నిజామాబాద్ : గిరిజన ప్రాంతాల అభివృద్ధికి, గిరిజనుల అభ్యున్నతికి ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుందని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖా మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి (Minister Vemula Prashanth Reddy )అన్నారు. బాల్కొండ నియోజకవర్గం భీంగల్ మండల కేంద్రంలో గిరిజనుల ఆరాధ్యదైవం సంత్ సేవాలాల్ మహారాజ్ 284 జయంతి ముగింపు ఉత్సవాలను గురువారం అధికారికంగా నిర్వహించారు. రూ. 50 లక్షల నిధులతో నూతనంగా నిర్మించిన బంజారా భవన్‌ను మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ప్రశాంత్ రెడ్డి మాట్లాడారు.
బంజారాల జనాభా అధికంగా ఉన్న రాజస్థాన్(Rajasthan), మధ్యప్రదేశ్(Madya pradesh), గుజరాత్ (Gujarat), ఛత్తీస్ గఢ్(Chattisgarh) వంటి రాష్ట్రాలలో సైతం తెలంగాణాలో గిరిజనుల అభివృద్ధి కోసం అమలవుతున్న కార్యక్రమాలు కానరావని పేర్కొన్నారు. అడవి బిడ్డలైన బంజారాల కష్టాలు తెలిసిన వ్యక్తిగా ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR) వారి అభ్యున్నతి కోసం అనేక సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేస్తున్నారని గుర్తు చేశారు. తెలంగాణ(Telangana) ఏర్పాటుకు ముందు కేవలం ఏడు వందల తండాలు గ్రామ పంచాయతీలుగా ఉండగా నేడు కొత్తగా 2400 తండాలు జీ.పీలుగా అవతరించాయని వెల్లడించారు.
గ్రామ పంచాయతీలకు పక్కా భవనాల నిర్మాణాల కోసం ఒక్కో జీ.పీ కి రూ.20 లక్షల చొప్పున నిధులు మంజూరు చేశారని పేర్కొన్నారు . రూ. 1276 కోట్ల నిధులను వెచ్చిస్తూ ప్రతి తండాకు ప్రభుత్వం రోడ్డు సదుపాయం కల్పించిందని తెలిపారు. గిరిజన బిడ్డలకు అధునాతన సదుపాయాలతో నాణ్యమైన విద్యా బోధన అందాలనే తాపత్రయంతో కొత్తగా 300 వరకు ఎస్టీ రెసిడెన్షియల్ స్కూల్స్, ఆశ్రమ పాఠశాలలు, వసతి గృహాలను ప్రభుత్వం ఏర్పాటు చేసిందన్నారు.
ఆరు శాతానికి పరిమితమైన గిరిజన రిజర్వేషన్ ను జనాభా ప్రాతిపదికన పది శాతానికి పెంచిన ఫలితంగా అదనంగా 3200 మందికి ఇంజనీరింగ్ లో, 190 మందికి మెడిసిన్ కోర్సులలో ప్రవేశాలు లభించాయని వివరించారు. భీంగల్ లో గిరిజన రెసిడెన్షియల్ పాఠశాల ఏర్పాటుకు తనవంతు కృషి చేస్తానని మంత్రి హామీ ఇచ్చారు. కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు మాట్లాడుతూ, సంత్ సేవాలాల్ మహారాజ్ చూపిన మార్గంలో నడుస్తూ, ఆయన ఆశయాల సాధనకు కృషి చేసినప్పుడే ఆ మహనీయుడికి నిజమైన నివాళి అర్పించినట్లు అవుతుందన్నారు.
ఈ సందర్భంగా వేముల సురేందర్ రెడ్డి స్మారక క్రికెట్ టోర్నమెంట్లో గెలుపొందిన జట్లకు ట్రోఫీలతో పాటు, నగదు పారితోషికాలను మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అందజేశారు. ఈ కార్యక్రమంలో భీంగల్ మున్సిపల్ చైర్ పర్సన్ ప్రేమలత సురేందర్, రైతు బంధు సమితి జిల్లా అధ్యక్షురాలు మంజుల, ఎంపీపీ మహేశ్, జడ్పీటీసీ రవి, జడ్పీ కో-ఆప్షన్ సభ్యుడు మొయిజ్, బంజారా సేవా సంఘం ప్రతినిధులు పాల్గొన్నారు.
KTR | దిక్కుమాలిన కాంగ్రెస్ పాలన మళ్లీ కావాలా? : కేటీఆర్