CM Revanth Reddy | హైదరాబాద్, జనవరి 3 (నమస్తే తెలంగాణ): అసెంబ్లీ వేదికగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మరోసారి అవగాహనారాహిత్యాన్ని బయటపెట్టుకున్నారనే విమర్శలొస్తున్నాయి. నీటి పంపకాలకు సంబంధించి డాక్యుమెంట్లలోని నిజాలను సైతం గ్రహించకుండా అభాసుపాలయ్యారనే అభిప్రాయం వ్యక్తమవుతున్నది. బేసిన్లకు, ట్రిబ్యునళ్లకు తేడా తెలియకుండా ఇప్పటికే పలుమార్లు అభాసుపాలైన సీఎం.. తాజాగా డాక్యుమెంట్లతో సహా దొరికిపోయారనే విమర్శలొస్తున్నాయి.
అసెంబ్లీలో కృష్ణా జలాల అంశంపై చర్చ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ.. ప్రధానంగా 299 టీఎంసీల అంశాన్ని ప్రస్తావించారు. కృష్ణా జలాల్లో 490 టీఎంసీలు రావాల్సి ఉన్నా, నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం, అప్పటి సీఎం కేసీఆర్ 299 టీఎంసీలకే అంగీకరించారని పేర్కొన్నారు. నీటి పంపకాల అంశాన్ని ప్రణాళికా సంఘానికి నివేదించిన, ఆ పై చేసుకున్న ఒప్పందాల పత్రాలను చదివారు. అయితే, ఆ పత్రాల్లోనే అసలు వాస్తవాలు ఉన్నాయని, వాటిని కనీస అవగాహన లేకుండానే బీఆర్ఎస్పై ముఖ్యమంత్రి నిందలు మోపారనే విమర్శలొస్తున్నాయి.
మహారాష్ట్ర, కర్ణాటక, ఉమ్మడి ఏపీ రాష్ర్టాల మధ్య కృష్ణా నదీ జలాల పంపిణీ కోసం కేంద్ర ప్రభుత్వం మొదటిసారిగా 1969లో బచావత్ నేతృత్వంలో కృష్ణా వాటర్ డిస్ప్యూట్ ట్రిబ్యునల్-1 (కేడబ్ల్యూడీటీ-1)ని ఏర్పాటుచేసింది. ఆ ట్రిబ్యునల్ 75% డిపెండబులిటీ కింద కృష్ణాలో మొత్తంగా 2,130 టీఎంసీలు అందుబాటులో ఉన్నాయని లెక్కతేల్చింది. ఆ జలాల్లో మహారాష్ట్రకు 585 టీఎంసీలు, కర్ణాటకకు 734, ఉమ్మడి ఏపీకి 811 టీఎంసీలు పంచింది. మరో 330 టీఎంసీల మిగులు జలాలు అందుబాటులో ఉంటాయని అవార్డులో ప్రకటించింది. ఆ కేటాయింపులను 2000 సంవత్సరం తరువాత సమీక్షించుకోవచ్చని పేర్కొంటూ 1976లో ట్రిబ్యునల్-1 తుది తీర్పు వెలువరించింది. బచావత్ ట్రిబ్యునల్ సూచనల మేరకు నాటి అవార్డును సమీక్షించేందుకు కేంద్రం 2004లో జస్టిస్ బ్రిజేశ్‌కుమార్ నేతృత్వంలో కృష్ణా వాటర్ డిస్ప్యూట్ ట్రిబ్యునల్-2 (కేడబ్ల్యూడీటీ- 2)ని ఏర్పాటుచేసింది.
ఆ ట్రిబ్యునల్ 65% డిపెండబులిటీ కింద, సగటు ప్రవాహాల ఆధారంగా కృష్ణా నదిలో మొత్తంగా 2,578 టీఎంసీలు అందుబాటులో ఉన్నాయని లెక్కతేల్చింది. ట్రిబ్యునల్-1 కేటాయించిన 2,130 టీఎంసీలను మినహాయించి మిగిలిన 448 టీఎంసీల జలాలను మూడు రాష్ర్టాలకు పంచింది. అందులో మహారాష్ట్రకు 81 టీఎంసీలు, కర్ణాటకకు 173, ఉమ్మడి ఏపీకి 194 టీఎంసీలు కేటాయించింది. అందుకు సంబంధించి అవార్డు డ్రాఫ్ట్‌ను 2010లో, తుది అవార్డును 2013లో కేడబ్ల్యూడీటీ-2 నివేదించింది. ట్రిబ్యునల్ తీర్పుపై పలు అభ్యంతరాలను వ్యక్తంచేస్తూ ఉమ్మడి ఏపీ సర్కార్‌తోపాటు మిగిలిన రాష్ర్టాలు సైతం సుప్రీంకోర్టును ఆశ్రయించడంతో అవార్డు అమల్లోకి రాకుండా పెండింగ్‌లో పడింది. ప్రస్తుతం బచావత్ అవార్డు కేటాయింపులే అమల్లో ఉన్నాయి. బ్రిజేశ్‌కుమార్ ట్రిబ్యునల్ కేటాయింపులు అమల్లోకి రాలేదు. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి స్వయంగా సభా వేదికగా వెల్లడించారు.
