హైదరాబాద్, మే 11 (నమస్తే తెలంగాణ): వార్ధా నదిపై నిర్మించనున్న డాక్టర్ బీఆర్ అంబేద్కర్ వార్ధా బరాజ్ తుది డీపీఆర్‌ను తెలంగాణ సర్కారు కేంద్ర జల సంఘాని(సీడబ్ల్యూసీ)కి పంపింది. రూ.4,550.73 కోట్లతో ప్రతిపాదనలు సిద్ధం చేసి, అనుమతుల కోసం విజ్ఞప్తి చేసింది. ఈ ప్రాజెక్టు ద్వారా మొత్తం లక్షా 40 వేల ఎకరాల ఆయకట్టుకు నీరందనున్నది. కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా కౌటాల మండలంలోని గుండాయిపేట్ గ్రామం, అటు మహారాష్ట్రలోని చంద్రాపూర్ జిల్లా అడేగావ్ గ్రామం మధ్య డాక్టర్ బీఆర్ అంబేద్కర్ వార్ధా బరాజ్‌ను నిర్మించనున్నారు. రూ.4,550.73 కోట్లతో ఇప్పటికే డీపీఆర్‌ను సిద్ధం చేశారు. తొలుత రూ.4,874 కోట్లతో డీపీఆర్‌ను సిద్ధం చేయగా, అందులో 300 కోట్లకుపైగా ప్రభుత్వం తగ్గించింది.
తుది డీపీఆర్‌ను అనుమతుల కోసం గురువారం కేంద్ర జల సంఘానికి (సీడబ్ల్యూసీ) తెలంగాణ సర్కారు సమర్పించింది. బరాజ్ నిర్మాణం ద్వారా ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాలో మొత్తంగా 1,40,742 ఎకరాలకు సాగునీరు అందనున్నది. అదేవిధంగా బరాజ్‌కు ఇరువైపులా తెలంగాణ, మహారాష్ట్రలో కరకట్టలను నిర్మించనున్నారు. తెలంగాణలో 14 కిలోమీటర్లు, మహారాష్ట్రలో 13 కిలోమీటర్ల మేర కరకట్టలు నిర్మించేందుకు ప్రణాళికలు రూపొందించారు. బరాజ్ నిర్మాణానికే పరిమితం కాకుండా ప్రతిపాదిత ఆయకట్టుకు సంబంధించి సాగునీటి కాలువల నిర్మాణానికి అయ్యే మొత్తం వ్యయాన్ని కూడా కలిపి డీపీఆర్‌ను రూపొందించడం విశేషం. బరాజ్ నిర్మాణ వ్యయం కన్నా కరకట్టలు, కాలువల నిర్మాణానికే అధికమొత్తంలో నిధులను వెచ్చిస్తూ అంచనాలను రూపొందించారు.
నాడు ఇష్టారీతిన డిజైన్
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సర్కారు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ప్రాణహిత చేవేళ్ల సుజల స్రవంతి ప్రాజెక్టు డిజైన్‌ను ఇష్టారీతిన చేపట్టింది. వార్ధా, వైన్‌గంగా నదులు కలిసిన తర్వాత కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా కౌటాల మండలం తుమ్మిడిహట్టి వద్ద రూ. 2,500 కోట్లతో బరాజ్‌ను నిర్మించాలని ప్రతిపాదించింది. అయితే, ప్రతిపాదిత ప్రదేశం వద్ద బరాజ్ నిర్మాణానికి సాంకేతిక అంశాలు సానుకూలంగా లేవని అధికారులు ఆదిలోనే అభ్యంతరం వ్యక్తం చేశారు. బరాజ్‌ను నిర్మించాలంటే నీటి ప్రవాహం 90 డిగ్రీల లంబకోణంలో ఉండాల్సి ఉండగా, తుమ్మిడిహట్టి వద్ద పరిస్థితి అందుకు విరుద్ధంగా ఉన్నదని గుర్తించారు. అది కూడా కేవలం 45 డిగ్రీల స్క్యూ షేప్‌లో బరాజ్‌ను నిర్మించాల్సి వస్తున్నదని, అది అంత క్షేమదాయకం కాదని, ఇప్పటివరకూ ఆ స్క్యూ షేప్‌లో బరాజ్ నిర్మాణానికి సంబంధించిన డిజైన్లు ఎక్కడా అందుబాటులో కూడా లేవని ఇంజినీరింగ్ నిపుణులు స్పష్టం చేశారు.
మొత్తంగా తుమ్మిడిహట్టి వద్ద 1.5 టీఎంసీల నిల్వ సామర్థ్యంతో బరాజ్‌ను నిర్మించాలంటే సుమారు 6 కిలోమీటర్ల మేర కాంక్రీట్ నిర్మాణం చేపట్టాల్సి ఉంటుందని, 100 నుంచి 110 గేట్లను ఏర్పాటు చేయాల్సి ఉంటుందని అంచనా రూపొందించారు. మొత్తంగా బరాజ్ నిర్మాణానికి రూ. 2,500 కోట్లకు పైగా వెచ్చించాల్సి వస్తుందని లెక్కలు వేశారు. కేవలం 20 టీఎంసీల నీటిని ఎత్తిపోసేందుకుగాను అంత పెద్దమొత్తం వెచ్చించడం నిరర్థకమని, మున్ముందు నిర్వహణ భారమవుతుందని అభిప్రాయం వ్యక్తం చేశారు. ప్రతిపాదిత తుమ్మిడిహట్టి పక్కనే చార్పాలా వైల్డ్ లైఫ్ శాంక్చువరీ ఉండడంతోపాటు దాదాపు 2,448 హెక్టార్ల అటవీ భూమి ముంపునకు గురవుతున్నది. ఈ నేపథ్యంలో భవిష్యత్తులో సీడబ్ల్యూసీ అనుమతులు పొందడానికి సైతం అనేక ఆటంకాలు ఏర్పడే అవకాశమున్నదని సందేహాలు లేవనెత్తారు.
సీఎం కేసీఆర్ సుదీర్ఘ మేధోమథనం
ఇప్పటికే హైడ్రాలజీ క్లియరెన్స్
వార్ధా బరాజ్‌కు సంబంధించి ఇప్పటికే హైడ్రలాజికల్ క్లియరెన్స్‌లు ఉన్నాయి. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా 20 టీఎంసీలతో ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాలో మొత్తంగా 5 నియోజకవర్గాల్లో 2 లక్షల ఎకరాలకు నీరందించాల్సిన ప్రణాళికలను రూపొందించింది. ఈ మేరకు బరాజ్ నిర్మాణానికి తెలంగాణ ప్రభుత్వం అనుమతులు తీసుకొన్నది. అయితే ప్రస్తుతం అందులో 11.50 టీఎంసీలతో వార్ధా బరాజ్ నిర్మించి 1.40 లక్షల ఎకరాలకు నీరందించనున్నారు. అలాగే, మిగిలిన 8.5 టీఎంసీల నీటిని మంచిర్యాల జిల్లాలోని ఆయకట్టుకు ఇవ్వాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా ఇప్పటికే చెన్నూరు లిఫ్ట్‌ల నిర్మాణానికి ప్రభుత్వం అనుమతులు మంజూరు చేసింది.
వార్ధా బరాజ్ విశేషాలు..
ఆయకట్టు
నియోజకవర్గం : ఎకరాలు
సిర్పూర్ కాగజ్‌నగర్ : 43,364
ఆసిఫాబాద్ : 11,489
బెల్లంపల్లి : 64,704
స్థిరీకరణ : 21,185
మొత్తం ఆయకట్టు : 1,40,742