Kollapur | కొల్లాపూర్, మార్చి 01: నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ నియోజక వర్గం లో ఫ్యాక్షన్ నీడలో అలముకున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి వరుసగా ప్రతిపక్షాలపై దాడుల పరంపర కొనసాగుతుంది. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మీటింగు ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తున్నాడని ప్రభుత్వ పథకాలపై ప్రశ్నిస్తున్నాడని పెద్దకొత్తపల్లి మండలం సాతాపూర్ గ్రామంలో మాజీ మార్కెట్ కమిటీ డైరెక్టర్ పరమేష్ పై గురువారం రాత్రి జరిగిన దాడి మరువక ముందే ఎమ్మెల్సీ కవిత మీటింగ్‌కు హాజరైన కోడేరు మండలానికి చెందిన ఓ కుటుంబంపై కాంగ్రెస్ గుండాలు విచక్షణ రహితంగా దాడులు చేశారు. అంతటితో ఆగకుండా పట్టపగలు కొల్లాపూర్ ప్రభుత్వ ఆసుపత్రికి చికిత్స కోసం వచ్చిన వారిని వెంటాడుతూ పోలీసుల సమక్షంలోనే కాంగ్రెస్ గుండాలు కత్తులతో దాడులకు తెగబడ్డారు. దీంతో చావు బతుకుల మధ్య కొల్లాపూర్ పట్టణంలోని ప్రైవేట్ దాబాఖానాలో బాధితులు చికిత్స పొందుతున్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన రోజు నుంచి గ్రామంలో మా కుటుంబంపై కాంగ్రెస్ పార్టీ నాయకులు పాండు నాయక్ అతను అనుచరులు దాడులకు తెగబడ్డారని బాధితులు తెలిపారు. డిసెంబర్ 30వ తేదీన మా కుటుంబ సభ్యురాలిపై దాడి చేసి పుస్తెలతాడు లాక్కొని వెళ్లారు. ఇదే విషయంపై కోడేరు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయడానికి వెళ్తే మెడ పెట్టి బయటకు గెంటేశారు. కనీసం పుస్తెలతాడు కూడా ఇప్పించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. మళ్ళీ శుక్రవారం మా అన్న రాజు నాయక్ ఎమ్మెల్సీ కవిత మీటింగ్ ఉందని కొల్లాపూర్ వెళ్లి వచ్చాడు.
దీంతో పగ పెంచుకుని శుక్రవారం అర్ధరాత్రి రాజు నాయక్ ఇంటి మీద కాంగ్రెస్ నేతలు మారణయుధాలతో దాడి చేశారు. కరెంట్ కూడా బంద్ చేసి.. రాజు కుటుంబ సభ్యులను చంపేందుకు ప్లాన్ చేసినట్లు బాధితులు చెబుతున్నారు. దీంతో భయంతో రాజు కుటుంబ సభ్యులు 100కు డయల్ చేసినా స్పందన లేదు. చివరకు ఎస్ఐకి ఫోన్ చేస్తే కూడా స్పందించలేదు. రాత్రికి రాత్రే రాజు నాయక్‌ను హత్య చేసేందుకు కాంగ్రెస్ గూండాలు యత్నించారని బాధిత కుటుంబ సభ్యులు వాపోయారు.
శనివారం ఉదయం మా ఇంట్లో వాళ్ళు టిఫిన్ చేస్తుంటే వచ్చి దాడులకు తెగబడినట్లు రవి నాయక్ తెలిపారు. దాడి ఘటనపై కోడేరు పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేస్తే పట్టించుకోకపోవడంతో కొల్లాపూర్ ప్రభుత్వ హాస్పిటల్ కు చికిత్స కోసం వచ్చిన నాపై మా అన్న రాజు మా కుటుంబ సభ్యులు శ్రీ దివ్య, బాలు, ఠాగూర్, లల్లి, చిట్టిలపై కత్తులతో రాడ్డులతో దాడులు చేశారు. ప్రభుత్వం మారిన రోజు నుంచే మా ఇంటి ముందు మా స్థలాన్ని ఆక్రమించుకొని మళ్లీ మాపై దాడులకు తెగ పడుతున్నట్లు పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు నుంచి ప్రాణభయం ఉందని మా కుటుంబానికి ఏమైనా జరిగితే కాంగ్రెస్ పార్టీ నాయకులదే బాధ్యత అని బాధితులు పేర్కొన్నారు.