రాష్ట్ర విభజన సందర్భంగా నీటి పంపకాలకు సంబంధించిన అంశాలపై లెక్కలు తీశారు. కేవలం అమల్లో ఉన్న బచావత్ ట్రిబ్యునల్ కేటాయింపులను అంటే 811 టీఎంసీలను మాత్రమే పరిగణనలోకి తీసుకున్నారు. ఆ జలాల్లో ఏపీకి 512, తెలంగాణకు 299 టీఎంసీలను గత ఉమ్మడి ఏపీ ప్రభుత్వమే కేటాయించినట్టు ప్రాజెక్టుల వారీగా నిర్ధారించారు. బ్రిజేశ్‌కుమార్ ట్రిబ్యునల్ కింద వరద ఆధారితంగా చేపట్టిన ప్రాజెక్టులైన కల్వకుర్తి, నెట్టెంపాడు వంటి వాటిని చేర్చారు. రెండు ట్రిబ్యునల్ కేటాయింపులు కలిపి 490 టీఎంసీలు తెలంగాణకు దక్కుతాయని తేల్చింది వాస్తవం.
అయితే, బ్రిజేశ్ ట్రిబ్యునల్ అమల్లోకి రాని నేపథ్యంలో కేవలం బచావత్ ట్రిబ్యునల్ కేటాయింపులపైనే ఏడాది కాల పరిమితితో నాడు తాత్కాలికంగా ఉమ్మడి రిజర్వాయర్ల నుంచి నీటి వినియోగాల కోసం వర్కింగ్ అరేంజ్మెంట్ చేసుకున్నారు. 811 టీఎంసీలకు సంబంధించి మాత్రమే 299 టీఎంసీలకు నాడు బీఆర్ఎస్ ప్రభుత్వం తాత్కాలికంగానే ఒప్పుకున్నది. భవిష్యత్తులో బ్రిజేశ్ ట్రిబ్యునల్ అవార్డు, లేదంటే అదనపు జలాలు అందుబాటులోకి వస్తే వాటిలోనూ వాటాలు ఉంటాయని నిర్ణయించారు. తాత్కాలిక వర్కింగ్ అరేంజ్మెంట్ కేవలం బచావత్ ట్రిబ్యునల్ కేటాయించిన 811 టీఎంసీలకేనని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అసెంబ్లీలో స్వయంగా చదివి వినిపించారు.
అంటే బ్రిజేశ్ ట్రిబ్యునల్ కేటాయింపులను పరిగణనలోకి తీసుకోలేదని చెప్పకనే చెప్పారు. కానీ, మరోవైపు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అందుకు విరుద్ధంగా వ్యాఖ్యానించడం గమనార్హం. మొత్తంగా 490 టీఎంసీలకు బదులుగా 299 టీఎంసీలకే కేసీఆర్ అంగీకరించారని వక్రీకరించడమే చర్చనీయాంశంగా మారింది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి ట్రిబ్యునల్ కేటాయింపులకు, తాత్కాలిక వర్కింగ్ అరేంజ్‌మెంట్‌కు తేడా తెలియకుండా పోయిందని నీటిరంగ నిపుణులు, రాజకీయ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. వెరసి మరోసారి అసెంబ్లీ వేదికగా సీఎం తన అవగాహనారాహిత్యాని బయటపెట్టుకున్నారని, అభాసుపాలయ్యారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి దాదాపు గంటకుపైగా ప్రసంగించారు. అయితే ఆద్యంతం అర్ధసత్యాలు, అర్ధగణాంకాలతో గతంలో చెప్పిన అంశాలనే పదే పదే ఏకరువు పెట్టారనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.
Watch: పాముతో వ్యక్తి సంభాషణ.. వీడియో వైరల్
Cigarettes | ‘సిగరెట్ల కోసం వియత్నాం ఫ్లైట్ ఎక్కండి’.. ఓ ఇన్వెస్ట్మెంట్ అడ్వయిజర్ పోస్టు వైరల్
Watch: స్వాతంత్ర్యం సిద్ధించిన 78 ఏళ్ల తర్వాత ఆ గ్రామానికి రోడ్డు.. తొలి బస్సుకు ఘన స్వాగతం