపట్టి 20 మందిని రక్షించారని, అయితే ముగ్గురు గల్లంతయ్యారని తెలిపాయి. ఈ దాడిని ఇరాన్ చేసినట్టు అంతర్జాతీయ మీడియా కథనాలు తెలిపాయి. హొర్ముజ్ జలసంధిలో మరో రెండు వాణిజ్య నౌకలపై కూడా ఇరాన్ దాడులు జరిపింది. అమెరికా, ఇజ్రాయెల్, వాటి మిత్రదేశాలకు చెందిన నౌకలను టార్గెట్ చేస్తామని ఇరాన్ హెచ్చరించింది.
ఇద్దరు భారతీయులు మృతి
పశ్చిమాసియాలో వాణిజ్య నౌకలపై జరిగిన దాడుల్లో ఇద్దరు భారతీయులు మరణించగా, మరొకరి జాడ తెలియడం లేదని భారత విదేశాంగ శాఖ ప్రతినిధి రణధీర్ జైశ్వాల్ బుధవారం వెల్లడించారు. మరణించిన ఇద్దరూ వాణిజ్య నౌకల్లో ఉన్నారన్నారు. ప్రభుత్వం ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నదని, బాధిత కుటుంబాల వారికి తమ మద్దతు ఉంటుందని చెప్పారు.
పర్షియన్ గల్ఫ్‌లో చిక్కుకున్న భారత నౌకలు, నావికులు
పర్షియన్ గల్ఫ్‌లో భారత్‌కు చెందిన 28 వాణిజ్య నౌకలు, 778 మంది నావికా సిబ్బంది చిక్కుకుపోయారని భారత ప్రభుత్వ అధికారి ఒకరు బుధవారం తెలిపారు. 24 నౌకలు హొర్ముజ్ జలసంధి పశ్చిమ ప్రాంతంలో ఉన్నాయి. వీటిలో 677 మంది సిబ్బంది ఉన్నారు. అలాగే తూర్పు వైపు నాలుగు నౌకలు, 101 మంది సిబ్బంది ఉన్నారని పోర్టు మంత్రిత్వ శాఖ ప్రత్యేక కార్యదర్శి రాజేశ్ కుమార్ సిన్హా బుధవారం మీడియాకు తెలిపారు.
వాణిజ్య నౌకపై దాడిని ఖండించిన భారత్
థాయ్‌లాండ్ జెండాతో గుజరాత్‌లోని కండ్లా రేవుకు వెళుతున్న ఓ రవాణా నౌకపై హొర్ముజ్ జలసంధిలో జరిగిన గుర్తు తెలియని క్షిపణి దాడిని భారత్ బుధవారం ఖండించింది. ఈ తరహా దాడుల్లో భారతీయ పౌరులతోసహా విలువైన ప్రాణాలు పోతున్నాయని ప్రభుత్వం తెలిపింది. ఘర్షణల తొలి దశలో ఇటువంటి దాడులు అనేకం జరిగి పలువురు ప్రాణాలు కోల్పోయారని, దాడుల తీవ్రత పెరుగుతూ పోతున్నదని ప్రభుత్వం పేర్కొన్నది. వాణిజ్య నౌకలు, అందులోని పౌర సిబ్బందిపై దాడులు తగవని ప్రభుత్వం తెలిపింది.