KTR | హైదరాబాద్, సెప్టెంబర్ 20 (నమస్తే తెలంగాణ) : రాష్ట్ర ప్రభుత్వం అమృత్ టెండర్లలో అవినీతికి పాల్పడిందని, వాటి నిజాలను నిగ్గు తేల్చాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రులు మనోహర్ లాల్ ఖట్టర్, టోచన్ సాహూ కు శుక్రవారం లేఖ రాశారు. అమృత్ టెండర్లలో జరిగిన అవకతవకలపై బీఆర్ఎస్ సహా రాష్ట్రంలోని ప్రతిపక్ష పార్టీలన్నీ అనేకసార్లు డిమాండ్ చేసినా రాష్ట్ర ప్రభుత్వం నుంచి సమాధానం రాలేదని పేర్కొన్నారు. అమృత్ పథకంలో భా గంగా రాష్ర్టానికి కేటాయించిన నిధుల్లో దాదాపు రూ.1500 కోట్ల టెండర్లు సీఎం సొంత బావమరిది సృజన్‌రెడ్డి కంపెనీకి అర్హతల్లేకున్నా కట్టబెట్టారని, దీనిపై వెంటనే విచారణ జరిపి నిజాలు నిగ్గు తేల్చాలని డిమాండ్ చేశారు.
టెండర్ల తాలూకు సమాచారం బయటకు పొకకుండా కాంగ్రెస్ ప్రభుత్వం చీకటి ఒప్పందాలు చేసుకున్నదని ధ్వజమెత్తారు. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎన్నిసార్లు కోరినా సమాచారం ఇవ్వడం లేదని తెలిపారు. ఈ మొత్తం వ్యవహారంలో ముఖ్యమంత్రి బావమరిది భాగస్వామిగా ఉన్నారని పేర్కొన్నారు. అమృత్ పథకంలో తొమ్మిది నెలలుగా జరిగిన ప్రతి టెండర్‌ను సమీక్షించి, నిబంధనలకు విరుద్ధంగా జరిగిన టెండర్లను రద్దు చేయాలని, పథకంలో అవినీతిపై విచారణ చేయాలని డిమాండ్ చేశారు. ఎలాంటి అనుభవం, అర్హతల్లేకున్నా కేవ లం ముఖ్యమంత్రి బంధువు అనే సాకుతో రాష్ట్ర ప్రభుత్వం అయా కంపెనీలకు టెండర్లు కట్టబెట్టిందని కేటీఆర్ విమర్శించారు.
రాష్ట్ర ప్రభుత్వం టెండర్ల విషయాన్ని, వాటిని దకించుకున్న కంపెనీల వివరాలను మున్సిపల్ శాఖతో పాటు ఇతర ఈ టెండరింగ్ వెబ్ సైట్లలోనూ లేకుండా కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తున్నదని ధ్వజమెత్తారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అనేక విమర్శలు చేసిన రేవంత్‌రెడ్డి, మేఘా కంపెనీ టెండర్లను దాదాపు 40 శాతానికి పైగా అంచనాలు పెంచారనే ఆరోపణలున్నాయని లేఖలో ప్రస్తావించారు. అమృత్ టెండర్ల విషయంలో సమాచారాన్ని రాష్ట్ర ప్రభుత్వం పూర్తి గోప్యంగా ఉంచుతున్న నేపథ్యంలో కేంద్రం జోక్యం చేసుకొని వివరాలన్నీ బహిర్గతం చేసి మొత్తం వ్యవహారాన్నంతా పారదర్శకంగా ఉంచాలని కోరారు.
సీఎం రేవంత్‌రెడ్డి బావమరిది సృజన్‌రెడ్డికి చెందిన శోధ కంపెనీ ఇతర కంపెనీలతో కలిసి రాష్ట్రంలోని అనేక ప్రభుత్వ ప్రాజెక్టుల కాంట్రాక్టులను ఎలాంటి అర్హతలు లేకున్నా దకించుకుంటున్న వైనాన్ని కేటీఆర్ గుర్తుచేశారు. సీఎం సొంత నియోజకవర్గం కొడంగల్ ఎత్తిపోతల కాంట్రాక్టులను సృజన్‌రెడ్డి కంపెనీతోపాటు గతంలో రేవంత్‌రెడ్డి అనేక ఆరోపణలు చేసిన మేఘా కంపెనీ, కేఎన్ఆర్ కంపెనీలకు అప్పగించారని పేర్కొన్నారు. కేఎన్ఆర్ కంపెనీలో సీఎం సోదరుడు తిరుపతిరెడ్డి వాటాలు ఉన్నాయన్న విషయాన్ని గుర్తించాలన్నారు.
రాష్ట్రంలో తొమ్మిదినెలల కాలంలో పురపాలక శాఖ పరిధిలో జరిగిన అన్ని టెండర్లలోనూ ప్రత్యేకించి కేంద్రం నిధులతో కొనసాగే కార్యక్రమాల టెండర్ల విషయంలో నిజాలు నిగ్గు తేల్చాలని కోరారు. ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్తోపాటు, స్థానిక బీజేపీ ప్రజాప్రతినిధులు ఆరోపిస్తున్నా స్పందన లేదని, సీఎం రేవంత్‌రెడ్డి పాల్పడుతున్న అవినీతిలో కేంద్ర భాగస్వామ్యం ఉన్నదని భావించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు.