సిరిసిల్ల రూరల్, నవంబర్ 28: మాజీ మావోయిస్టు, డిప్యూటి దళాకమాండర్, బీఆర్ఎస్ నేత బల్లెపు నర్సయ్య ఆలియాస్ సిద్దన్న(Siddanna), అలియాస్ బాపురెడ్డి దారుణ హత్యకు గురయ్యాడు. సిద్దన్నను చంపేశారనే విషయం తెలిసి స్వగ్రామం రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం గండిలచ్చపేట ఉలిక్కిపడింది. గురువారం సాయంత్రం వేములవాడ
శివారులోని ఆగ్రహారం గుట్టల్లో జగిత్యాల జిల్లాకు చెందిన సంతోష్ ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. రాత్రి కుటుంబసభ్యులకు సమాచారం అందివ్వగా హుటాహుటినా ఘటన స్థలానికి చేరున్నారు. జిల్లా ఎస్పీ మహేష్ బి.గితే మహేశ్ బాబాసాహెబ్, పోలిసు అధికారులతో కలిసి ఘటన స్థలాన్ని పరిశీలించారు. అనంతరం వేములవాడ ప్రభుత్వ దవాఖానాలోని మార్చురీలోని సిద్దన్న మృతదేహాన్ని పరిశీలింలించి కుటుంబసభ్యులతో మాట్లాడారు.
అయితే.. సిద్దన్నను సంతోష్ ఒక్కడే హత్య చేయలేదని, మరికొంత మంది హస్తం ఉందని ఆనుమానాలు వ్యక్తం చేస్తూ కుటుంబ సభ్యులు లిఖిత పూర్వకంగా పోలిసులకు పిర్యాదు చేశారు. పోస్టుమార్టం నిర్వహించి, కుటుంబసభ్యులకు సిద్దన్న మృతదేహాన్ని అప్పగించారు. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. సిద్దన్నకు ఇద్దరు భార్యలు పోశవ్వ, ఎల్లవ్వలు ఉన్నారు. మొదటి భార్యకు కొడుకు అశోక్, రెండో భార్యకు కొడుకు నరేష్, కూతురు ఉన్నారు.
ఘటనా స్థలాన్ని పరిశీలిస్తున్న ఎస్పీ, పోలీసు అధికారులు

మూడేళ్ల క్రితం ఓ యూట్యూబ్ చానల్లో బల్లెపు సిద్దన్న, మరొ ఇద్దరు మాజీ మావోయిస్టులతో కలిసి ఇంటర్యూ ఇచ్చాడు. ఈ
ఇంటర్యూలో తాము మావోయిస్టుగా ఉన్న సమయంలో పలానా వారిని ఈ విధంగా చంపామంటూ ఆయన వివరించాడు. యూట్యూబ్‌లో సిద్ధన్న ఇంటర్యూ చూసిన జగిత్యాల జిల్లాకు చెందిన సంతోష్ ఎలాగైనా సిద్ధన్నను మట్టుబెట్టాలని నిర్ణయించుకున్నాడు. తన ప్రణాళికలో భాగంగా మూడు నెలలుగా అతడు సిద్ధన్నతో స్నేహం పెంచుకున్నాడు. యూట్యూబ్ ఇంటర్యూ చేస్తామని గురువారం మధ్యాహ్నం వేళ సిద్దన్నను అగ్రహారం గుట్టల వద్దకు రప్పించాడు. అక్కడ ఆయనకు
మద్యం తాగించిన సంతోష్ అంనతరం బండరాయితో మోది, తర్వాత గొంతుకోసి చంపినట్లు పోలీసులు గుర్తించారు. అక్కడి నుంచి పరారైన నిందితుడు సంతోష్ జగిత్యాలలో పోలీసులకు లొంగిపోవడంతో హత్య విషయం వెలుగులోకి వచ్చింది.
వేములవాడ దవాఖానలో సిద్దన్న మృతదేహానికి శుక్రవారం పోస్టుమార్టం నిర్వహించి కుటుంబసభ్యులకు అప్పగించారు. అనంతరం వారు సిద్ధన్న మృతదేహాన్ని స్వగ్రామమైన గండిలచ్చపేటకు తీసుకెళ్లారు. బహ్రెయిన్‌లో ఉంటున్న కొడుకు అశోక్ తండ్రి మృతి వార్తతో స్వగ్రామానికి బయలు దేరాడు. అతడు శనివారం సొంతూరు చేరుకోనుండడంతో, అంత్యక్రియలను శనివారం నిర్వహిస్తామని కుటుంబసభ్యులు తెలిపారు. మాజీ మావోయిస్టు బల్లెపు సిద్దన్న 2004లో పోలీసులకు లొంగిపోయారు. తర్వాత కేసీఆర్ సారథ్యంలో తెలంగాణ ఉద్యమంలో పాల్నొన్నాడు. అనంతరం కేటీఆర్ సమక్షంలో బీఆర్ర్ఎస్లో చేరిన సిద్ధన్న 2014లో ఎంపీటీసీగా పోటి చేసి ఓడిపోయాడు. తర్వాత సిరిసిల్ల ఎఎంసీ డైరెక్టర్ గా పనిచేశాడు. సిద్దన్నహత్యకు గురికావడంతో పార్టీ నేతలు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ పార్టీ మండలాధ్యక్షుడు గజభీంకార్ రాజన్న, సింగిలి విండో చైర్మన్ బండి దేవదాస్ గౌడ్, పడిగెలరాజు, మాజీ వైస్ ఎంపీపీ అంజయ్య వేములవాడ ప్రభుత్వ దవాఖానకు వెళ్లి సిద్ధన్న మృతదేహానికి పోస్టుమార్టం పూర్తయ్యేవరకు అక్కడే ఉన్నారు.