KTR | వికారాబాద్ : భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఒక వర్గానికో, ఒక కులానికో సంబంధించిన వ్యక్తి కాదు అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు. పరిగి నియోజకవర్గంలోని దాస్యానాయక్ తండాలో అంబేద్కర్ విగ్రహావిష్కరణ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో కేటీఆర్ పాల్గొని ప్రసంగించారు.
బోధించు.. సమీకరించు.. పోరాడు.. అని చెప్పిన అంబేద్కర్ పోరాట స్ఫూర్తిని పూర్తిస్థాయిలో ఆచరణలో పెట్టింది కేసీఆర్ మాత్రమే. ఏ విధంగా అంటే 2001లో తెలంగాణలోని అన్ని వర్గాల ప్రజలకు జరుగుతున్న అన్యాయాన్ని దృష్టిలో ఉంచుకుని లక్షల సంఖ్యలో ప్రజలను సమీకరిస్తూ, తెలంగాణ వస్తే వచ్చే లాభం ఏంటో బోధిస్తూ, ఆనాటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై పోరాడుతూ.. 14 ఏండ్లు పోరాడి పోరాడి చివరకు అహింసాయుతమైన పద్ధతుల్లో చావు నోట్లో తలపెట్టి మీ అందరి దయతో అంబేద్కర్ రాసిన ఆర్టికల్ 3 ద్వారా తెలంగాణ సాధించుకున్నాం. ఆ మహానీయుడికి చప్పట్లతో ధన్యవాదాలు, నివాళులు చెప్పాలి. అంబేద్కర్ రాసిన రాజ్యాంగం లేకపోతే ఇవాళ తెలంగాణ లేదు అని కేటీఆర్ పేర్కొన్నారు.
ప్రపంచ మేధావుల్లో ఒకరిగా అంబేద్కర్ను ప్రపంచ దేశాలు గుర్తించాయి. హార్వర్డ్, ఆక్స్ ఫర్డ్ లాంటి యూనివర్సిటీలు పిలిచి.. 75 ఏండ్ల కిందట వారితో ఉపన్యాసాలు ఇప్పించుకున్నాయి. మన దేశంలో మాత్రం దళితులకు మాత్రమే ఆయనను ఆరాధ్య దైవంగా చిత్రీకరించే ప్రయత్నం చేశారు. అంబేద్కర్ ఒకళ్లకు పరిమితం కాదు. గాంధీ, నెహ్రూ కంటే ఎక్కువ మేధస్సు కలిగిన వ్యక్తి అంబేద్కర్ అని గుర్తించి, దాస్యానాయక్ తండాలో ఆయన విగ్రహం ఏర్పాటు చేసి, ఆవిష్కరించేందుకు నన్ను పిలవడం ఆనందంగా ఉంది. దాస్యానాయక్ తండా ప్రజలకు రుణపడి ఉంటాను. దళితులకు, గిరిజనులకు మాత్రమే రిజర్వేషన్లు ఇవ్వలేదు. మన దేశంలో అంబేద్కర్ రాజ్యాంగ నిర్మాత కావడం వల్ల 1952 ఎన్నికల్లోనే ఆడబిడ్డలందరికి ఓటు హక్కు కల్పించారు. భారత రాజ్యాంగం కల్పించిన ఆర్టికల్ 19 వల్లే ఈ దేశంలో స్వేచ్ఛగా మాట్లాడగలుగుతున్నామని కేటీఆర్ తెలిపారు.
ఇవి కూడా చదవండి..
KTR | బడ్జెట్లో తెలంగాణ అనే పదమే ఉచ్ఛరించలేదు : కేటీఆర్