KTR | హైదరాబాద్ : కర్ణాటక, హిమాచల్ ప్రదేశ్, తెలంగాణలో గ్యారంటీల పేరుతో కాంగ్రెస్ ప్రజలను మోసం చేసిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ధ్వజమెత్తారు. హర్యానాలో ఏడు గ్యారంటీలంటూ మోసం చేయబోయరు. కానీ కాంగ్రెస్ మోసాలను గుర్తుపట్టి వాళ్లు ఆ పార్టీకి సరైన బుద్ది చెప్పారని కేటీఆర్ పేర్కొన్నారు. కాంగ్రెస్ సీనియర్ లీడర్ మహమ్మద్ అలావుద్దీన్ పటేల్ సహా ఆయన అనుచరులు తెలంగాణ భవన్లో కేటీఆర్ సమక్షంలో గులాబీ కండువా కప్పుకున్నారు.
ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ, రాహుల్ గాంధీ బుద్ది తెచ్చుకోవాలి. మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చండి. లేదంటే మీకు ప్రజలు సరైన గుణపాఠం చెప్పటం ఖాయం. రాష్ట్రంలో ప్రతి పౌరుడు ఇప్పుడు కేసీఆర్ అధికారంలో లేరన్న బాధలో ఉన్నారు. పేదల కోసం కేసీఆర్ ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేశారు. కేసీఆర్, బీఆర్ఎస్ ఉన్నంత వరకు ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. సెక్యులరిజాన్ని కొనసాగిస్తాం. మనిషి మనిషిగా చూస్తూ భవిష్యత్‌లోనూ అదే తరహా రాజకీయం చేస్తామని కేటీఆర్ తెలిపారు.
మోదీ మమ్మల్ని బెదిరించేందుకు ప్రయత్నించాడు. మా చెల్లిలిని జైల్లో పెట్టారు. అయిన సరే మేము తల వంచలేదు. మోడీతోనే పోరాటం చేశాం. అదే పోరాట స్ఫూర్తి కొనసాగుతూనే ఉంటుంది. పేదలకు అన్యాయం చేస్తున్న కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా బీఆర్ఎస్ పోరాటం చేస్తూనే ఉంటుంది. ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గం కొడంగల్‌లో అక్రమంగా భూములు గుంజుకోవద్దంటూ మా పార్టీ నేత పట్నం నరేందర్ రెడ్డి ధర్నా చేస్తే ఆయనను అక్రమంగా అరెస్ట్ చేశారు. అక్కడ రైతుల మీద లాఠీ ఛార్జి చేశారు. ముఖ్యమంత్రి నీ కొడంగల్ నియోజకవర్గంలోనే ప్రజలను ఒప్పించకపోతే రాష్ట్రాన్ని ఎట్ల నడిపిస్తావ్? ప్రజల భయాలను, అనుమానాలను నివృత్తి చేసి వాళ్లను ఒప్పించాలి. ఎన్నో రోజులు పోలీసులను పెట్టుకొని ఇలాంటి అరాచకాలు మీరు జరపలేరు. ప్రజాభిప్రాయం మేరకే వాళ్లను ఒప్పించి, మెప్పించి ఏ పరిశ్రమ అయిన పెట్టాలి. మా పార్టీ నేత నరేందర్ రెడ్డితో సహా మీరు అరెస్ట్ చేసిన బీఆర్ఎస్ కార్యకర్తలను వెంటనే విడుదల చేయాలి అని కేటీఆర్ డిమాండ్ చేశారు.
ఇవి కూడా చదవండి..
TGPSC | గ్రూప్-1 అభ్యర్థులకు అలెర్ట్.. ఈ నెల 14 నుంచి అందుబాటులోకి మెయిన్స్ హాల్ టికెట్స్