KTR | తెలంగాణ రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలు, వరదలు ప్రజల జీవితాలను అతలాకుతలం చేస్తున్నాయని, రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే సహాయక చర్యలు చేపట్టాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్ చేశారు. గత 24 గంటల్లో ఎడతెరిపిలేకుండా కురుస్తున్న భారీ వర్షాల వల్ల రాష్ట్రంలో అనేక ప్రాంతాలు నీటమునిగాయి. వందలాది గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయన్నారు. ప్రధాన రహదారులు, వంతెనలు తెగిపోయి రాకపోకలు నిలిచిపోయాయి. అనేక చోట్ల విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో ప్రజలు చీకట్లో మగ్గుతున్నారు. కనీస అవసరాలైన ఆహారం, తాగునీరు కూడా వారికి అందుబాటులో లేకుండా పోయిందని కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు.
ముఖ్యంగా కామారెడ్డి, మెదక్, రాజన్న సిరిసిల్ల, మహబూబాబాద్, ఉమ్మడి వరంగల్, ఖమ్మం, అదిలాబాద్ జిల్లాలోని పలు ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల వలన ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. వర్షాలతో ప్రజలు అల్లాడుతున్నా ప్రభుత్వానికి పట్టింపు లేదన్నారు.
జాతీయ రహదారి 44తోపాటు అంతర్ జిల్లా రహదారులు కూడా కొట్టుకునిపోయి, జలప్రవాహంతో స్తంభించిపోయి ఉన్నాయన్నారు. కామారెడ్డి నిజాం సాగర్ మండలం బొగ్గు గుడిసె వాగులో చిక్కుకున్న 10 మంది కార్మికులు, హవేలీ ఘనపూర్ తాండలో పదుల సంఖ్యలో గిరిజనులు వరదలో చిక్కుకొని ఇండ్లపై ఎక్కి ప్రభుత్వ సహాయం కోసం ఎదురుచూస్తున్నారని కేటీఆర్ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే భారీ వర్షాలపై సమీక్ష నిర్వహించి, సహాయక చర్యలను ముమ్మరం చేయాలని సూచించారు.
ప్రభుత్వం నుండి ఎలాంటి స్పందన లేదు.
ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోందని, వెంటనే పక్క రాష్ట్రాల్లోని రాజకీయాలను పక్కనపెట్టి రాష్ట్ర ప్రజల ఇబ్బందులపై దృష్టి సారించాలని సూచించారు. ముఖ్యమంత్రి సహా రాష్ట్ర క్యాబినెట్ అంతా భారీ వర్షాలపై వెంటనే స్పందించాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఇలాంటి విపత్తులు సంభవించిన వెంటనే ముఖ్యమంత్రిగా కేసీఆర్ స్వయంగా రంగంలోకి దిగి పరిస్థితిని సమీక్షించి, యుద్ధప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టారు. అవసరమైతే ఎన్ డీఆర్ఎఫ్ వంటి విపత్తు సహాయక బృందాలతో వరదల్లో చిక్కుకున్న వారిని కాపాడిన విషయం కేటీఆర్ గుర్తు చేశారు. కానీ ఇప్పుడు ప్రస్తుత ప్రభుత్వం నుండి ఎలాంటి స్పందన లేదు. ప్రజల కష్టాలను పట్టించుకోవడం లేదు. ఇది చాలా బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వం తక్షణమే చేపట్టాల్సిన పలు చర్యలను కేటీఆర్ సూచించారు.
బీఆర్ఎస్ కార్యకర్తలు సహాయం చేయడానికి సిద్ధం..
వరదల్లో చిక్కుకున్న ప్రజలను వెంటనే సురక్షిత ప్రాంతాలకు తరలించడానికి ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలను పెద్దఎత్తున రంగంలోకి దించి రెస్క్యూ ఆపరేషన్లు చేపట్టాలన్నారు. వరదలో చిక్కుకున్న బాధితుల కోసం ప్రత్యేకంగా రిలీఫ్ క్యాంపులను ఏర్పాటు చేసి, వారికి సురక్షితమైన ఆశ్రయం, ఆహారం, తాగునీరు, వైద్య సదుపాయాలు కల్పించాలి. దెబ్బతిన్న రోడ్లు, వంతెనలు, విద్యుత్ లైన్లను యుద్ధప్రాతిపదికన మరమ్మత్తు చేయించాలి. కమ్యూనికేషన్ వ్యవస్థను పునరుద్ధరించడానికి చర్యలు తీసుకోవాలి.
ప్రభుత్వం తక్షణం మేల్కొని, ప్రజల కష్టాలను గుర్తించి వారికి అండగా నిలబడాలి. ప్రభుత్వం వైఫల్యం చెందితే బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు తమ వంతుగా ప్రజలకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ కష్ట సమయంలో ప్రజలకు అండగా ఉండాలని నేను పార్టీ శ్రేణులకు పిలుపునిస్తున్నానని కేటీఆర్ అన్నారు.
Health tips | మొక్కజొన్నతో గుండెకు మేలు.. ఇంకా ఎన్ని లాభాలో..!
Kamareddy | కామారెడ్డి జిల్లాలో భారీ వర్షాలు.. వరదలకు కొట్టుకుపోయిన కార్లు
CP Radhakrishnan | తిరుమలకు చేరుకున్న ఎన్డీయే ఉప రాష్ట్రపతి అభ్యర్థి