Turmeric Board | నిజామాబాద్, జనవరి 31 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : పసుపుబోర్డు అంశంలో కేంద్ర ప్రభుత్వం దోబూచులాడుతున్నది. ఐదున్నరేండ్లపాటు సాగదీతతో పసుపు రైతులను మోసం చేసిన బీజేపీ.. 15 రోజుల క్రితం పసుపుబోర్డు ఏర్పాటుపై కీలక ప్రకటన చేసింది. జనవరి 13న జాతీయ పసుపు బోర్డు చైర్మన్‌గా పల్లె గంగారెడ్డిని నియమిస్తూ వాణిజ్య మంత్రిత్వ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. పసుపు పంటకు ప్రత్యేక స్పైసెస్ బోర్డు ప్రకటించింది. జనవరి 14న నిజామాబాద్‌లోని ఓ ప్రైవేటు హోటల్లో జాతీయ పసుపు బోర్డు ప్రారంభోత్సవం పేరిట ఎంపీ ధర్మపురి అర్వింద్ హడావుడి చేశారు.
పసుపు బోర్డు చైర్మన్ పల్లె గంగారెడ్డి సైతం అంతా అయిపోయిందన్న రేంజ్లో ప్రకటనలు ఇచ్చారు. ఇప్పుడు జాతీయ పసుపు బోర్డు కార్యాలయాన్ని ఢిల్లీలో ఏర్పాటుచేయడం అనుమానాలకు తావిస్తున్నది. అదే ఆఫీస్‌లో శుక్రవారం ఎంపీ అర్వింద్ సమక్షంలో పల్లె గంగారెడ్డి బాధ్యతలు స్వీకరించడం పసుపు రైతాంగాన్ని అయోమయానికి గురిచేస్తున్నది.
రాష్ట్ర ప్రభుత్వంతో సంప్రదించకుండా స్థానిక ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలను ఆహ్వానించకుండానే బోర్డు ప్రారంభోత్సవాన్ని నిర్వహించారు. ఢిల్లీ నుంచి వాణిజ్య మంత్రి పీయూశ్గోయల్, ఎంపీ అర్వింద్ వర్చువల్‌గా ప్రారంభించారు. నిజామాబాద్‌లోనే పసుపు బోర్డు ఏర్పాటైందని మంత్రితోపాటు ఎంపీ ప్రకటించారు. జాతీయ పసుపు బోర్డుకు ఎక్కడా గుంట భూమి కేటాయించలేదు. ఇదివరకే ఏర్పాటైన స్పైసెస్ బోర్డు ఎక్స్టెన్షన్ కార్యాలయం బోర్డునే జాతీయ పసుపు బోర్డుగా మార్చేశారు.
రెండు టేబుళ్లు, కుర్చీలతో కార్యాలయాన్ని కొనసాగిస్తున్నారు. సాంకేతికంగా జాతీయ పసుపు బోర్డు నిజామాబాద్‌లోనే ఏర్పాటు చేస్తే చైర్మన్ కూడా అక్కడి కార్యాలయంలోనే బాధ్యతలు తీసుకోవాల్సి ఉంటుంది. ఢిల్లీలో బోర్డు చైర్మన్‌గా గంగారెడ్డి బాధ్యతలు స్వీకరించడం అనుమానాలకు తావిస్తున్నది. ప్రస్తుతం నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్‌కు పసుపు పంట రాక మొదలైంది. కనీస మద్దతు ధర అమలుకావడం లేదు. రూ.15 వేలు దక్కాల్సిన క్వింటా పసుపునకు రూ.9 వేల నుంచి రూ.11 వేలలోపే పలకడం గమనార్హం.
కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోని అనేక రకాల బోర్డులు దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో ఉన్నాయి. సుగంధ ద్రవ్యాలకు సంబంధించి నేషనల్ స్పైసెస్ బోర్డును 1987లో కేరళ రాష్ట్రం కొచ్చిలో ఏర్పాటుచేశారు. ఈ బోర్డు ప్రధాన కార్యాలయం నేటికీ కొచ్చిలోనే కొనసాగుతున్నది. 1975 జనవరి 1న ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరులో పొగాకు బోర్డు నెలకొల్పారు. దీని ప్రధాన కార్యాలయం అక్కడే ఉన్నది. 1981 జనవరి 12న కేరళలోని కొచ్చిలో కోకోనట్ డెవలప్మెంట్ బోర్డును స్థాపించారు. కానీ, ఇప్పుడు వింతగా ఢిల్లీ కేంద్రంగా పసుపుబోర్డు ఆఫీస్‌ను ప్రారంభించి, అక్కడే చైర్మన్ బాధ్యతలు స్వీకరించడంపై రైతులు అనుమానాలు వ్యక్తంచేస్తున్నారు.