దళిత్ ఎంపవర్మెంట్ కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సీఎం కేసీఆర్ పిలుపునిచ్చారు. సామాజికంగా వెనుకబడి ఉన్న దళితుల అభివృద్ధి సమాజంలోని ప్రతి ఒక్కరి బాధ్యత అని తెలిపారు. ప్రగతి భవన్లో అధికారులతో సమీక్ష సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ వ్యాఖ్యలు చేశారు. శరీరంలోని ఒక భాగం పాడైతే.. ఆ శరీరానికి ఎంత బాధ ఉంటుందో, సమాజంలో ఒక భాగం వివక్షకు గురైతే.. సమాజానికి కూడా అంతే బాధగా ఉంటుందని ఆయన అన్నారు. మనలోనే భాగమై జీవిస్తున్న మనుషులను దళితుల పేరుతో బాధ పెట్టే వ్యవహారం మంచిది కాదని ఆవేదన వ్యక్తం చేశారు. ఆర్థికంగా, సామాజికంగా వెనుకబడి ఉన్న దళితుల అభివృద్ధి సమాజంలోని ప్రతి ఒక్కరి బాధ్యతగా భావించిన నాడే దళిత సాధికారత సాధ్యం అవుతుందని స్పష్టం చేశారు. అందులో భాగంగా దళిత సాధికారత కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తున్నదని, రేపు ( ఆదివారం ) నిర్వహించే సమావేశంలో ప్రభుత్వం పలు నిర్ణయాలు తీసుకోబోతున్నట్లు ఉన్నతాధికారులకు సీఎం కేసీఆర్ వెల్లడించారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో కలెక్టర్లు, ఉన్నతాధికారుల పాత్ర కీలకమని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు.
ఈ పథకంలో భాగంగా దాదాపు అర్హులైన 8 లక్షల దళిత బీపీఎల్ కుటుంబాలను దశలవారీగా అభివృద్ధి పరిచడమే లక్ష్యంగా కార్యక్రమాలు నిర్వహించబోతున్నామని కేసీఆర్ తెలిపారు. ఇందుకుగాను రూ.1,000 కోట్లు ఈ ఏడాది ఖర్చు చేయబోతున్నామని సీఎం ప్రకటించారు. దళిత సాధికారత పథకానికి, ఎస్సీ సబ్ ప్లాన్ కు సంబంధం లేదని, దీనికి ప్రత్యేకంగానే నిధులు ఖర్చు చేయాలనుకుంటున్నట్లు ముఖ్యమంత్రి వెల్లడించారు.
దళితుల్లో నెలకొన్న వెనుకబాటుతనాన్ని, బాధలను తొలగించే క్రమంలో కలెక్టర్లు, ఉన్నతాధికారుల పాత్ర కీలకం కాబోతున్నదని, పారదర్శకంగా అర్హులను ఎంపిక చేయాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. ప్రతి ఏటా కొంతమంది లబ్ధిదారులను లాటరీ పద్ధతి ద్వారా ఎంపిక చేసి, రైతుబంధు, వృద్ధాప్య పింఛన్లు అందుతున్న పద్ధతుల్లోనే పారదర్శకంగా వారి బ్యాంకు ఖాతాల్లో నేరుగా డబ్బు జమయ్యేటట్లుగా చూడాల్సి ఉందన్నారు. అందుకు సంబంధించిన విధి విధానాలను ఖరారు చేయబోతున్నట్లు ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
కొత్త లేఅవుట్లను అనుమతించొద్దు : సీఎం కేసీఆర్
తెలంగాణలో కొత్తగా 1,028 కరోనా కేసులు
ఈటలపై బీజేపీ నాయకుల సంచలన వ్యాఖ్యలు
జమ్మూకశ్మీర్లోనే కాదు తెలుగు రాష్ట్రాల్లోనూ అసెంబ్లీ సీట్లు పెంచాలి: వినోద్ కుమార్