కాంగ్రెస్ పార్టీ నాయకుడు పాండు నాయక్ తన అనుచరులతో కలిపి దాడి చేసిన ఘటనలో బీఆర్ఎస్ పార్టీ నాయకుడు రాజు నాయక్ అతని కుటుంబ సభ్యులు తీవ్ర గాయాల పాలయ్యారు. ఈ దాడిలో రవి నాయక్ తలపై నాలుగు కుట్లు పడ్డాయి. రాజు నాయక్ తలపై 20 కుట్లు పడ్డాయి. రాజు నాయక్‌పై గ్రామంలో దాడి జరిగిన అనంతరం మళ్లీ కొల్లాపూర్ ప్రభుత్వ ఆసుపత్రిలో గొడ్డలితో, కత్తులతో దాడి జరిగినట్లు తెలుస్తుంది. శ్రీవిద్యకు చేయి ఫ్రాక్చర్ అయింది. బాలు నాయక్ నడుములపై తీవ్ర గాయాలయ్యాయి. అలాగే లాలమ్మ, చిట్టెమ్మ, ఠాగూర్ లకు కూడా తీవ్ర గాయాలయ్యాయి.
బీఆర్ఎస్ పార్టీ నాయకుడు రాజు కుటుంబంపై దాడికి పాల్పడిన వారిని వెంటనే అరెస్టు చేయాలని కొల్లాపూర్ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ కిషన్ నాయక్, లంబాడా హక్కుల పోరాట సమితి నాయకులు రవి నాయక్‌తో పాటు బాధ్యత కుటుంబ సభ్యులు కొల్లాపూర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
కోడేరు మండలంలో బిఆర్ఎస్ పార్టీ నాయకులపై దాడి చేసిన ఘటనలో ఆరోపణలు ఎదుర్కొంటున్న కాంగ్రెస్ పార్టీ నాయకుడు పాండు నాయక్ కొల్లాపూర్ పట్టణంలో ఏర్పాటు చేసిన భారీ ఫ్లెక్సీలను శనివారం కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆదేశాలతో తొలగించినట్లు చర్చ నడుస్తుంది.
కొల్లాపూర్ ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణలో శుక్రవారం ఉదయం కాంగ్రెస్ పార్టీ నాయకులు బీఆర్ఎస్ పార్టీ నాయకులపై దాడి చేసిన ఆయుధాలను అక్కడే వారి వాహనాలలో గొడ్డలి ఇనుప రాడ్లు పెట్టుకున్నారని, మళ్లీ కొల్లాపూర్ ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్ళితే దాడి చేసేందుకు దాచి పెట్టారని బాధిత కుటుంబ సభ్యులు ఆరోపించారు.
కొల్లాపూర్ ప్రభుత్వ ఆస్పత్రి ఆవరణలో రాజు నాయక్‌తో పాటు ఆయన కుటుంబ సభ్యులపై కాంగ్రెస్ గుండాలు మారణాయుధాలతో దాడికి తెగబడ్డారు. ఇందుకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజీని పోలీసులు దాచిపెడుతున్నారు. ఈ కేసులో ఈ ఫుటేజీ సాక్ష్యంగా నిలుస్తుందని చెప్పి, దాన్ని మాయం చేసేందుకు పోలీసులు యత్నిస్తున్నట్లు సమాచారం. ఎందుకంటే మంత్రి జూపల్లి కృష్ణారావుకు పోలీసులు వత్తాసు పలుకుతున్నారని బాధితులు ఆరోపించారు.