Harish Rao | అన్నం పెట్టినోళ్లకు ఓటేద్దామా.. సున్నం పూసినోళ్లకు ఓటేద్దామా అని మాజీ మంత్రి, డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్‌రావు ప్రశ్నించారు. మెదక్ జిల్లా సదాశివపేటలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో హరీశ్‌రావు మాట్లాడుతూ.. సదాశివపేటలో బీఆర్ఎస్ గెలుపు ఖాయమని అనిపిస్తోందని అన్నారు. రెండున్నరేళ్లలో రేవంత్ సర్కార్ చేసిందేమీ లేదని హరీశ్‌రావు విమర్శించారు. భార్యకు బస్సు ఫ్రీ ఇచ్చి.. భర్తకు డబుల్ టికెట్ ఇచ్చాడని అన్నారు. ఏం మంచి పని చేశామని ఓట్లు వేయమని అడుగుతారని ప్రశ్నించారు. రేవంత్ నోటి వెంట బూతులు తప్ప మంచిమాటలు రావడం లేదని మండిపడ్డారు. రూ.4వేల పింఛన్ ఇవ్వలేదు.. ఒక్కొక్కరికీ రూ.52వేలు బాకీ పడ్డారని అన్నారు. అవ్వాతాతలు మీకు ఇవ్వాల్సిన బాకీ డబ్బులు రూ.52 వేలు ఇవ్వాలని నిలదీయాలని సూచించారు.
సదాశివపేట, సంగారెడ్డిలో మంచి ఆస్పత్రులు కట్టామని హరీశ్‌రావు తెలిపారు. బిడ్డ పుడితే రూ.13 వేలు ఇచ్చి అంబులెన్స్‌లో జాగ్రత్తగా ఇళ్ల వద్ద దించామని పేర్కొన్నారు. సదాశివపేటలో మంచినీటి కష్టాలు తీర్చింది కేసీఆర్ అని తెలిపారు. కల్యాణలక్ష్మీ కింద ఆడబిడ్డల పెళ్లి రూ.లక్ష ఇచ్చామని పేర్కొన్నారు. రేవంత్ రెడ్డి తులం బంగారం ఇస్తానని చెప్పిండని.. ఇంతవరకూ ఇచ్చిండా అని ప్రశ్నించారు. ఏ ఒక్కరికైనా తులం బంగారం వచ్చిందా అని నిలదీశారు.
డబ్బులు ఇచ్చి కాంగ్రెసోళ్లు ఒట్టు పెట్టించుకుంటారని హరీశ్‌రావు తెలిపారు. కాంగ్రెసోళ్లు రూ.5వేలు ఇచ్చిండ్రు.. ఓటు మాత్రం కారుకు వేస్తానని ఓ వృద్ధురాలు చెప్పిందని పేర్కొన్నారు. 50 పడకల ఆస్పత్రి కట్టామని.. కొత్త బస్టాండ్ కూడా కట్టించామని చెప్పారు. సదాశివపేటలో రూ.250 కోట్ల అభివృద్ధి చేపట్టామని తెలిపారు. మోసం చేసిన కాంగ్రెస్‌కు ఓట్లు వేసి గోసపడదామా అని ప్రశ్నించారు. గొర్రె పిల్లల పథకం, చేప పిల్లల పథకం బంద్ అయ్యిందని చెప్పారు. కేసీఆర్ కిట్ బంద్.. ఫీజు రీయింబర్స్మెంట్ బంద్ అయ్యిందని అన్నారు. కేసీఆర్ పథకాలన్నింటినీ సీఎం రేవంత్ రెడ్డి బంద్ పెడుతున్నాడని తెలిపారు. అన్ని పథకాలు బంద్ పెట్టి గోసపెడుతున్న రేవంత్‌కు ఓట్లేద్దామా అని ప్రశ్నించారు.
కాంగ్రెసోళ్లు బట్టేబాజ్ మాట్లాడుతుండ్రు అని మండిపడ్డారు. బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక స్పెషల్ ప్యాకేజీ తెచ్చి అన్ని విధాల అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. సదాశివపేట సమస్యలన్నీ బాగు చేయించే బాధ్యత తీసుకుంటానని తెలిపారు. కేసీఆర్ హయాంలో మున్సిపాలిటీలకు నిధులు ఇచ్చి అభివృద్ధి చేశారని గుర్తుచేశారు. బస్తీ దవాఖానాలు, వీధిలైట్లు, రోడ్లు, పార్కులు ఏర్పాటు చేశామని తెలిపారు. హిందువులు, ముస్లింలు, క్రిస్టియన్ల స్మశానవాటికలకు రూ.5 ఎకరాల చొప్పున ఇచ్చామని పేర్కొన్నారు. పట్టణాల్లో చెత్త ఎత్తని ముఖ్యమంత్రి, చెత్త మాటలు మాట్లాడుతుండని మండిపడ్డారు. లాగుల తొండలు వదులుతా.. పేగులు తీసి మెడలో వేసుకుంట.. గుడ్లు పీకి గోటీలాడుతా అని అంటున్నారని తెలిపారు. ఇలాంటి భాషనా ఓ ముఖ్యమంత్రి మాట్లాడేదని మండిపడ్డారు.
బీసీ, ఎస్సీ, ఎస్టీలు, విద్యార్థులు, ఉద్యోగులు, మహిళలను మోసం చేసిండని హరీశ్‌రావు మాట్లాడారు. ఏ ఒక్కరినీ వదలకుండా అన్ని వర్గాలనూ మోసం చేసిండని మండిపడ్డారు. డిక్లరేషన్లు మరిచిపోయిండు అని.. బూతుల డిక్లరేషన్లు చేసిండని తెలిపారు. ఈ బూతుల ముఖ్యమంత్రి ఓటుతో గట్టి బుద్ధి చెప్పాలని సూచించారు. చెత్త మాటలు వద్దు.. అభివృద్ధి కావాలంటూ ఓటుతో తెలియజెప్పాలన్నారు. బీఆర్ఎస్ అభ్యర్థులందరినీ గెలిపించుకోండని.. మీ సమస్యలన్నీ పరిష్కరించే బాధ్యత నాది అని స్పష్టంచేశారు.