అమరావతి : ఆంధ్రప్రదేశ్‌లో శాంతి భద్రతలు (Law and Order) పూర్తిగా క్షీణించాయని, వెంటనే రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాలని వైసీపీ నాయకురాలు, మాజీ మంత్రి రోజా (Ex Minister Roja ) సెల్వమణి ప్రధాని మోదీని కోరారు. తిరుపతిలో ఆమె మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో మహిళలపై దాడులు చూస్తుంటే బాధేస్తోందని అన్నారు.
ఏపీలో విచ్చలవిడిగా బెల్ట్ షాపుల (Beltshop) వల్లే అఘాయిత్యాలు పెరుగుతున్నాయని ఆరోపించారు. 120 రోజుల్లో 110కి పైగా దాడులు, అఘాయిత్యాలు జరిగాయని పేర్కొన్నారు. పోలీసుశాఖపై నేరస్తుల్లో భయం లేకుండా పోయిందని విమర్శించారు. బిహార్‌లో గతంలో దారుణ ఘటనలు జరిగేవని, ఈరోజు ఏపీలో ప్రతిరోజూ జరుగుతున్నాయని అన్నారు.
అధికారులతో పని చేయించుకోవడం రాకపోతే సీఎం, డిప్యూటీ సీఎం, హోంమంత్రి తమ పదవులకు రాజీనామా చేయాలని సూచించారు. దళిత మహిళ అనితకు హోంమంత్రి పదవి అప్పగించి రాష్ట్రంలో జరుగుతున్న తప్పులను ఆమెపై రుద్దుతున్నారని పేర్కొన్నారు. విధుల నిర్వహణలో అనిత పూర్తిగా విఫలమైందని విమర్శించారు. చంద్రబాబు, లోకేష్‌లు పోలీసులను బెదిరిస్తున్నారని ఆరోపించారు.
రాష్ట్రంలో జరుగుతున్న అరాచకాలపై పవన్‌కల్యాణ్ ఎందుకు స్పందించరని ప్రశ్నించారు. వైసీపీ పాలనలో సమర్ధవంతంగా పనిచేసిన పోలీసుల అధికారులను కూటమి ప్రభుత్వం వైసీపీ ముద్రవేసి పక్కన పెట్టిందని దుయ్యబట్టారు. రాష్ట్రంలో ఆడపడుచులపై దారుణాలను వెంటనే అరికట్టాటని, నిందితులను కఠినంగా శిక్షించాలని రోజా డిమాండ్ చేశారు.