శుక్రవారం 26 ఫిబ్రవరి 2021
Telangana - Jan 27, 2021 , 13:31:04

ప్రతి మహిళా పోలీస్‌ ఒక స్టార్‌: నటి అనుష్క

ప్రతి మహిళా పోలీస్‌ ఒక స్టార్‌: నటి అనుష్క

హైదరాబాద్‌: మగవారికి పోటీగా మహిళా పోలీసులు పనిచేస్తున్నారని సైబరాబాద్‌‌ సీపీ సజ్జనార్‌ అన్నారు. పోలీసు శాఖలో మహిళలకు కూడా ఎక్కువ అవకాశాలు ఉన్నాయని చెప్పారు. మహిళా పోలీసు అధికారులు సమర్థవంతంగా పనిచేస్తున్నారని చెప్పారు. ఫిల్మ్ నగర్‌లో పోలీసుల ఆధ్వర్యంలో ‘ షీ సాహి’ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి సినీనటి అనుష్క ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మహిళా భద్రతా అదనపు డీజీ స్వాతిలక్రా, సైబరాబాద్‌ సీపీ సజ్జనార్‌, షీ టీమ్స్‌ డీసీపీ అనసూయతో కలిసి సైబరాబాద్‌ డయల్‌ 100 క్విక్‌ రెస్పాన్స్‌ వాహనాలను అనుష్క ప్రారంభించారు. అనంతరం సైబరాబాద్‌ కమిషనరేట్‌ పరిధిలో విశిష్ట సేవలందించిన పోలీసులకు అవార్డులు అందించారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ.. సైబరాబాద్‌లో 12 శాతం మంది మహిళా ఉద్యోగులు ఉన్నారని చెప్పారు. ట్రాఫిక్‌, సైబర్‌ క్రైం సహా అన్ని విభాగాల్లో మహిళలు ఉన్నారని వెల్లడించారు. పిల్లలు, మహిళల భద్రతపై ప్రత్యేక శద్ధవహించామని చెప్పారు. ఈ ఏడాది సైబరాబాద్‌కు 750 మంది మహిళా కానిస్టేబుళ్లు పోస్టింగ్‌పై వచ్చారని చెప్పారు. షీటీంతో సమాజంలో తప్పక మార్పు వస్తుందన్నారు. సమాజం, దేశం కోసం స్త్రీ శక్తి సన్నద్ధం కావాలన్నారు. 

విధి నిర్వహణలో స్త్రీ, పురుషులనే వివక్ష ఉండదని డీజీ స్వాతిలక్రా అన్నారు. 2014లో షీ టీమ్స్‌ మొదలు పెట్టామని, షీ టీమ్‌ విభాగంలో పురుషులు కూడా ఉన్నారని చెప్పారు. మహిళల భద్రత కోసం తెలంగాణ ఉమెన్‌ సేఫ్టీ వింగ్‌ ఏర్పాటు చేశామన్నారు. మహిళల కోసం రాష్ట్రంలో నాలుగు భరోసా సెంటర్లు ఉన్నాయని చెప్పారు. ఈ ఏడాది భరోసా కేంద్రాలను 10కి పెంచుతామన్నారు. సైబరాబాద్‌ పరిధిలో ఒకేసారి 2058 సీసీ కెమెరాలు ఏర్పాటుచేశామన్నారు.  

ప్రతి మహిళా పోలీస్‌ ఒక స్టార్‌ అని అనుష్క అన్నారు. కొవిడ్‌ సమయంలో పోలీసులు చాలా బాగా పనిచేశారని చెప్పారు. తెలంగాణలో ఇంతమంది మహిళా పోలీసులు ఉండటం సంతోషకరమని చెప్పారు. ఇలాంటి బృహత్తర కార్యక్రమంలో పాల్గొనడం ఆనందంగా ఉందన్నారు. 

VIDEOS

logo