KTR | హైదరాబాద్ : గ్రూప్-1 నియామకాల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ అభ్యర్థులకు జరుగుతున్న అన్యాయంపై బీఆర్ఎస్ పార్టీ చివరి వరకు పోరాడుతామని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తేల్చిచెప్పారు. జీవో 29, జీవో 46 తప్పని హైకోర్టులో రుజువు చేయిస్తామని, సమర్థవంతమైన న్యాయవాదితో వాదనలు వినిపిస్తామని కేటీఆర్ స్పష్టం చేశారు. తెలంగాణ భవన్లో కేటీఆర్ మీడియాతో మాట్లాడారు.
గ్రూప్-1 అభ్యర్థుల తరపున తమ పార్టీ నాయకులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, దాసోజు శ్రవణ్.. పది మంది గ్రూప్-1 అభ్యర్థులతో కలిసి సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తమ పిటిషన్ తరపున కపిల్ సిబల్ బలమైన వాదనలు వినిపించారు. పిటిషన్‌ను సుప్రీంకోర్టు తిరస్కరించలేదు. ఇవాళ పరీక్ష ఉంది కాబట్టి.. ఈ సమయంలో ఆపడం కరెక్ట్ కాదు. గ్రూప్-1 అభ్యర్థులు దాఖలు చేసిన రిట్ పిటిషన్ మీద హైకోర్టు నిర్ణయం తీసుకునే వరకు ఫలితాలను ప్రకటించొద్దని ప్రభుత్వానికి సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. త్వరగా విచారణ జరిపి న్యాయం చేయాలని కూడా సుప్రీంకోర్టు చెప్పిందని కేటీఆర్ తెలిపారు.
కేసీఆర్ నాయకత్వంలో జీవో 55 తీసుకొచ్చాం. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ అభ్యర్థులకు న్యాయం జరగాలని జీవో 55 తెచ్చాం. ఓపెన్ కోటాలో కూడా రిజర్వ్డ్ వారికి అవకాశం కల్పించే విధంగా జీవో 55 తీసుకొచ్చాం. జీవో 29పై తాము జూన్, జులై నుంచి మొత్తుకుంటున్నాం. శాసనసభలో హరీశ్‌రావు మాట్లాడారు. ప్రెస్‌మీట్ పెట్టి ఆర్ఎస్పీ, దాసోజు శ్రవణ్ పలుమార్లు హెచ్చరించారు. కాంగ్రెస్ ప్రభుత్వం మూర్ఖపు వైఖరి వల్ల గందరగోళాల మధ్య పరీక్ష నిర్వహించారని కేటీఆర్ ధ్వజమెత్తారు.
563 పోస్టులకు 30 వేల మంది పోటీ పడుతున్నారు. వారం రోజుల పాటు పరీక్షలు రాయాలి. మనసులో ఎంతో ప్రశాంతత ఉండాలి. కానీ ఈ ప్రభుత్వం వారిని హింసించింది. కోర్టులో కేసు ఉంది.. తెగేదాకా ఆగండి అంటే కూడా కనికరించలేదు. జీవో 29 రాజ్యాంగ విరుద్ధమని చెప్పారు. కానీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. తెలుగు అకాడమీ పుస్తకాలు ప్రామాణికం కాదంటే మేం ఎక్కడ చావాలి అని అడిగారు. పరీక్షలు ఎలా రాయాలని అడిగారు. కొంచెం వాయిదా వేయండని అడిగారు. ధర్నాలు, దరఖాస్తులు పెట్టుకున్నారు. కానీ ప్రభుత్వం దుర్మార్గంగా వ్యవహరిస్తోంది. బలహీన వర్గాలను అణిచివేస్తోంది. జీవో 55కి తూట్లు పొడిచింది. తెలంగాణేతర పిల్లలకు ప్రయోజనం చేకూర్చేలా వ్యవహరిస్తోంది. హైకోర్టులో కూడా గ్రూప్-1 అభ్యర్థుల తరపున కొట్లాడుతాం. టాప్ లాయర్‌ను తీసుకొస్తామని కేటీఆర్ తెలిపారు.
కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చిందే నిరుద్యోగులు. ఇప్పుడేమో వారిని జీవో 29 తీసుకొచ్చి మోసం చేస్తున్నారు. జీవో 46కు సంబంధించిన పిల్లల కోసం కూడా సుప్రీంకోర్టులో కొట్లాడుతాం. గ్రూప్-4లో బ్యాక్ లాగ్ పోస్టులు కానివ్వొద్దని కోరుతున్నారు. ప్రభుత్వానికి ఇంత బేషజం ఉండొద్దు. హైకోర్టులో సమర్థవంతమైన న్యాయవాదులను నియమించి తమ వంతు పోరాడుతాం. ఈ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం తప్పని హైకోర్టులో రుజువు చేపిస్తామన్న విశ్వాసం మాకుందని కేటీఆర్ పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి..
KTR | రాష్ట్ర ప్రజలపై రూ. 18 వేల కోట్ల విద్యుత్ భారం..! కాంగ్రెస్ సర్కార్‌పై మండిపడ్డ కేటీఆర్
Harish Rao | మూసీపై పూటకో మాట.. సీఎం రేవంత్ రెడ్డికి హరీశ్‌రావు కౌంటర్