Vijaya Dairy | హైదరాబాద్, సెప్టెంబర్ 20 (నమస్తే తెలంగాణ): ప్రభుత్వరంగ సంస్థ విజయ డెయిరీని నిర్వీర్యం చేసే దిశగా పావులు కదులుతున్నాయి. విజయ డెయిరీకి పోటీగా ఏపీ సీఎం చంద్రబాబు కుటుంబానికి చెందిన హెరిటేజ్ సంస్థ రాష్ట్రంలో భారీ పెట్టుబడులకు సన్నద్ధం అవుతున్నట్టు తెలిసింది. రూ.200 కోట్లకుపైగా పెట్టుబడితో శామీర్‌పేటలో డెయిరీతో పాటు ఐస్‌క్రీం తయారీ ఫ్యాక్టరీని ఏర్పాటు చేయబోతున్నట్టు సమాచారం. దీనిపై ఇటీవల జరిగిన హెరిటేజ్ బోర్డు మీటింగ్‌లో నిర్ణయం కూడా తీసుకున్నట్టు తెలిసింది. ఇదే జరిగితే విజయ డెయిరీ చరిత్రలో కలిసిపోవటం ఖాయమనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వ సహకారంపై ఆధారపడే విజ య డెయిరీ.. హెరిటేజ్ వంటి రాజకీయ పలుకుబడి గల సంస్థతో పోటీపడటం కష్టమేననే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే ప్రైవేట్ డెయిరీల నుం చి పోటీని తట్టుకోలేక చతికిలపడిన విజయ డెయిరీకి హెరిటేజ్ పెట్టుబడులు శరాఘాతంగా మారటం ఖాయమన్న అభిప్రాయం వెల్లడి అవుతున్నది.
హెరిటేజ్‌కు రేవంత్ ప్రభుత్వ సహకారం?
ఏపీ సీఎం చంద్రబాబు, తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి మధ్య అనుబంధం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కదిద్దుకోవాలనే సామెత చందంగా తెలంగాణలో తమ అనుకూల ప్రభుత్వం ఉన్నప్పుడే హెరిటేజ్ సంస్థను విస్తరించాలనే ఆలోచనలో సదరు సంస్థ ఉన్నట్టుగా తెలిసింది. ఇందులో భాగంగానే ఈ భారీ ప్లాన్ చేసినట్టు చర్చ జరుగుతున్నది. హెరిటేజ్ సంస్థకు రేవంత్ ప్రభుత్వం కూడా పరోక్షంగా సహాయ సహకారాలు అందిస్తున్నదనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. అందుకే విజయ డెయిరీని నిర్లక్ష్యం చేస్తున్నదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. పాడి రైతులకు పాల బిల్లులు చెల్లించకపోవటం, ఆ సంస్థ నష్టాల్లో కూరుకుపోతున్నా పట్టించుకోకపోవటం, స్వయంగా ఈ శాఖకు సీఎం రేవంత్‌రెడ్డి మంత్రి అయినా ఆ శాఖపై ఇప్పటివరకు సమీక్ష చేయకపోవటం, కనీసం సంస్థ బాగోగుల గురించి ఆరా తీయకపోవటం వంటి ఘటనలు అనేక ఆరోపణలకు బలం చేకూర్చుతున్నాయి.
అందుకే పాల బిల్లులు చెల్లించటం లేదా?
బీఆర్ఎస్ హయాంలో విజయ డెయిరీకి పాలు పోసే పాడి రైతులకు ప్రతి 15 రోజులకోసారి ఠంచనుగా బిల్లులు వారి ఖాతాలో పడేవి. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక పాడి రైతులకు కష్టాలు మొదలయ్యాయి. 3 నెలలుగా పాడి రైతులకు బిల్లులే దిక్కులేవు. 140 కోట్ల పాల బిల్లులను బకాయి పెట్టింది. రైతులు ఎంత మొత్తుకుంటున్నా ప్రభుత్వంలో గానీ, విజయ డెయిరీ అధికారుల్లో గానీ చలనం లేకపోవటం గమనార్హం. పాల బిల్లులు ఎప్పుడిస్తారని ప్రశ్నించిన రైతులపై అధికారులు తిట్ల దండకం అందుకుంటున్నారు. ‘బిల్లులు వచ్చేటప్పుడు వస్తాయి. ఇష్టముంటే పాలు పోయండి లేకుంటే లేదు’ అని విజయ డెయిరీ అధికారులు రైతులకు తేల్చిచెప్పినట్టు తెలిసింది. ఈ వ్యాఖ్యల వెనుక భారీ కుట్ర దాగుందనే విషయం ఇప్పుడిప్పుడే బయటపడుతున్నది. రైతులను విజయ డెయిరీకి దూరం చేసేందుకు ప్రభుత్వం పాల బిల్లుల చెల్లింపును ఆలస్యం చేయిస్తున్నదన్న ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. నెలలపాటు పాల బిల్లులు రాకపోతే రైతులే విసిగి వేసారి వాళ్లంతటా వాళ్లే ప్రైవేటు డెయిరీలకు మళ్లుతారని అధికారులు భావిస్తున్నట్టు తెలిసింది. ఆ తర్వాత మెళ్లగా హెరిటేజ్ డెయిరీ.. రైతులను తనవైపు లాగేసుకునే ప్రయత్నం చేస్తుందని చెప్తున్నారు.
నష్టాల్లోకి విజయ డెయిరీ!
ఉమ్మడి ఏపీలో నష్టాల బాటలో ఉన్న విజయ డెయిరీని ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు తర్వాత కేసీఆర్ సర్కారు విజయ డెయిరీ అభివృద్ధిపై ప్రత్యేకంగా దృష్టి సారించింది. రైతులకు పాల ఇన్సెంటివ్ ప్రకటించటంతో పాటు సబ్సిడీలో గేదెలను ఇప్పించింది. విజయ డెయిరీ ఆధ్వర్యంలో మెగా డెయిరీని ఏర్పాటు చేసింది. బీఆర్ఎస్ ప్రభుత్వ కృషితో విజయ డెయిరీ నష్టాల నుంచి లాభాల పట్టింది. అయితే ఇది ఎంతో కాలం నిలవలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక విజయ డెయిరీకి మళ్లీ కష్టాలు, నష్టాలు మొదలయ్యాయనే విమర్శలున్నాయి. ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ఇప్పటి వరకు విజయ డెయిరీకి ప్రభుత్వం నుంచి కనీస సహకారం కూడా కరువైందని ఉద్యోగులు వాపోతున్నారు. పాల బిల్లులు చెల్లించకపోవటంతో పాల సేకరణ తగ్గుతున్నదని చెప్తున్నారు. విజయ డెయిరీ తయారుచేసే పాల ఉత్పత్తుల విక్రయం కూడా భారీగా తగ్గిపోతున్నట్టు తెలిసింది. లాభాలు తగ్గడం, ఖర్చులు పెరగటంతో మళ్లీ నష్టాలబాట పట్టినట్టు ఉద్యోగులు పేర్కొంటున్నారు.