KTR | హైదరాబాద్ : రాష్ట్రంలోని నిరుద్యోగులపై రేవంత్ రెడ్డి ప్రభుత్వం కక్ష కట్టిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు. పార్టీ ఫిరాయింపులు, నిరుద్యోగుల అంశంపై రాజ్‌భవన్‌లో గవర్నర్ రాధాకృష్ణన్‌కు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ ఆధ్వర్యంలో ఆ పార్టీ ప్రజాప్రతినిధులు వినతి పత్రం సమర్పించారు. గవర్నర్‌తో భేటీ అనంతరం కేటీఆర్ మీడియాతో మాట్లాడారు.
రాష్ట్రంలో రాజ్యాంగం మీద జరుగుతున్న దాడిని వివరించి చెప్పేందుకు కేసీఆర్ ఆదేశాల మేరకు గవర్నర్‌ను కలిశామని కేటీఆర్ తెలిపారు. రెండు ముఖ్యమైన అంశాలను గవర్నర్ దృష్టికి తీసుకెళ్లాం. అసెంబ్లీ ఎన్నికల సమయంలో నిరుద్యోగ యువతకు, విద్యార్థులకు కాంగ్రెస్ పార్టీ నేతలు రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలను గవర్నర్‌కు తెలియజేశాం. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల హామీలను తుంగలో తొక్కుతూ.. అప్రజాస్వామికంగా విద్యార్థులపై దాడులు చేసి కేసు పెడుతున్నట్లు చెప్పాం. విద్యార్థులపై లాఠీలు ఝులిపిస్తూ.. భయానక వాతావరణం సృష్టించారు. తెలంగాణ ఉద్యమ సమయంలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులను యూనివర్సిటీల్లో చూస్తున్నామని కేటీఆర్ తెలిపారు.
మొదటి సంవత్సరంలోనే రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు. జాబ్ క్యాలెండర్ అని చెప్పి ప్రకటనలు ఇచ్చారని గవర్నర్ దృష్టికి తీసుకెళ్లాం. కేసీఆర్ హయాంలో జారీ అయిన గ్రూప్-1, 2, 3 నోటిఫికేషన్లు రద్దు చేసి పోస్టుల సంఖ్య పెంచుతామని కాంగ్రెస్ ఇచ్చిన హామీని గుర్తు చేశామన్నారు. ఇప్పటి వరకు జాబ్ క్యాలెండర్ విడుదల చేయలేదు. ఒక్క నోటిఫికేషన్ కూడా ఇవ్వలేదని గవర్నర్‌కు చెప్పామని కేటీఆర్ తెలిపారు. మెగా డీఎస్సీ అని చెప్పారు కానీ వేయలేదు. నిరుద్యోగ భృతి 4 వేలు ఇవ్వలేదు. అన్నింటికి మించి సిటీ సెంట్రల్ లైబ్రరీలో చదువుకుంటున్న విద్యార్థులను బయటకు ఈడ్చుకొచ్చి హింసించారు. ఉస్మానియా యూనివర్సిటీలో హాస్టల్ ఉన్న విద్యార్థులపై దాడులు చేసి అప్రజస్వామికంగా వ్యవహరించారని వివరించి చెప్పాం. హోం సెక్రటరీని పిలుచుకుని అడుగుతానని, విద్యార్థులపై దాడులు చేయడం సరికాదని గవర్నర్ అన్నట్లు కేటీఆర్ పేర్కొన్నారు.
రెండోది.. ఈ రాష్ట్రంలో పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని తుంగలో తొక్కుతున్నారు. బీఆర్ఎస్ పార్టీకి చెందిన 10 మంది ఎమ్మెల్యేలు, 8 మంది ఎమ్మెల్సీలను కాంగ్రెస్ పార్టీలో చేర్చుకున్నారు. పార్టీ ఫిరాయింపుల విషయంలో న్యాయం పోరాటం చేస్తున్న విషయాన్ని, స్పీకర్‌ను కలిసి అభ్యర్థించిన విషయాన్ని గవర్నర్‌కు తెలియజేశాం. ఖైరతాబాద్ ఎమ్మెల్యే అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ టికెట్ మీద గెలిచి.. కాంగ్రెస్ టికెట్‌పై పార్లమెంట్‌కు పోటీ చేశారు. ఈ పార్టీ ఫిరాయింపుల విషయంలో తప్పకుండా నా పరిధిలో ఉన్నంత వరకు న్యాయం చేస్తానని గవర్నర్ చెప్పినట్లు కేటీఆర్ తెలిపారు.
ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల ప్రోటోకాల్ విషయంలో జరుగుతన్న అగౌరవాన్ని కూడా వివరించాం. ఈ విషయంలో ప్రభుత్వానికి లేఖ రాస్తానని గవర్నర్ చెప్పారు. ప్రజాప్రతినిధుల గౌరవానికి భంగం వాటిల్లకుండా చూస్తానని చెప్పారు. భవిష్యత్‌లో ఎలాంటి సమస్యలు వచ్చినా తన దృష్టికి తీసుకురావాలని గవర్నర్ చెప్పారు. ఇక్కడితో ఆగకుండా రాజ్యాంగబద్దమైన పదవుల్లో ఉండే పెద్దలను కలిసి కాంగ్రెస్ పార్టీ నిర్వాకాన్ని వివరిస్తాం. రాష్ట్రపతిని కూడా కలిసి చెబుతాం. కాంగ్రెస్ ఇచ్చిన ప్రతి హామీని నిలబెట్టుకునే వరకు, గ్రూప్-2, 3 పోస్టులు పెంచేదాకా, నిరుద్యోగులకు న్యాయం జరిగేదాకా ప్రధాన ప్రతిపక్షంగా బీఆర్ఎస్ పార్టీ పోరాటం చేస్తుందని, నిరుద్యోగులకు అండగా ఉంటామని కేటీఆర్ స్పష్టం చేశారు.
ఇవి కూడా చదవండి..
Telangana | ఉన్నత పాఠశాలల పనివేళలు మార్పు.. కొత్త టైమింగ్స్ ఇవే..!
KTR | ఇలాంటి నిరసనలు చూసి యుగాలైంది.. కరెంట్ కోతలపై కేటీఆర్ ట్వీట్
CM Revanth Reddy | అసెంబ్లీ సమావేశాల్లో జాబ్ క్యాలెండర్..: సీఎం రేవంత్ రెడ్డి