KTR | హైదరాబాద్ : పదవుల చుట్టూ పరిభ్రమించే ఈనాటి రాజకీయాల్లో స్థిరంగా, సిద్ధాంతం కోసం నిలబడ్డ నాయకుడు సీతారాం ఏచూరి అని బీఆర్ఎస్ వర్కింగ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు. ఎప్పుడు ఏ కండువా మారుస్తారో తెలియని ఫిరాయింపుల కాలంలో కడదాకా కమ్యూనిస్టుగా బతికిన ఆదర్శ నేత ఏచూరి మాత్రమే అని కేటీఆర్ పేర్కొన్నారు. రవీంద్ర భారతిలో నిర్వహించిన సీతారాం ఏచూరి సంస్మరణ సభలో కేటీఆర్ పాల్గొని.. కామ్రేడ్ చిత్రపటానికి నివాళులర్పించారు. అనంతరం సీతారాం ఏచూరిని ఉద్దేశించి కేటీఆర్ ప్రసంగించారు.
ఓట్ల రాజకీయం వేరు.. ప్రజల రాజకీయం వేరు. మేం ఓట్ల రాజకీయంలో వెనుకబడ్డ ప్రజల కోసం పోరాటంలో మాత్రం ముందున్నాం.. ప్రజల మనసుల్లో ఉన్నామని ఏచూరి చెప్పిన మాట గుర్తుంది. నాయకులుగా, పాలకులుగా ఉండి పోరాడాలంటే తెలియని వారు ఎందరో ఉండొచ్చు. ప్రజలను ఓటు బ్యాంకుగా చూసేవారు మరెందరో ఉన్నారు. కానీ ఉన్నత చదువులు చదువుకున్న ఓ కుటుంబంలో పుట్టి అణగారిన వర్గాల కోసం ప్రశ్నించే గొంతుకగా ఎదిగిన గొప్ప వ్యక్తిత్వం ఏచూరిది. అది చాలా గొప్ప విషయం. పోరాటాల నుంచి వచ్చిన నాయకులకు ప్రజల కష్టం, నష్టం తెలుస్తుందంటారు.. అలాంటి వారిలో ఏచూరి ఒక్కరే అని బలంగా నమ్ముతున్నాను అని కేటీఆర్ పేర్కొన్నారు.
తిట్లు, బూతులు, రోతమాటలతో రాజకీయంగా చలామణి అవుతున్న ఈ రోజుల్లో ఏచూరి హుందాతనం భవిష్యత్ నాయకులకు ఒక పాఠం అని చెప్పక తప్పదని కేటీఆర్ తెలిపారు. ఎమర్జెన్సీ చీకటి రోజుల్లో జైలు జీవితం తర్వాత భారతదేశంలో ఆనాడు అత్యున్నత స్థానంలో ఉన్న ఇందిరా గాంధీ ముందు నిలబడి.. ఒక సామాన్య విద్యార్థి నాయకుడిగా, ఒక్క మాట కూడా తొణకకుండా మీరు రాజీనామా చేయండని మాట్లాడాలంటే ఎంత గుండె ధైర్యం కావాలో ఆలోచించండి. రాజ్యాంగాన్ని రాజకీయం కోసం అపహాస్యం చేస్తున్న ఈ రోజుల్లో రాజ్యాంగాన్ని త్రికరణ శుద్ధితో నమ్మిన వ్యక్తి సీతారాం ఏచూరి. ప్రశ్నించడమే ప్రజాస్వామ్యం అని గుండెల నిండా నమ్మిన వ్యక్తి సీతారాం ఏచూరి. పదవులతోనే కీర్తి వస్తుందని అనుకునే వారు కొందరు ఉంటారు. కానీ పదవులు లేకున్నా ఐడియాలజీ, ప్రజా సమస్యల పట్ల అవగాహన, పని చేయాలన్న తపన, నిత్యం ప్రజా సంక్షేమం కోసం పని చేసే ఆలోచన, నిత్యం కొత్తది నేర్చుకోవాలనే అభిలాష, ప్రజల మనసుల్లో చిరస్థాయిగా చిరంజీవిగా నిలబడేలా చేస్తుందనడానికి ఏచూరి జీవితం ఒక ఉదాహరణగా నేను భావిస్తున్నాను అని కేటీఆర్ పేర్కొన్నారు.
మా పార్టీలు, సిద్ధాంతాలు వేరు కావచ్చు. మీరు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో భిన్నాభిప్రాయాన్ని ప్రకటించొచ్చు. వారితో నాకు పరిచయం తక్కువే కావొచ్చు. కానీ ఉద్యమాల నుంచి వచ్చిన బిడ్డలుగా మా బంధం రక్తసంబంధంగానే ఉంటుంది. ఆ భావన మాలో బలంగా ఉంటుంది. బతికున్నంత వరకు ప్రజల కోసమే బతకడం కాదు.. చనిపోయాక కూడా తన దేహాన్ని భవిష్యత్లో ఈ దేశ ప్రజానీకానికి వైద్యం అందించే డాక్టర్లకు ఉపయోగపడాలనే ఏచూరి ఆశయం చాలా గొప్పది. ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడ్డప్పుడు.. మౌనం అనేది చాలా ప్రమాదకరమని ఏచూరి చెప్పారు. అందుకే ఆయన స్ఫూర్తితో రాజ్యాంగం అపహాస్యం అయిన ప్రతిసారి ప్రశ్నిస్తూనే ఉందాం. ప్రజా హక్కుల కోసం చేతనైనంత వరకు పోరాటం చేద్దాం. ప్రశ్నించే గొంతుకలకు అండగా నిలబడుదాం.. అదే మనందరం ఏచూరికి మనస్ఫూర్తిగా ఇవ్వగలిగే నివాళి అని భావిస్తున్నాను. నమ్మిన సిద్ధాంతం కోసం ఆఖరి వరకు కట్టుబడి పోరాడిన సీతారాం ఏచూరి జీవితం మా లాంటి కొత్త తరం నాయకులకు కూడా ఆదర్శం అని కేటీఆర్ తెలిపారు.
ఇవి కూడా చదవండి..
Singareni | సింగరేణి కార్మికుల కష్టాన్ని బొగ్గుపాలు చేసిన రేవంత్ సర్కార్..!
KTR | అమృత్ స్కీంలో భారీ స్కాం.. సీఎం కుటుంబ సభ్యులకు రూ. 1,500 కోట్ల కాంట్రాక్టులు : కేటీఆర్