KTR | హైదరాబాద్ : ఇటీవల కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన కులగణన తప్పులతడక, అశాస్త్రీయం, అర్థరహితం అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ధ్వజమెత్తారు. బీసీలకు అన్యాయం చేయకుండా.. రీసర్వే చేయాలని రేవంత్ సర్కార్‌ను కేటీఆర్ డిమాండ్ చేశారు. తెలంగాణ భవన్లో బీసీ నేతలతో సమావేశం అనంతరం కేటీఆర్ మీడియాతో మాట్లాడారు.
మొన్న రాష్ట్ర ప్రభుత్వం బలహీన వర్గాల గొంతు కోస్తూ, వారి సంఖ్యను దాదాపు ఐదున్నర శాతానికి తక్కువ చేసి చూపెట్టి మోసం చేయడమే కాకుండా.. 42 శాతం రిజర్వేషన్ల వాగ్దానాన్ని తుంగలో తొక్కారు. దీనిపై మా పార్టీ తరపున అసెంబ్లీలో బలంగా నిరసన తెలియజేశాం. కాంగ్రెస్ ప్రభుత్వం కులగణన మీద ఇచ్చిన స్టేట్మెంట్ తప్పుల తడక, చిత్తు కాగితంతో సమానం. బలహీనవర్గాల గొంతు కోసిన కాంగ్రెస్ పార్టీ యొక్క దుర్మార్గ వైఖరిని ఏ బీసీ బిడ్డ కూడా ఒప్పుకోవడం లేదని అసెంబ్లీలో గట్టిగా ప్రభుత్వానికి డిమాండ్ చేశాం. ఇది శుద్ధ తప్పు.. బీసీ జనాభాను తగ్గించి చూపెట్టి, బలహీన వర్గాలను తక్కువ చేసి చూపిస్తున్నారని నిరసన తెలిపాం. నెల రోజుల పాటు శాస్త్రీయంగా రీ సర్వే చేయాలని డిమాండ్ చేశామని కేటీఆర్ తెలిపారు.
మా సంఖ్య తక్కువ చేయడంతో రేషన్ కార్డుల జారీ, ఇతర సంక్షేమ పథకాల్లో మా వాటా తగ్గుతది.. అన్యాయం జరుగుతదని బీసీ, ఎంబీసీ బిడ్డలు ఆందోళన పడుతున్నారు. దీంతో వెంటనే తిరిగి సర్వే చేయాలని కోరాం. కానీ దున్నపోతు మీద వాన పడ్డట్టు ప్రభుత్వం ఈ రోజు వరకు స్పందించలేదు. ఇంకా సిగ్గు లేకుండా.. కుటుంబ సర్వే మీద అనుమానాలు లేవనెత్తే విధంగా కాంగ్రెస్ పెద్దలు మాట్లాడుతూ బీసీలను అవమానిస్తున్నారు. కర్ణాటక సీఎం సిద్ధరామయ్యను ఆహ్వానించి కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్ పేరిట వాగ్దానాలు గుప్పించింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తామని చెప్పింది. అలాగే ఈ రాష్ట్రంలో రాబోయే ఐదేండ్లలో లక్ష కోట్ల బడ్జెట్ పెడుతాం అని చెప్పింది. బీసీ సబ్ ప్లాన్ తీసుకువస్తాం. ప్రభుత్వం కాంట్రాక్టుల్లో 42 శాతం బీసీలకు ఇస్తామని చెప్పింది. 15 నెలలు అవుతున్నా కనీసం 15 పైసలు కూడా బీసీలకు కేటాయించలేదు. 16 కార్పొరేషన్లు బీసీ కులాలకు ఏర్పాటు చేసి ఒక్కో కార్పొరేషన్‌కు 50 కోట్ల బడ్జెట్ అని చెప్పారు. కనీసం 50 పైసలు కూడా ఖర్చు పెట్టలేదు అని కేటీఆర్ తెలిపారు.
ఇవాళ తెలంగాణలోని బలహీన వర్గాల ఆందోళనలను దృష్టిలో పెట్టుకుని బీసీ సెల్ అధ్యక్షుడు ముఠా గోపాల్ అధ్యక్షతన విస్తృత స్థాయి సమావేశం జరిగింది. బీసీలకు క్షమాపణ చెప్పాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఐదున్నర శాతం జనాభా తగ్గించి.. రేవంత్ రెడ్డి దుర్మార్గ చర్యకు పూనుకున్నాడు. కులగణన పూర్తి తప్పులతడక.. అశాస్త్రీయం, అర్థరహితం అని మేం అనట్లేదు.. రాష్ట్రంలో బీసీ సంఘాలు, కాంగ్రెస్ ఎమ్మెల్సీ ఇది చిత్తు కాగితంతో సమానం అని తగులబెట్టిండు. కాబ్టటి రీసర్వేకు ఆదేశించాలని డిమాండ్ చేస్తున్నాం. సరైన లెక్కలు తేల్చండి.. రీసర్వేకు మేం అందరం కూడా సహకరిస్తాం.. కోరిన అన్ని వివరాలు ఇస్తాం. బీసీలకు అన్యాయం చేయొద్దు. 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామన్న మాట నిలబెట్టుకోవాలి. మొన్న అసెంబ్లీలో చట్టబద్దత కల్పిస్తారని, 42 శాతం బిల్లు తెస్తామని అనుకున్నాం.. బిల్లు తేకుండా కేవలం సొల్లు తెచ్చావు. సొల్లు మాటలు ఆపి 42 శాతం రిజర్వేషన్ కల్పిస్తూ బిల్లు తీసుకురావాలని రేవంత్ రెడ్డిని కేటీఆర్ డిమాండ్ చేశారు.
ఇవి కూడా చదవండి..
KTR | నాడు ఉప్పొంగిన గంగమ్మ.. నేడు అడుగంటుతున్న భూగర్భజలాలు: కేటీఆర్
Congress | కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసిందని రచ్చబండపై నిరాహారదీక్షకు దిగిన యువకుడు