హైదరాబాద్, సెప్టెంబర్ 11 (నమస్తే తెలంగాణ): బియ్యం ఎగుమతుల విషయంలో కేంద్ర ప్రభుత్వం ద్వంద్వ వైఖరిని అవలంబిస్తున్నది. పంజాబ్‌లో ఉత్పత్తి అయ్యే బాస్మతి బియ్యాన్ని కేంద్రం కొనదు కాబట్టి వాటి ఎగుమతిపై ఎలాంటి ఆంక్షలు ఉండవు. పన్నులూ విధించదు. ఇదేవిధంగా తెలంగాణలో ఉత్పత్తయ్యే సోనా మసూరీ సన్న రకాల బియ్యాన్ని కూడా కేంద్రం కొనుగోలు చేయదు. అయినా వాటి ఎగుమతులపై సవాలక్ష ఆంక్షలు, పన్నులు విధించి తెలంగాణ రైతులను దెబ్బతీసే కుట్ర చేస్తున్నది. ఉత్తరాది రైతులపై కేంద్రం చూపుతున్న వల్లమాలిన ప్రేమకు ఈ ఉదంతమే నిదర్శనం. రెండు రోజుల క్రితం బాస్మతి యేతర బియ్యం ఎగుమతిపై 20% పన్ను విధిస్తూ కేంద్రం అసంబద్ధ నిర్ణయం తీసుకొన్నది.
దేశంలో బియ్యానికి కొరత ఏర్పడిందని, అందుకే ఎగుమతులను తగ్గించేందుకు పన్ను విధించామని కేంద్రం చెప్తున్నది. ఈ పన్ను నుంచి బాస్మతి బియ్యాన్ని మినహాయించడం, ఇతర రకాల బియ్యంపై మాత్రమే పన్ను వేయడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కొరత నిజమైతే అన్ని రకాల బియ్యంపై కాకుండా కేవలం బాస్మతి యేతర బియ్యం ఎగుమతులపైనే ఆంక్షలు విధించడం ఏమిటన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. వాస్తవానికి మన దేశం నుంచి ఎగుమతయ్యే బియ్యంలో బాస్మతి రకమే అధికం. ఏటా దాదాపు 30 లక్షల టన్నుల బాస్మతి బియ్యం విదేశాలకు ఎగుమతి అవుతున్నది. తెలంగాణలో పండే సోనా మసూరీ సన్నరకాలు 8 లక్షల టన్నుల వరకు ఎగుమతి అవుతున్నాయి. బాస్మతి మాదిరిగా సన్నరకాల బియ్యాన్ని పండించడమూ కష్టమే. పెట్టుబడి ఎక్కువగా, దిగుబడి తక్కువగా ఉంటుంది. సాధారణ ధాన్యం ఎకరాకు 25 క్వింటాళ్లు ఉత్పత్తి అయితే సన్నాలు 18 క్వింటాళ్లే ఉత్పత్తి అవుతాయి. దీంతో ఎక్కువ మంది రైతులు సన్నాలు పండించేందుకు ధైర్యం చేయరు. కానీ, ఇప్పుడు కేంద్ర ప్రభుత్వ అసంబద్ధ నిర్ణయంతో సన్నరకాల సాగుకు రైతులు పూర్తిగా దూరమయ్యే ప్రమాదం ఉన్నది.
దొడ్డు వడ్లు కొనదు.. సన్నాలను ప్రోత్సహించదు
దేశ వ్యవసాయ రంగంపై కేంద్రంలోని బీజేపీ సర్కారుకు దశ దిశ లేదన్న విమర్శలు ఇప్పుడు అక్షరాల నిజమవుతున్నాయి. మొన్నటి వరకు వరి సాగు వద్దన్న కేంద్రం.. ఇప్పుడు అదే నోటితో వరి సాగు చేయాలని రైతులను వేడుకొంటున్నది. మొన్నటికి మొన్న దొడ్డు వడ్లు కొనబోమంటూ తేల్చి చెప్పిన మోదీ సర్కారు.. మరోవైపు సన్నాలు పండించే రైతులపై పన్నుల రూపంలో పిడుగులు వేస్తున్నది.
