మహబూబ్‌నగర్ అర్బన్, జూలై 29 : ఉమ్మడి రాష్ట్రంలో పాలమూరు పేదరికానికి కేరాఫ్ అడ్రస్‌గా ఉండేదని, బీఆర్ఎస్ పదేండ్ల కాలంలో అ న్నిరంగాల్లో అభివృద్ధి చేశామని మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ గుర్తు చేశారు. బుధవారం పాలమూరులోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మీడియాతో ఆయన మాట్లాడుతూ పాలమూరు యూనివర్సిటీలో జాతీయ సెమినార్ నిర్వహణకు అవకాశం వచ్చిందన్నారు. ఇక్కడే నిర్వహిస్తే ఈ ప్రాంతానికి గుర్తింపు లభించేదని, కానీ షాద్‌నగర్ వద్ద కన్హా ఆశ్ర మంలో నిర్వహించాలనుకోవడం బాధాకరమన్నారు. ఇక్కడ వసతి సౌ కర్యం లేదని మార్చడం అత్యంత బాధకరమన్నారు. ఉమ్మడి జిల్లాను విద్యాహబ్‌గా మారుస్తామని సీఎం రేవంత్‌రెడ్డి ప్రగల్భాలు పలుకుతు న్నారని కానీ.. ఆయన సొంత జిల్లాలో వసతి సౌకర్యం కరువైందన్నారు.
పీయూలో సదస్సు నిర్వహణ అధికారం వీసీకి ఉండదని, అది ప్రభు త్వం, అధికారులు కలిసి తీసుకోవాల్సిన నిర్ణయమన్నారు. గతంలో తమ హయాంలో పీయూలో అన్నిరకాల సదుపాయాలు కల్పించామని, వాటిని పర్యవేక్షణ చేయకపోవడంతో సమస్యలు తలెత్తాయన్నారు. టూ రిజం మంత్రి సొంత జిల్లాలో ఇలాంటి పరిస్థితి ఉండటం బాధా కరమన్నారు. అందాల పోటీలకు వచ్చిన పోటీదారులను బస్సుల్లో తీసు కొచ్చిన మంత్రులు, అధికారులు ఇప్పుడు సదస్సుకు వచ్చిన వారికి హైదరాబాద్‌లో వసతి కల్పించి ఇక్కడి సదస్సుకు బస్సులో తీసుకు రావచ్చని సూచించారు. జూపల్లి వచ్చి సమీక్ష చేసి సదస్సు నిర్వహణకు ఏర్పాట్లు చేయాలని, మీకు చేయడం సాధ్యం కాకుంటే.. మహబూబ్ నగర్ పరువు కోసమైనా నా సొంత పొలం అమ్మి అయినా సరే సదస్సు నిర్వహిస్తానని మంత్రి జూపల్లికి మాజీ మంత్రి సవాల్ విసిరారు.