KTR | హైదరాబాద్ : కేవలం బ్లాక్ మెయిల్ దందా కోసమే హైడ్రాను రేవంత్ రెడ్డి సర్కార్ ఏర్పాటు చేసిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. హైడ్రా నిర్ణయాల కారణంగా భూములు అమ్ముడుపోవడం లేదని బిల్డర్లు బాధపడుతున్నారని కేటీఆర్ తెలిపారు. శ్రీనగర్ కాలనీలో తెలంగాణ రియల్టర్స్ ఫోరమ్ సమావేశంలో కేటీఆర్ పాల్గొని ప్రసంగించారు.
ప్రస్తుతం బిల్డర్లు కనీసం పర్మిషన్లు కూడా తీసుకోవటం కష్టమైపోతోంది. ఇటీవల ఒక పెద్ద బిల్డర్ వచ్చి మరో ఏడాదిలో పరిస్థితి మారకపోతే ఎంతో మంది చిన్న బిల్డర్లు చితికిపోతారని చెప్పారు. శక్తికి మించిన పెట్టుబడులు పెట్టాం. కానీ మా భూములు అమ్ముడుపోవటం లేదని బాధపడ్డారు. ఎందుకు ఈ పరిస్థితి వచ్చిందంటే ప్రజల చేతుల్లో డబ్బులు లేకుండా ఈ ప్రభుత్వం చేస్తోందని కేటీఆర్ తెలిపారు.
రియల్ ఎస్టేట్ రంగం గురించి నా కన్నా ఎక్కువ ఎవరికి తెలుసని ముఖ్యమంత్రి అన్నాడు. మంత్రి పదవి గురించి అడిగితే గుంపు మేస్త్రి మాదిరిగా పనిచేస్తా అన్నాడు. మరి 11 నెలలు అయ్యింది. ఇప్పటివరకు రియల్ ఎస్టేట్ కు సంబంధించి ఒక్క మంచి నిర్ణయం తీసుకోలేదు. హైడ్రా అనే పేరుతో ఆలోచన లేకుండా చేస్తున్నారు. కేవలం బ్లాక్ మెయిల్ దందా కోసం దాన్ని పెట్టారు. ప్రాజెక్ట్‌కు లేక్ వ్యూ అని పేరు పెట్టాలంటే భయపడుతున్నారు. పర్మిషన్ కావాలంటే అది గాలిలో దీపం మాదిరిగా అయ్యింది. ప్రాజెక్టులు రద్దు చేస్తున్నాడు, కొత్త ప్రాజెక్టులు లేవు, బిల్డర్లను బెదిరించి డబ్బులు కావాలని అంటున్నాడు. ఎందుకంటే ఆయన ఢిల్లీకి పంపించాలని కేటీఆర్ ఆరోపించారు.
మార్కెట్లో ఎవరి దగ్గరా డబ్బులు లేని పరిస్థితిని తీసుకొచ్చారు. నేను చెప్పేవన్నీ నిజాలని రేవంత్ రెడ్డికి కూడా తెలుసు. మా మీద కోపంతో వేల మంది కడుపులు కొట్టొద్దు. మంచి పనులు చేయండి. రైతు బంధు వేస్తే మళ్లీ ఆ డబ్బు ప్రభుత్వానికే ట్యాక్స్ రూపంలో వస్తుంది. రేవంత్ రెడ్డికి ఏం తెలియదు. తెలియదన్న విషయం కూడా ఆయనకు తెలియదు. కాంగ్రెస్ ఎన్నికల ప్రచారంలో నో ఎల్ఆర్ఎస్, నో బీఆర్ఎస్ అని అన్నారు. కానీ ఇప్పుడు ముక్కు పిండి మరీ ఎల్ఆర్ఎస్ వసూలు చేస్తున్నారు. రియల్ ఎస్టేట్ రంగంలో ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు మీకు తెలియాలి. హెచ్ఎండీఏ పరిధిలో రిజిస్ట్రేషన్లను రద్దు చేశారు. ఇది మధ్యతరగతి ప్రజలకు ఎంతో నష్టం చేస్తుంది. ఎఫ్టీఎల్ లాంటి ప్లేస్‌లో కూడా రిజిస్ట్రేషన్లు జరిగాయి. ప్రభుత్వంలో ఒక చేయి ఏం చేస్తుందో.. మరో చేయికి తెలియదు. అందుకే రియల్ ఎస్టేట్ ఏజెంట్లు ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలను తెలుసుకోవాలి. దానికి సంబంధించి ప్రభుత్వాన్ని ప్రశ్నించాలి. మేము మీకు సంబంధించిన సమస్యలపై శాసన సభలో ప్రభుత్వంపై పోరాటం చేస్తాం కేటీఆర్ స్పష్టం చేశారు.
హైడ్రా పేరుతో అనాలోచితంగా కూల్చివేయటంతో ఓ గర్భిణీ మహిళ 40 ఏళ్లు ఎలా ఈఎంఐ కట్టాలని ప్రశ్నించింది. మరి దీనికి హైడ్రానా, మున్సిపల్ శాఖనా? ముఖ్యమంత్రా? ఎవరు సమాధానం చెబుతారు. రెరాతో మాట్లాడుతూ లీగల్ ఒపీనియన్ తీసుకొని తెలంగాణ రియల్టర్స్ ఫోరమ్ మరింత బలపడాలి. మళ్లీ ఎప్పుడు ఎన్నికలు వచ్చినా బీఆర్ఎస్ గెలవటం ఖాయమని రేవంత్ రెడ్డికి కూడా తెలుసు. మేము అధికారంలో ఉన్నప్పుడు ప్రతీకార చర్యలంటూ పిచ్చి పిచ్చి ఆలోచనలు చేయలేదు. ప్రజలకు సంక్షేమం, అభివృద్ధి చేయాలని భావించాం. ప్రభుత్వం తన ఆలోచనను మార్చుకొని ప్రజలకు మంచి చేస్తే నిర్మాణాత్మక ప్రతిపక్షంగా సహకరిస్తాం. ప్రభుత్వం ఇలాగే మొండిగా వ్యవహరిస్తే మాత్రం ప్రధాన ప్రతిపక్షంగా మేము పోరాటం చేస్తూనే ఉంటామని కేటీఆర్ తేల్చిచెప్పారు.
ఇవి కూడా చదవండి..
KTR | తెలంగాణలో భూముల విలువ ఛూమంతర్ అనగానే పెరగలేదు : కేటీఆర్
KCR | దాశరథి కృష్ణమాచార్య వర్ధంతి.. నివాళులర్పించిన కేసీఆర్
Ex Minister Roja | ఏపీలో రాష్ట్రపతి పాలన విధించాలి : మాజీ మంత్రి రోజా