ముంబై, మే 10: ప్రముఖ నగల వ్యాపార సంస్థ కల్యాణ్ జువెల్లర్స్ గత ఆర్థిక సంవత్సరం (2023-24) క్యూ4 లేదా ఆఖరి త్రైమాసికానికి (జనవరి-మార్చి)గాను పన్ను అనంతరం రూ.137.49 కోట్ల ఏకీకృత లాభం ప్రకటించింది. ఏడాది క్రిందటితో పోల్చితే 97 శాతం పెరిగినట్టు శుక్రవారం తెలియజేసింది. నాడు రూ.69.79 కోట్లుగానే ఉన్నది. ఆదాయం కూడా 34 శాతం వృద్ధితో రూ.4,534.93 కోట్లకు చేరింది. పోయినసారి రూ.3,381.80 కోట్లే. ఇదిలావుంటే ఈ ఏడాది మార్చితో ముగిసిన 2023-24 ఆర్థిక సంవత్సరానికిగాను ఒక్కో ఈక్విటీ షేర్‌కు రూ.1.2 తుది డివిడెండ్‌ను సంస్థ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లు సిఫార్సు చేశారు.
ఇది భాగస్వాముల అనుమతికి లోబడి ఉంటుంది. బాంబే స్టాక్ ఎక్సేంజ్ (బీఎస్ఈ)లో శుక్రవారం సంస్థ షేర్ విలువ 3.37 శాతం ఎగిసి రూ.410.85 వద్ద ముగిసింది. ‘గత ఆర్థిక సంవత్సరం మా వ్యాపారం బాగానే సాగింది. బంగారం ధరల్లో ఒడిదొడుకులున్నా ఈ ఆర్థిక సంవత్సరం కూడా ఉత్సాహంతో ముందుకెళ్తు న్నాం. ముఖ్యంగా ఈ పెండ్లిళ్ల సీజన్లో కస్టమర్ల నుంచి విశేష స్పందన లభించింది. అక్షయ తృతీయ జోష్ కనిపిస్తున్నది’ అని కల్యాణ్ జువెల్లర్స్ ఇండియా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రమేశ్ కల్యాణరామన్ అన్నారు.