Jagga Reddy | సంగారెడ్డి : కాంగ్రెస్ సీనియర్ నేత జగ్గారెడ్డి.. మరో వివాదంలో చిక్కుకున్నారు. దసరా పండుగ రోజున రాష్ట్ర పక్షి పాలపిట్టను బంధించారు. సంగారెడ్డి పట్టణంలోని అంబేద్కర్ స్టేడియంలో నిర్వహించిన దసరా వేడుకల్లో ఓ బోనులో పాలపిట్టలను బంధించి.. ప్రజలకు బహిరంగంగా జగ్గారెడ్డి చూపించారు.
ఈ దసరా వేడుకల్లో జగ్గారెడ్డితో పాటు ఆయన భార్య, టీజీఐఐసీ చైర్మన్ నిర్మలా రెడ్డి, కూతురు జయా రెడ్డి, కుమారుడు భరత్ సాయి రెడ్డి కూడా పాల్గొన్నారు. వీళ్లు కూడా పాలపిట్టలను తమ చేతుల్లో పట్టుకుని వేదికపై నిల్చున్నారు. ఇలా వన్యప్రాణులను బంధించడం వన్యప్రాణి సంరక్షణ చట్టం, 1972 ప్రకారం నేరం అని వన్యప్రాణి సంరక్షకులు పేర్కొంటున్నారు.
ఇక జగ్గారెడ్డితో పాటు ఆయన కుటుంబ సభ్యులు పాలపిట్టలను బంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. చాలా మంది జగ్గారెడ్డి కుటుంబ సభ్యులను తీవ్రంగా విమర్శిస్తున్నారు. తెలంగాణ వైల్డ్ లైఫ్ చీఫ్ వార్డెన్ సుభద్రా దేవికి వన్యప్రాణి సంరక్షకులు ఫిర్యాదు చేశారు. దసరా పండుగ నేపథ్యంలో పాలపిట్టలను బంధించొద్దని తెలంగాణ అటవీ శాఖ పౌరులను హెచ్చరించినప్పటికీ, ఇలాంటి ఘటనలు జరుగుతూనే ఉన్నాయి.
ఇవి కూడా చదవండి..
MLA Rakesh Reddy | హిందువులు పిచ్చోళ్లు.. బీజేపీ ఎమ్మెల్యే రాకేశ్ రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు
Harish Rao | అధికారంలోకి వచ్చాక ఊసరవెల్లిలా మారిన రేవంత్ రెడ్డి.. హరీశ్‌రావు తీవ్ర విమర్శలు