Harish Rao | హైదరాబాద్ : కేసీఆర్ ప్రారంభించిన గురుకులాల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని, రాజకీయాల కారణంగా కనీస మౌలిక సదుపాయాలు కల్పించడం లేదని మాజీ మంత్రి హరీశ్‌రావు మండిపడ్డారు. ఈ 11 నెలల కాంగ్రెస్ పాలనలో 36 మంది రెసిడెన్షియల్ విద్యార్థులు మృతి చెందారని హరీశ్‌రావు తెలిపారు. ఆసిఫాబాద్ జిల్లాలోని వాంకిడి గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్‌తో నిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థినులను బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావు పరామర్శించారు.
ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ.. కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి మండల గిరిజన బాలికల రెసిడెన్షియల్ స్కూల్లో 60 మంది అస్వస్థతకు గురైతే ఇద్దరు బాలికలను నిమ్స్‌కు తీసుకొచ్చారు. ఎనిమిదో తరగతి బాలిక మహాలక్ష్మి, తొమ్మిదో తరగతి బాలిక జ్యోతిలను మెరుగైన చికిత్స కోసం నిమ్స్ తరలించారని తెలిసి వారి ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకోవడానికి ఇక్కడికి వచ్చాను. మహాలక్ష్మి కోలుకున్నా, జ్యోతి ఆరోగ్య పరిస్థితిని మెరుగు పరచడానికి డాక్టర్లు ప్రయత్నిస్తున్నారు. 9వ తరగతి చదువుతున్న శైలజ అనే అమ్మాయి వెంటిలేటర్‌పై చావు బతుకుల మధ్యలో కొట్టుమిట్టాడుతుంది. దైర్యంగా ఉండాలని పిల్లల తల్లిదండ్రులకు ధైర్యం చెప్పామని హరీశ్‌రావు తెలిపారు.
పరిస్థితులు అన్నీ మెరుగ్గా ఉంటాయి.. ఉన్నత ప్రమాణాలతో కూడిన విద్య రెసిడెన్షియల్ స్కూళ్లలో దొరుకుతుందని ఎన్నో ఆశలతో తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ గురుకుల పాఠశాలల్లో చేర్పిస్తున్నారు. అయితే గత పదకొండు నెలల కాంగ్రెస్ పాలనలో తల్లిదండ్రుల నమ్మకాన్ని పోగొట్టే విధంగా ప్రభుత్వ రెసిడెన్షియల్ స్కూళ్లలో పరిస్థితులు దిగజారాయి. రెసిడెన్షియల్ స్కూళ్లలో మౌలిక సదుపాయాల కల్పనలో ప్రభుత్వం ఘోరంగా విఫలమయ్యిందని వరసగా జరుగుతున్న ఘటనలు చెబుతున్నాయి. ఇప్పటిదాకా నాకు తెలిసిన సమాచారం ప్రకారం ప్రభుత్వ రెసిడెన్షియల్ స్కూళ్లలో 36 మంది విద్యార్ధులు వివిధ కారణాలతో చనిపోయారు. 36 మంది విద్యార్థుల మరణాలు అంటే చిన్న విషయం కాదు.. సగటుగా నెలకు ముగ్గురు ప్రభుత్వ రెసిడెన్షియల్ విద్యార్థులు మరణిస్తున్నారంటే ప్రభుత్వం సీరియస్‌గా ఆలోచించాలని హరీశ్‌రావు సూచించారు.
దాదాపు 600 మంది విద్యార్థులు ఈ ఏడు నెలల్లో ఫుడ్ పాయిజనింగ్ బారిన పడ్డారు. పాములు, ఎలుకల కాట్ల ఘటనలు తరచుగా జరుగుతున్నాయి. పిల్లలకు కరెంట్ షాక్‌లు కూడా కామన్ అయిపోయాయి. ఇటీవలే మెదక్ హవేలీ ఘన్పూర్ బాలికల రెసిడెన్షియల్ స్కూల్లో పిల్లలకు కరెంట్ షాక్ తగిలి హాస్పిటల్లో చేరాల్సి వచ్చింది. ఎన్నిసార్లు ప్రభుత్వ దృష్టికి తెచ్చినా దున్నపోతు మీద వానపడ్డట్టే ఉంది. సీఎం, మంత్రులు అందరూ మహారాష్ట్ర, ఝార్ఖండ్ ఎన్నికల బిజీలో ఉన్నారు. రెసిడెన్షియల్ స్కూళ్లపై పట్టించుకునే తీరిక వారికి ఎక్కడ ఉంది? అని హరీశ్‌రావు నిలదీశారు.
ప్రతి రోజూ రెసిడెన్షియల్ ప్రభుత్వ పాఠశాలలు ఉన్న దుస్థితుల గురించి మీడియాలో కథనాలు కూడా వస్తున్నాయి. వాటిపై నిప్పు మీద నీళ్లు జల్లినట్టు అప్పటికప్పుడు చర్యలు తీసుకోవడం కాదు, శాశ్వత చర్యలు చేపట్టాలి. 36 మంది రెసిడెన్షియల్ విద్యార్థుల మరణాలు ప్రభుత్వం చేసిన హత్యలే అని అనడంలో ఎలాంటి తప్పులేదు. ఈ మరణాలపై ప్రభుత్వంలో ఏ స్థాయిలోనూ సమీక్షలు జరగడం లేదు. మా ఎమ్మెల్యే కోవా లక్ష్మీ విద్యార్థులకు అయ్యే ఖర్చులకు డబ్బులు ఇచ్చి పంపిస్తే హాస్పిటల్‌కి వచ్చే పరిస్థితి ఏర్పడింది అని హరీశ్‌రావు గుర్తు చేశారు.
ఇవి కూడా చదవండి..
Inter Exam Fee | ఇంటర్ ఎగ్జామ్ ఫీజు తేదీలు వచ్చేశాయ్..
Noel Tata | టాటా సన్స్‌లోకి అడుగుపెట్టిన నోయల్ టాటా.. అధికారికంగా ప్రకటించిన బోర్డు