రామగిరి, నవంబర్ 24 : ఉద్యోగ, ఉపాధ్యాయుల దీర్ఘకాలిక పెండింగ్ సమస్యల పరిష్కారానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చొరవ చూపుతాయని ఆశిస్తున్నట్లు, అలా కాని పక్షంలో పోరాటాలకు సిద్ధంగా ఉండాలని టీఆర్టీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మారెడ్డి అంజిరెడ్డి ఉపాధ్యాయులకు పిలుపునిచ్చారు. నల్లగొండ జిల్లా కేంద్రంలో టీఆర్టీఎఫ్ జిల్లా కార్యాలయంలో సోమవారం జరిగిన టీఆర్టీఎఫ్ నల్లగొండ జిల్లా కౌన్సిల్ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులకు టెట్ ఉత్తీర్ణత నిబంధనను సవరించడానికి ఎన్సీటీఈ నిబంధనలను సవరించడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు చేపట్టాలన్నారు. టెట్ అంశంపై ఇప్పటికే టీఆర్టీఎఫ్ సంఘ పక్షాన సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ దాఖలు చేసినట్లు చెప్పారు. అంతేకాకుండా డిసెంబర్ 11న న్యూఢిల్లీ జంతర్ మంతర్ వద్ద ధర్నా చేపడుతున్నట్లు వెల్లడించారు.
డిసెంబర్ 21న హైదరాబాద్ లో రాష్ట్ర స్థాయి విద్యా సదస్సును ఘనంగా నిర్వహించనున్న నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉపాధ్యాయులు అధిక సంఖ్యలో హాజరై సదస్సును విజయవంతం చేయాలని కోరారు. సీపీఎస్ ఒక దుర్మార్గమైన విధానమన్నారు. ఈ.హెచ్.ఎస్.పథకం అమలులోకి తీసుకొచ్చి నగదు రహిత వైద్యాన్ని అందించాలని కోరారు. పెండింగ్ లో ఉన్న డీఏను ఈ నెలాఖరుకల్లా ప్రకటించాలని, పీఆర్సీ నివేదికను త్వరగా తెప్పించుకుని నూతన పీఆర్సీ అమలుకు చర్యలు చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. రాష్ట్రంలో జిల్లా పరిషత్ జిపిఎఫ్ ఖాతాలకు సంబంధించి గత మూడు సంవత్సరాలుగా వడ్డీ జమ కాలేదని, ఈ కారణంగా ఉపాధ్యాయుల జిపిఎఫ్ స్లిప్స్ అందుబాటులో లేవని, దీర్ఘకాలిక అవసర నిమిత్తం పార్ట్ ఫైనల్ తీసుకునే ఉపాధ్యాయులకు ఇది శరాఘాతంలా మారుతుందన్నారు.
సమావేశ అనంతరం టీఆర్టీఎఫ్ నల్లగొండ జిల్లా శాఖను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. జిల్లా అధ్యక్షుడిగా నిమ్మనగోటి జనార్ధన్, ప్రధాన కార్యదర్శిగా తరాల పరమేశ్ యాదవ్ ను మరోమారు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఎన్నికల అధికారిగా తంతెనపల్లి సైదులు ఎన్నిక ధ్రువపత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా అసోసియేట్ అధ్యక్షుడు అర్రూరి జానయ్య, రాష్ట్ర కార్యదర్శులు బెజవాడ సూర్యనారాయణ, దొడ్డేని సాయిబాబు, సంఘ సలహాదారులు ముప్పిడి మల్లయ్య, గడ్డం జానకిరెడ్డి, వివిధ మండలాల బాధ్యులు, జిల్లా కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు.