KTR | హైదరాబాద్ : అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేసేందుకు పైసలు లేవంట.. కానీ మూసీ ప్రక్షాళన కోసం రూ. లక్షా 50 వేల కోట్లు ఖర్చు చేస్తాడంట.. అని రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. కాంగ్రెస్ సీనియర్ లీడర్ మహమ్మద్ అలావుద్దీన్ పటేల్ సహా ఆయన అనుచరులు తెలంగాణ భవన్లో కేటీఆర్ సమక్షంలో గులాబీ కండువా కప్పుకున్నారు.
ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. కేసీఆర్ జాబ్ పొగొట్టండి. మీకు ఏడాది లో 2 లక్షల ఉద్యోగాలంటూ రాహుల్ గాంధీ అశోక్ నగర్‌కు వచ్చి ఇది నా గ్యారంటీ అని హామీ ఇచ్చాడు. కానీ రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డికి తప్ప తెలంగాణ యువతకు ఉద్యోగాలు రాలేదని కేటీఆర్ తెలిపారు. మహిళలకు రూ. 2500 ఇస్తా అన్నాడు. కోటి 60 లక్షల మంది మహిళలు రూ. 2500ల కోసం వేచి చూస్తున్నారు. వృద్ధులకు రూ. 4 వేలు అన్నాడు. ఇంట్లో ఇద్దరికీ పింఛన్ అన్నాడు. ఒక్కరికన్నా వచ్చిందా? అంటే లేనే లేదు. ఉన్న రైతు బంధు, ఉన్న పింఛన్ కూడా వస్తలేదు. వాళ్లు 420 హామీలు ఇచ్చారు. ఇప్పుడు ఏమైనయ్ అంటే సమాధానం చెబుతలేడు. కళ్యాణ లక్ష్మి పేరుతో తులం బంగారం ఇస్తా అన్నాడు. తులం ఇనుము కూడా ఇవ్వడని కేటీఆర్ విమర్శించారు.
సంక్షేమ పథకాల కోసం పైసలు ఇస్తే మీరు కమీషన్లు ఇవ్వరు కదా? అదే మూసీ ప్రాజెక్ట్ అయితే లక్షా కోట్లు మింగొచ్చు. రాహుల్ గాంధీ, వాళ్ల బావకు కోట్ల రూపాయలు దోచి పెట్టొచ్చు. మనం గల్లా పట్టి అడిగే వరకు ఈ కాంగ్రెస్ పార్టీ మోసం కొనసాగుతూనే ఉంటది. మనం ఏదైనా సమస్య వస్తే కలెక్టర్లకు చెప్పాలంట. ఇంటింటికి ఓట్ల కోసం వచ్చిన వాళ్లను మాత్రం అడగవద్దంట. ప్రజలకు ఏం ఖర్మ. ఎవరైతే మనకు తప్పుడు హామీలు ఇచ్చారో వాళ్లనే పట్టుకోవాలే. కాంగ్రెస్ ఎంపీలు, ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ నాయకులను పట్టుకొని మనం అడగాలె అని కేటీఆర్ సూచించారు.
ఇవి కూడా చదవండి..
TGPSC | గ్రూప్-1 అభ్యర్థులకు అలెర్ట్.. ఈ నెల 14 నుంచి అందుబాటులోకి మెయిన్స్ హాల్ టికెట్స్
KTR | బతుకమ్మ, దసరా వేళ.. భయానక వాతవరణం సృష్టించారు.. రేవంత్ సర్కార్‌పై కేటీఆర్ ఆగ్రహం
TG Rains | తెలంగాణలో మూడురోజులు ఉరుములతో కూడిన వానలు.. హెచ్చరించిన ఐఎండీ