Harish Rao | హైదరాబాద్ : దేశమంటే మట్టి కాదోయో దేశమంటే మనుషులోయ్ అంటూ ప్రసంగించిన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్.. దేశమంటే కొన్ని రాష్ట్రాలే అన్నట్లు బడ్జెట్ ప్రవేశ పెట్టడం బాధాకరం అని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు పేర్కొన్నారు. కేంద్ర బడ్జెట్‌పై హరీశ్‌రావు తీవ్రంగా స్పందించారు.
2025-26 బడ్జెట్ తన రాజకీయ అవసరాలే ఉపయోగించుకున్నది తప్ప, దేశ సమ్మిళిత వృద్ధిని ఏమాత్రం పట్టించుకున్నట్లు లేదు. కేంద్ర ప్రభుత్వం పదే పదే వల్లెవేస్తున్న వికసిత్ భారత్ ఇలాంటి వైఖరితో సాధ్యమవుతుందా అని పునర్ సమీక్షించుకోవాలని కోరుతున్నాం. ఎన్నికలు ఉన్న రాష్ట్రాలకు పెద్ద మొత్తంలో వరాలు ప్రకటించి, ఎన్నికలు లేని రాష్ట్రాల పట్ల వివక్ష చూపడం సరికాదు. మొదటి నుంచి ఇదే దోరణిని ప్రదర్శిస్తూ రాజకీయ అవసరాలు తీర్చుకుంటున్నది కేంద్ర ప్రభుత్వం.
2024లో ఆంధ్రప్రదేశ్ కోసం, 2025 ఢిల్లీ, బిహార్ రాష్ట్రాల కోసం బడ్జెట్ పెట్టారు. 2026లో యూపీ కోసం, 2027లో గుజరాత్ కోసం బడ్జెట్ పెడుతారా? యావత్ దేశానికి సరిపోయే బడ్జెట్ ఎప్పుడు పెడతారు? అని హరీశ్‌రావు నిలదీశారు. బడ్జెట్లో తెలంగాణ రాష్ట్రానికి చోటు లేదా? తెలంగాణ ప్రాంత ప్రయోజనాలకు విలువ లేదా? ఇది కేంద్ర బడ్జెట్‌లా లేదు.. కేవలం మూడు, నాలుగు రాష్ట్రాల బడ్జెట్లాగా ఉంది. తెలంగాణ నుంచి ఇద్దరు కేంద్ర మంత్రులు, 8 మంది ఎంపీలు ఉండి తెలంగాణ రాష్ట్రానికి ఏం సాధించినట్లు? తెలంగాణతో తమకు బంధం లేదని బడ్జెట్ ద్వారా మరోసారి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం నిరూపించింది అని హరీశ్‌రావు ధ్వజమెత్తారు.
కేంద్ర జీడీపీకి 5.1 శాతం కాంట్రిబ్యూట్ చేస్తున్న తెలంగాణ మరోసారి మోస పోయింది. ఏపీ పునర్విభజన చట్టం ప్రకారం ట్రైబల్ యూనివర్సిటీకి ఇవ్వాల్సిన నిధులు కూడా ఇవ్వకపోవడం బాధాకరం. తెలంగాణకు నిధులు రాబట్టుకోవడంలో రేవంత్ సర్కారు పూర్తిగా విఫలమైంది. తీరిగ్గా తేరుకొని, బడ్జెట్‌కు పది రోజుల ముందు రూ. 40 వేల కోట్లు కావాలని తూతూ మంత్రంగా లేఖ రాయడం తప్ప రాష్ట్ర ప్రయోజనాల కోసం కాంగ్రెస్ ప్రభుత్వం చేసిందేం లేదు. కేంద్రం బడ్జెట్ ద్వారా నిధులు రాబట్టుకోవడంలో సీఎం రేవంత్ రెడ్డి, రాష్ట్ర కాంగ్రెస్ ఎంపీలు పూర్తిగా విఫలమయ్యారని హరీశ్‌రావు మండిపడ్డారు.
