Anurag Kashyap | 2023లో విడుదలైన ది కేరళ స్టోరీ చిత్రం ఎంతటి చర్చనీయాంశమైందో తెలిసిందే. కేరళలో జరిగిన సంఘటనల ఆధారంగా తెరకెక్కిందని చెప్పిన ఈ చిత్రం దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున వివాదాలకు దారి తీసింది. ఇప్పుడు అదే నేపథ్యంలో రూపొందిన సీక్వెల్ ది కేరళ స్టోరీ 2మళ్లీ చర్చకు కేంద్రంగా మారింది. దర్శకుడు కామాఖ్య నారాయణ్ సింగ్ తెరకెక్కించిన ఈ సినిమా ఫిబ్రవరి 27న ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా విడుదలైన ట్రైలర్ కేరళ రాజకీయ వర్గాల్లో మరోసారి చర్చకు దారి తీసింది. రాష్ట్రంలో అధికారంలో ఉన్న కేరళ అధికార కమ్యూనిస్ట్ పార్టీ (సీపీఐ-ఎం), అలాగే ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీలు ఈ సినిమాను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి.
కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ ఈ చిత్రంపై స్పందిస్తూ, కేరళను ఉగ్రవాదానికి కేంద్రంగా చూపించే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు. మతాల మధ్య విభేదాలు రెచ్చగొట్టేలా సినిమా ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చారు.ఇక తాజాగా బాలీవుడ్ దర్శకుడు అనురాగ్ కశ్యప్ కూడా ఈ వివాదంలో చేరారు. ఒక మీడియా ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, “ఈ సినిమా ద్వారా సమాజాన్ని విభజించాలనే ప్రయత్నం జరుగుతోంది. కేవలం డబ్బు కోసం తీసిన ప్రపగాండా సినిమా ఇది” అని వ్యాఖ్యానించారు. ట్రైలర్లో చూపించిన కొన్ని సన్నివేశాలు వాస్తవాలకు దూరంగా ఉన్నాయని, మతాల మధ్య అనవసర ఉద్రిక్తతలు సృష్టించేలా ఉన్నాయని ఆయన అభిప్రాయపడ్డారు.
అనురాగ్ కశ్యప్ చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మరోవైపు, చిత్రబృందం మాత్రం సినిమా వాస్తవ ఘటనల ఆధారంగా రూపొందించామని, ప్రేక్షకులే తుది తీర్పు చెప్పాలని అంటోంది. ఫిబ్రవరి 27న విడుదల కాబోయే ఈ సినిమా ప్రేక్షకుల నుంచి ఎలా స్పందన పొందుతుందో చూడాలి.