తెలంగాణ సన్నాలకు జీఐ గుర్తింపేదీ?
కేంద్రంలోని ప్రస్తుత బీజేపీ సర్కారు పంజాబ్, హర్యానాలో ఉత్పత్తయ్యే బాస్మతి బియ్యంపై చూపిస్తున్న ప్రేమను తెలంగాణలో పండే సోనా మసూరీ రకాలపై చూపడం లేదు. బాస్మతి బియ్యానికి భౌగోళిక గుర్తింపు (జీఐ) లభించేలా చర్యలు చేపట్టిన కేంద్ర ప్రభుత్వం.. ఉమ్మడి నల్లగొండ, ఖమ్మం, నిజామాబాద్ జిల్లాల్లో మాత్రమే పండే సోనా మసూరీ రకాన్ని మాత్రం పట్టించుకోకపోవడం గమనార్హం. వాస్తవానికి విదేశాల్లో బాస్మతి బియ్యం కంటే ఆర్ఎన్ఆర్, హెచ్ఎంటీ, జేఎస్ఆర్ లాంటి సోనా మసూరీ రకాలకే ఆదరణ ఎక్కువ. బాస్మతి బియ్యాన్ని శుభకార్యాలు, పెద్ద పెద్ద ఫంక్షన్లలో బిర్యానీ తయారీకే ఎక్కువగా వినియోగిస్తారు. ఇండ్లలో వీటి వినియోగం చాలా తక్కువ. కానీ, సోనామసూరీ రకాలను శుభకార్యాలతో పాటు మధ్యతరగతి నుంచి ఉన్నత వర్గాల వరకు రోజూ భోజనం తయారీకి ఉపయోగిస్తారు. ఈ బియ్యం లేనిదే పూట గడవదంటే అతిశయోక్తి కాదు. ఇంతటి ప్రాధాన్యమున్న సోనా మసూరీని కేంద్రం చిన్న చూపు చూస్తున్నది. దీంతో ఇకనైనా ఈ బియ్యానికి జీఐ గుర్తింపు లభించేలా మోదీ సర్కార్ చర్యలు చేపట్టాలన్న డిమాండ్ గట్టిగా వినిపిస్తున్నది.
ధాన్యం కొనుగోళ్లలోనూ ఇదే వివక్ష
ఎగుమతి పన్నుల్లో బాస్మతియేతర బియ్యంపై వివక్ష చూపిన కేంద్రం.. గతంలో ధాన్యం కొనుగోళ్ల విషయంలోనూ ఇలాంటి వివక్షనే ప్రదర్శించింది. పంజాబ్‌లో ప్రతి సీజన్లో 2 కోట్ల టన్నులకుపైగా ధాన్యాన్ని కొనుగోలు చేస్తున్న కేంద్రం.. తెలంగాణలో ధాన్యాన్ని మాత్రం కనీసం కోటి టన్నులైనా కొనడం లేదు. పైగా తెలంగాణలో ఒక్క సీజన్లో మాత్రమే ధాన్యాన్ని కొనుగోలు చేస్తామంటూ మొండికేస్తున్నది. పంజాబ్‌లో ఏటా వానకాలం, యాసంగి సీజన్లలో పండే మొత్తం పంటను కొనుగోలు చేసి అక్కడి రైతులకు మేలు చేస్తున్న కేంద్ర ప్రభుత్వం.. తెలంగాణలో వానకాలం సీజన్ ధాన్యాన్ని మాత్రమే కొనుగోలు చేస్తామని చెప్తున్నది. పంజాబ్‌లో కొన్నంత ధాన్యాన్ని మనదగ్గరా కొనాలన్న డిమాండ్‌ను మోదీ సర్కార్ పట్టించుకోవడం లేదు.