ఏడాది కాలంలో 30 సార్లకు పైగా ఢిల్లీకి వెళ్లారు. ఏం సాధించారో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ ప్రజలకు సమాధానం చెప్పాలి. బీజేపీ, కాంగ్రెస్ పార్టీల తీరు వల్ల తెలంగాణకు తీరని అన్యాయం జరిగింది. నిధుల కేటాయింపు సంగతి దేవుడెరుగు, విభజన చట్టంలో పొందుపరిచిన హామీలను కూడా కేంద్రం నెరవేర్చలేకపోయింది అని హరీశ్‌రావు విమర్శించారు.
సంకీర్ణ యుగంలో, కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు స్థానిక పార్టీల మద్ధతు కీలకం అయ్యే రోజొకటి వస్తుందని కేసీఆర్ ఎప్పుడూ చెప్పేవారు. కేంద్రానికి మద్ధతు పలికిన జనతాదళ్ (యూ) బీహార్‌లో వివిధ అభివృద్ధి పనులకు గతేడాది రూ. 26,000 కోట్ల సాయం, 2,400 మెగావాట్ల పవర్ ప్లాంట్, గయాలో పారిశ్రామిక కారిడార్, నూతన విమానాశ్రయాలు, మెడికల్ కాలేజీలకు సాయం తదితరాలు పొందింది. ఎన్నికలు దగ్గర ఉన్నాయని ఇప్పటి బడ్జెట్లో బిహార్‌కు మరిన్ని వరాల జల్లు కురిపించారు.
బిహార్‌లో మఖాన బోర్డు ఏర్పాటు, మిథిలాంచల్‌లో వెస్టర్న్ కోసి కెనాల్, ఐఐటీ పాట్నా విస్తరణ, బిహార్‌లో గ్రీన్ ఫీల్డ్ ఎయిర్ పోర్టు, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు అని హరీశ్‌రావు పేర్కొన్నారు.
కానీ, నమ్మి 16 సీట్లలో కాంగ్రెస్, బీజేపీలను గెలిపిస్తే, ఇద్దరూ కలిసి తెలంగాణకు మొండి చెయ్యి ఇచ్చారు. 8 మంది బిజేపీ, 8 మంది కాంగ్రెస్ ఎంపీలు, రాష్ట్రానికి ప్రత్యేకంగా 8 రూపాయలు కూడా అధికంగా సాధించిన దాఖలాలు లేవు. కేంద్రం ఇతర రాష్ట్రాలకు కేటాయింపులు చేయడం సంతోషం.. ఇందులో మాకు ఎలాంటి బాధ లేదు. కానీ తెలంగాణ పరిస్థితి ఏమిటో కాంగ్రెస్, బిజేపీ ఎంపీలు చెప్పాలి. తెలంగాణలో ప్రాజెక్టుల సంగతి ఏమిటి? పునర్విభజన చట్టం హామీల పరిస్థితి ఏమిటి? ప్రశ్నించాల్సిన కాంగ్రెస్, బిజేపీ ఎంపీలు మౌనం దాల్చారు. కేంద్రం మెప్పు కోసం తెలంగాణ ప్రయోజనాలను తాకట్టు పెడుతున్నారు. తెలంగాణకు ప్రయోజనాల కోసం, తెలంగాణ ప్రజల కోసం ఎప్పటికైనా పోరాడేది బిఆర్ఎస్ పార్టీయేనని మరోసారి రుజువైంది. తెలంగాణ ప్రయోజనాలు కాపాడటంలో బిజేపీ, కాంగ్రెస్ పార్టీలు వైఫల్యం చెందుతున్నాయన్న విషయాన్ని రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారు అని హరీశ్‌రావు పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి..
Harish Rao | పుల్లూరు బండ క్షేత్రాన్ని పర్యాటక కేంద్రంగా తీర్చి దిద్దుతాం : హరీశ్ రావు
Turmeric Board | ఇందూరులో బోర్డు.. ఢిల్లీలో బాధ్యతలా?.. పసుపుబోర్డు ఏర్పాటులో కేంద్రం దోబూచులాట
Osmania Hospital | ఉస్మానియాకు 2700 కోట్లు ఎందుకు?.. నిర్మాణ అంచనాలపై నిపుణుల్లో అనుమానాలు