Ranbir Kapoor | బాలీవుడ్ దివంగత నటుడు రిషి కపూర్ పేరును దుర్వినియోగం కాకుండా అడ్డుకోవడానికి కపూర్ కుటుంబం ఒక కీలక నిర్ణయం తీసుకుంది. ఆయన పేరు, చిత్రం మరియు వ్యక్తిత్వ హక్కుల (Personality Rights) పై కపూర్ కుటుంబం తాజాగా కాపీరైట్ పొందింది.
బాలీవుడ్ లెజెండరీ నటుడు రిషి కపూర్ మరణించిన తర్వాత కూడా ఆయన పేరును, ఫోటోలను లేదా గొంతును వాణిజ్య పరంగా చాలామంది వాడుకుంటున్నారని గుర్తించిన కపూర్ కుటుంబం ఈ విషయంపై కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై ఆయన పేరును లేదా ఫోటోలను, ఏవైనా ప్రకటనలు లేదా ఇతర వాణిజ్య ప్రయోజనాల కోసం ఉపయోగించాలంటే ఆయన వారసుల (నీతూ కపూర్, రణబీర్ కపూర్) అనుమతి తప్పనిసరి అని కోర్టు వెల్లడించింది. ఈ సందర్భంగా పూర్తి కాపీరైట్ కుటుంబ సభ్యులకు చెందుతుందని తెలిపింది. ఈ కాపీరైట్ ప్రధాన ఉద్దేశం రిషి కపూర్ వ్యక్తిత్వానికి ఉన్న గౌరవాన్ని కాపాడటంతో పాటు, తప్పుడు పద్ధతుల్లో ఆయన పేరును వాడుకోకుండా అడ్డుకోవడమే అని కుటుంబం వెల్లడించింది. ఇప్పటికే అమితాబ్ బచ్చన్, అనిల్ కపూర్ వంటి స్టార్ హీరోలు తమ వ్యక్తిత్వ హక్కులను కోర్టు ద్వారా రక్షించుకోగా, ఇప్పుడు రిషి కపూర్ విషయంలోనూ అదే బాటలో కుటుంబ సభ్యులు ముందుకెళ్లారు.