గురువారం 13 ఆగస్టు 2020
Telangana - Jul 30, 2020 , 02:59:25

జిల్లాకో ప్రధాన పంట!

జిల్లాకో ప్రధాన పంట!

  • సాగుకు, ఎగుమతులకు ప్రోత్సాహం
  • పలు జిల్లాలకు పంటలు సూచిస్తూ రాష్ర్టానికి కేంద్రం లేఖ
  • మార్పులతో జాబితా సిద్ధంచేస్తున్న వ్యవసాయశాఖ 

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: వన్‌ డిస్ట్రిక్‌.. వన్‌ ప్రొడక్ట్‌(ఓడీవోపీ) లక్ష్యంతో ఒక్కో జిల్లాకు ఒక్కో ప్రధాన పంట సాగును ఎంపికచేయాలని కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు లేఖ రాసింది. తెలంగాణలో ఇప్పటికే డిమాండ్‌ ఉన్న పంటలనే సాగుచేయాలని రైతాంగానికి సీఎం కేసీఆర్‌ దిశానిర్దేశం చేసిన విషయంతెలిసిందే. ఈ క్రమంలో జిల్లా భౌగోళిక పరిస్థితులు, నేల స్వభావం, మార్కెట్‌ డిమాండ్‌ తదితర సమగ్ర సమాచారంతో నియంత్రితసాగులో మున్ముందుకు సాగుతున్న వ్యవసాయశాఖ ఇప్పుడు జిల్లాలవారీగా ప్రధాన పంటల జాబితాలను సిద్ధంచేస్తున్నది. ఏ జిల్లాలో ఏ పంట ఎక్కువగా పండుతుంది? దాని ప్రత్యేకత ఏమిటి? తదితర వివరాలను వ్యవసాయ, ఉద్యానశాఖలు సేకరిస్తున్నాయి. 

ఓడీవోపీలో భాగంగా కేంద్రం కొన్ని పంటలను ఇప్పటికే సూచించింది. ఈ పంటలు ఆయా జిల్లాలకు సరిపోని పక్షంలో మార్పుచేసి పంపాలని సూచించింది. ఇంకా ఏమైనా అదనపు పంటలున్నా పంపించాలని రాష్ర్టాలను కోరింది. ఓడీవో పీ ప్రకారం నిజామాబాద్‌, జగిత్యాల, కరీంనగర్‌, వరంగల్‌, నల్లగొండ, జిల్లాలకు వరి పంటను కేంద్రం సూచించింది. రంగారెడ్డి, మహబూబాబాద్‌ జిల్లాలు మామిడి పంటకు అనుకూలమని పేర్కొన్నది. రాష్ట్ర ఉద్యానశాఖ మామిడి పంటకు రంగారెడ్డి, మహబూబ్‌నగర్‌, నాగర్‌కర్నూల్‌, వరంగల్‌, మహబూబాబాద్‌, జగిత్యాల, వనపర్తి జిల్లాలను ప్రతిపాదించింది. అదేవిధంగా మిర్చి సాగుకు ఖమ్మం, వరంగల్‌ జిల్లాలను, నిజామాబాద్‌, కరీంనగర్‌ జిల్లాల్లో పసుపు, నల్లగొండకు నిమ్మజాతి పండ్ల తోటలు, సంగారెడ్డి జిల్లాకు అల్లం పంటను, సిద్దిపేట జిల్లాకు పచ్చిమిర్చి పంటను సూచించింది. 

నారాయణపేట, వికారాబాద్‌ జిల్లాలకు కంది, నారాయణపేట, గద్వాల్‌ జిల్లాలకు పల్లికాయ (గ్రౌండ్‌నట్‌) పంటలను సూచించింది. మహబూబ్‌నగర్‌ జిల్లాకు జొన్న, సజ్జ పంటలను రాష్ట్ర వ్యవసాయశాఖ ప్రతిపాదించింది. జిల్లాకో ప్రధాన పంటను గుర్తించడం వల్ల ఆ పంటలపై ప్రత్యేక దృష్టిని కేంద్రీకరించే అవకాశం ఉన్నది. ఆ పంట ఎగుమతులను ప్రొత్సహించేందుకు వాల్యూ అడిషన్‌ చేయనున్నారు. ఈ ప్రతిపాదనలు ఇంకా ప్రాథమికదశలోనే ఉన్నాయి. జాబితాను కేంద్రానికి పంపిన తర్వాత అంగీకారం వస్తే కార్యాచరణ మొదలు పెట్టనున్నారు. వన్‌ డిస్ట్రిక్ట్‌ వన్‌ ప్రొడక్ట్‌కు ప్రత్యేక బడ్జెట్‌ కేటాయింపులేమీ ఉండబోవని సమాచారం.


logo