Choutuppal | చౌటుప్పల్ ఫిబ్రవరి 22: నల్గొండ జిల్లా చౌటుప్పల్లో భారీ దోపిడీ జరిగింది. రియల్ ఎస్టేట్ వ్యాపారి నివాసంలో చొరబడి రూ.22 లక్షల నగదును ఎత్తుకెళ్లారు.
పోలీసుల కథనం ప్రకారం.. చౌటుప్పల్ పట్టణ కేంద్రానికి చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి లింగంపల్లి నరసింహ ఇటీవల ఓ ఫ్లాట్ కొనుగోలు చేశాడు. ప్లాట్ రిజిస్ట్రేషన్ కోసం విడతల వారీగా రూ. 22 లక్షల నగదు సమకూర్చుకొని ఇంట్లో బీరువాలో భద్రపరిచాడు. సోమవారం రిజిస్ట్రేషన్ చేయించాల్సి ఉంది. ఇదిలా ఉంటే హైదరాబాద్లో ఇంటర్ చదువుతున్న తన కుమార్తెను చూసేందుకు భార్యతో కలిసి శనివారం నాడు నరసింహ వెళ్లాడు. ఉదయమే వెళ్లి అర్ధరాత్రి వరకు ఇంటికి తిరిగొచ్చాడు.
ఇంటికి తిరిగొచ్చేసరికి ఇంటి తాళం పగులగొట్టి ఉంది. కంగారుపడి ఇంట్లో వెళ్లి చూడగా బీరువా తెరిచి ఉంది. అందులో భద్రపరిచిన రూ.22 లక్షల నగదు కనిపించలేదు. అయితే దాని పక్కనే ఉన్న బంగారు ఆభరణాలు, రూ.40 వేల నగదు, సెల్ఫ్లో చీరల కింద ఉన్న రూ.10 వేల నగదు మాత్రం అలాగే ఉన్నాయి. దీనిపై బాధితుడు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఘటనాస్థలికి వచ్చిన పోలీసులు ఇంటిని మొత్తం పరిశీలించి వివరాలు సేకరించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.