KTR | హైదరాబాద్ : ఈ రాష్ట్ర ప్రజానీకానికి సంతోషం వచ్చినా.. దుఃఖం వచ్చినా కేసీఆర్‌ను యాది చేసుకుంటున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ ఉన్నప్పుడే మాకు మంచిగా ఉండే అని వృద్ధులు, పేదింటి ఆడబిడ్డలు చెబుతున్నారని కేటీఆర్ తెలిపారు. తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమక్షంలో రంగారెడ్డి జిల్లాకు చెందిన పలువురు కాంగ్రెస్ నాయకులు బీఆర్ఎస్ పార్టీలో చేరారు.
ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. అధికారం ఎవరికీ శ్వాశతం కాదు. అందర్నీ ఏకం చేసి ఢిల్లీ పెద్దల మీద ఒత్తిడి చేసి చావు నోట్లో తలపెట్టి తెలంగాణ సాధించాడు కేసీఆర్. సంతోషం వచ్చినా.. దుఃఖం వచ్చినా ఇవాళ కేసీఆర్‌ను యాది చేసుకుంటున్నారు. ఎక్కడ ముసలవ్వను అడిగినా.. పెద్ద కొడుకు కేసీఆర్ ఇచ్చిన పెన్షనే వస్తుందని అంటున్నరు. కేసీఆర్ ఉన్నప్పుడు కల్యాణలక్ష్మి వచ్చిందని కేటీఆర్ కిట్ వచ్చిందని చెబుతున్నారు. ఇప్పుడు ఆ పథకాలు లేనే లేవని పేదింటి ఆడబిడ్డలు బాధపడుతున్నారని కేటీఆర్ తెలిపారు.
రైతుబంధు పడడం లేదు.. రేవంత్ రెడ్డి పచ్చి జూటాగాడు అని అన్నదాతలు అంటున్నరు. కేసీఆర్ ఉన్నప్పుడు నాట్లు వేసేటప్పుడు రైతుబంధు పడుతుండే అని రైతులు గుర్తు చేసుకుంటున్నారు. ఇప్పటి వరకు టకీటకీమని రైతుబంధు పడడం లేదు. 2500 ఇవ్వట్లేదు. పెన్షన్లు లేవు. అందరి కొంప పుచ్చుకుండు. రైతులను ఉద్యోగులను, నిరుద్యోగులను వృద్ధులను , మహిళలను మోసం చేసిండు అని కేటీఆర్ ధ్వజమెత్తారు.
రియల్ ఎస్టేట్ కూడా అధ్వాన్నమైంది. కొంపల్లిలో రియల్ ఎస్టేట్ వ్యాపారి ఆత్మహత్య చేసుకున్నాడు. హైడ్రా పేరుతో పేదల ఇండ్లు కూలగొట్టిండు. పాలమూరు ఎత్తిపోతల ద్వారా చేవెళ్ల, శంకర్పల్లి ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు నీళ్లు తెచ్చేందుకు కేసీఆర్ కృషి చేస్తే.. ఇదే కాంగ్రెస్ నేతలు కేసులు వేసి ఆపారు. అయినా 90 శాతం పనులు పూర్తయ్యాయి. ఈ పథకానికి రిజర్వాయర్లు తయారు అయ్యాయి. రేవంత్ కాల్వలు తవ్వి నీళ్లు తీసుకురావాలి. ఇంకో పది పైసలు ఖర్చు పెడితే నీళ్లు వస్తాయి. కానీ అది చేయకుండా.. మూసీని సుందరీకరణ చేస్తాడంట రేవంత్ రెడ్డి. వికారాబాద్ అడవుల్లో మొదలయ్యే మూసీ కిందకు తీసుకుపోయి నందనవనం చేస్తా అని అంటుండు. మూసీతో సాగయ్యేది ఎన్ని ఎకరాలు..? సృష్టించే సంపద ఎంత..? దాని వల్ల ఈ నగరానికి రాష్ట్రానికి లాభం ఎంత అంటే చెప్పడు. పాలమూరు ఎత్తిపోతల పూర్తి చేస్తే రేవంత్‌కు కమీషన్లు దొరకవు. కాబట్టి మూసీ పేరిట రంగుల కల చూపించి లక్షా 50 వేల కోట్లు ఖర్చు పెడుతా అని చెప్పి 70 వేల కోట్లు దండుకోవాలనేది రేవంత్ రెడ్డి ప్లాన్. ఆ 70 వేల కోట్లను ఢిల్లీ పెద్దలకు పంపి కుర్చీ కాపాడుకోవాలనే తాపత్రయంతో రేవంత్ రెడ్డి పని చేస్తున్నారు అని కేటీఆర్ ఆరోపించారు.
ఇవి కూడా చదవండి..
KTR | చెడు నీ చెవిలో చెబితే రక్తం కారుతది రేవంత్ రెడ్డి.. యాది పెట్టుకో : కేటీఆర్
Jogulamba Temple | మసకబారుతున్న జోగులాంబ ఆలయ ప్రతిష్ఠ.. ఇంతకీ ఏమైందంటే..?
Kollapur | కొల్లాపూర్‌లో ఫ్యాక్షన్ రాజకీయాలు.. బీఆర్ఎస్ నేతలపై మారణాయుధాలతో దాడి