శుక్రవారం 05 జూన్ 2020
Telangana - May 03, 2020 , 01:39:11

ఎక్కడికక్కడే కట్టడి..

ఎక్కడికక్కడే కట్టడి..

 • కరోనా కేసుల్లో ఆసీఫ్‌నగర్‌ ఠాణా ఏరియా ఫస్ట్‌..
 • కంటైన్మెంట్లతో వైరస్‌ వ్యాప్తికి చెక్‌ 
 • 10 ఠాణాల పరిధిలోనే పాజిటివ్‌ కేసులు

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ:  కరోనా కట్టడిలో హైదరాబాద్‌ పోలీసులు తమ వంతు పాత్ర పోషిస్తున్నారు. వైరస్‌ వ్యాప్తి నియంత్రణకు రేయింబవళ్లు శ్రమిస్తున్నారు.కరోనా పాజిటివ్‌ వచ్చిన వారిని, వారి కాంటాక్టులను గుర్తించి, క్వారంటైన్‌ చేయడంతో సత్ఫలితాలు వస్తున్నాయి. 

వైరస్‌ వ్యాప్తి చెందకుండా... 

నగరంలోని  వెస్ట్‌, సౌత్‌తో పాటు ఈస్ట్‌జోన్‌ల్ల్లోనూ పాజిటివ్‌ కేసులు ఎక్కువగా ఉన్నాయి. అత్యధిక 49 కరోనా కేసులతో వెస్ట్‌జోన్‌లోని ఆసీఫ్‌నగర్‌ ఠాణా ఏరియా మొదటి స్థానంలో ఉండడంతో అక్కడ పోలీసులు పటిష్ట చర్యలు తీసుకున్నారు. సమీప ప్రాంతాల్లో వైరస్‌ వ్యాప్తి చెందకుండా  వైద్య, జీహెచ్‌ఎంసీ, రెవెన్యూ శాఖలతో సమన్వయం చేసుకుంటూ.. ముందుకెళ్తున్నారు. ఇక 43 కేసులతో రెండోస్థానంలో సౌత్‌జోన్‌లోని భవానీనగర్‌ ఠాణా పరిధి ఉన్నది. మొత్తంగా నగర పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలోని 10 ఠాణాల పరిధిలో కరోనా పాజిటివ్‌ కేసులు ఉన్నాయి. రెయిన్‌బజార్‌, కుల్సుంపురా, కాలాపత్తార్‌, కంచన్‌బాగ్‌, గోల్కొండ, చాదర్‌ఘాట్‌, కమాటిపురా, డబీర్‌పురా పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. 

 ప్రత్యేక దృష్టి..

అన్ని శాఖలతో సమన్వయం చేసుకుంటూ నగర పోలీసులు పక్కా ప్రణాళికతో ముందుకెళ్తున్నారు. కరోనా పాజిటివ్‌ వచ్చిన వారిని గుర్తించడంతో పాటు వారి  కాంటాక్టును పట్టుకోవడంపై ప్రత్యేక దృష్టి సారించారు. ఇందుకు ఆయా పోలీస్‌స్టేషన్ల వారీగా పాజిటివ్‌ వచ్చిన వారు, వారి కాంటాక్టులను గుర్తించి క్వారంటైన్‌లో ఉంచుతున్నారు. ఎక్కడైతే కేసులు ఉన్నాయో, ఆ ఇంటి పరిసరాలను కట్టడి చేశారు. ప్రజల వద్దకే వెళ్లి సేవలందిస్తున్నారు.

 • మరో 19 కంటైన్మెంట్‌ జోన్లను ఎత్తివేసినట్లు జీహెచ్‌ఎంసీ అధికారులు తెలిపారు. దీంతో కొత్తగా ఏర్పాటైన వాటితో కలిపి ప్రస్తుతం 50 కంటైన్మెంట్‌ జోన్లు కొనసాగుతున్నాయి. 
 • మలక్‌పేట గంజ్‌ను రెడ్‌జోన్‌గా గుర్తించి మార్కెట్లో పనిచేస్తున్న హమాలీలు, వ్యాపారులకు స్క్రీనింగ్‌ టెస్టులు చేస్తున్నారు. అయితే కొందరు నగరంలోనే ఉంటుండగా, చాలా మంది వారి స్వస్థలాలకు వెళ్లిపోవడంతో  ఫోన్‌ నంబర్లు సేకరించే పనిలో పడ్డారు. వైరస్‌ బారినపడినట్లు గుర్తించిన వారిని క్వారంటైన్‌కు తరలించేందుకు పోలీసుల సహాయాన్ని తీసుకుంటున్నారు.  
 • లింగోజిగూడెం డివిజన్‌ భాగ్యనగర్‌ కాలనీకి చెందిన బియ్యం వ్యాపారికి వైరస్‌ సోకడంతో గాంధీకి తరలించారు. 
 • బీఎన్‌రెడ్డి నగర్‌లో రెండు కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. వనస్థలిపురంలో మూడు కేసులు నమోదయ్యాయి. సరూర్‌నగర్‌ సర్కిల్‌ పరిధిలో జింకలబావి కాలనీలో ఓ కిరాణాషాపు యజమానికి పాజిటివ్‌ వచ్చింది. అలాగే వనస్థలిపురం రైతు బజార్‌ సమీపంలో అల్లం వ్యాపారిని క్వారంటైన్‌కు తరలించారు. 
 • బోడుప్పల్‌ పట్టణ పరిధిలోని రాజశేఖర్‌ కాలనీకి చెందిన ఓ వ్యక్తి కరోనాతో చనిపోయాడు. 
 • కుందన్‌ బాగ్‌లోని ఓ అపార్టుమెంట్‌లో వాచ్‌ మన్‌గా పనిచేస్తున్న వ్యక్తిని వైరస్‌ సోకింది. 108లో అతడితో పాటు అతని భార్యను గాంధీ ఐసొలేషన్‌ వార్డుకు తరలించారు. 
 • జలశక్తి విభాగం అదనపు కార్యదర్శి అరుణ్‌ భరోక నేతృత్వంలోని కేంద్ర బృందం శనివారం ఎర్రగడ్డలోని ఈఎస్‌ఐ వైద్యశాలను సందర్శించింది. కొవిడ్‌-19 పాజిటివ్‌ కేసుల కోసం అందించే వైద్య సేవలపై ఆరా తీసింది. అయితే ఇంతవరకు కరోనా రోగులు వైద్యశాలకు రాలేదని అక్కడి వైద్యులు కేంద్ర బృందానికి తెలిపారు. అనంతరం కేంద్ర బృందం చర్లపల్లిలోని ఫుడ్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా గోదాంను సందర్శించింది. 
 • నిమ్స్‌లో చికిత్స పొందుతున్న ఓ వ్యక్తికి దగ్గు, జ్వరం రావడంతో గాంధీకి తరలించారు.

గ్రేటర్‌లో 15 పాజిటివ్‌ కేసులు

గ్రేటర్‌లో శనివారం 15 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ఇందులో 11కేసులు హైదరాబాద్‌ నగరంలోని వివిధ ప్రాంతాల్లో నివి కాగా.. మరో నాలుగు మేడ్చల్‌, రంగారెడ్డి జిల్లాల పరిధిలోని జీహెచ్‌ఎంసీ ప్రాంతంలో నమోద య్యాయి. జియాగూడలో ఇటీవల కరోనాతో మృతిచెందిన మహిళ కుటుంబంలో మరో ఇద్దరికి, సబ్జీమండిలో కూరగాయల వ్యాపారికి కరోనా పాజిటివ్‌ వచ్చింది. 


logo