Bhatti Vikramarka | హైదరాబాద్ : హైదరాబాద్ మహా నగరంలో విద్యుత్ సమస్యల పరిష్కారానికి 1912 హెల్ప్ లైన్ నంబర్‌తో పాటు పటిష్ట వ్యవస్థను ఏర్పాటు చేశామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. వర్షాకాలం దృష్ట్యా ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. జీహెచ్ఎంసీ పరిధిలోని విద్యుత్ శాఖ అధికారులు, సిబ్బందితో భట్టి విక్రమార్క సమీక్ష నిర్వహించారు. సమావేశం ముగిసిన అనంతరం భట్టి విక్రమార్క మీడియాతో మాట్లాడారు.
ఫార్మా, బయోటెక్, ఇతర సర్వీస్ రంగాల్లో హైదరాబాద్‌లో పెట్టుబడులు పెట్టడానికి మల్టీ నేషనల్ కంపెనీలు ఆసక్తిగా ఉన్నాయని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. హైదరాబాద్ నగరంలో వినియోగదారులందరికీ నాణ్యతతో కూడిన విద్యుత్‌ను సరఫరా చేయాలని ఆదేశించినట్లు చెప్పారు. వర్షాకాలం నేపథ్యంలో విద్యుత్ సరఫరాకు ఎక్కడా అంతరాయం కలగకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించినట్లు పేర్కొన్నారు. విద్యుత్ వినియోగదారుల సేవల కోసం ఏర్పాటు చేసిన 1912 హెల్ప్ లైన్‌కు విస్తృత ప్రచారం కల్పించనున్నట్లు తెలిపారు. 108 తరహాలో విద్యుత్ సంస్థ హెల్ప్ లైన్ సేవలను విస్తృతం చేస్తామన్నారు. గాలి పీల్చుకోవడం ఒక నిమిషం ఆగిపోతే ఎంత ప్రమాదమో విద్యుత్తు స్తంభిస్తే అంతే ప్రమాదంగా ప్రజలు భావిస్తున్నారని.. మారిన కాలానికి అనుగుణంగా విద్యుత్ సిబ్బంది సేవలు పెరగాలని డిప్యూటీ సీఎం సూచించారు.
విద్యుత్ శాఖ సేవా దృక్పథంతో పనిచేస్తుంది.. సమాజానికి వెలుగులు ఇచ్చే శాఖలో పని చేస్తున్నామనే భావన ఉద్యోగుల్లో ఉండాలి. ఆ భావన కల్పించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులను ఆదేశించినట్లు భట్టి విక్రమార్క పేర్కొన్నారు. మాకు బేషజాలు లేవు.. ఎంత చిన్నవారు సమస్యలు చెప్పిన వినడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. పదోన్నతులు బదిలీలకు సంబంధించిన కార్యాచరణ వెంటనే చేపట్టాలని ఉన్నతాధికారులను ఆదేశించామని భట్టి విక్రమార్క తెలిపారు.
ఇవి కూడా చదవండి..
TG CPGET 2024 | రేపు సీపీగెట్ – 2024 ఫలితాలు విడుదల..
TG PGECET | టీజీ పీజీఈసెట్ – 2024 ప్రవేశాలకు రీషెడ్యూల్ విడుదల
TG Weather | ఈ జిల్లాల్లో రెండురోజులు వానలు.. హెచ్చరించిన ఐఎండీ హైదరాబాద్