హైదరాబాద్: భూగర్భజలాలు అడుగంటిపోవడంతో యాసంగి ప్రారంభంలోనే సాగు నీటి సమస్య మొదలైంది. దీంతో బోరుబావులను నమ్ముకుని వరిసాగు చేస్తున్న రైతన్న దిక్కుతోచని స్థితిలో పడిపోయాడు. కాల్వల ద్వారా సాగుకు నీళ్లివ్వాల్సిన కాంగ్రెస్ సర్కార్ ఏమీ పట్టనట్టు ఉండటంతో పంటలు ఎండిపోతున్నాయి. ఈ నేపథ్యంలో రేవంత్ సర్కార్‌పై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) ఆగ్రహం వ్యక్తం చేశారు. నాడు కేసీఆర్ పాలనలో ఎండాకాలంలో దుంకిన మత్తడులు, నేడు ఏడాది కాంగ్రెస్ పాలనలో ఎండుతున్న వరి మడులు అంటూ ఎక్స్ వేదికగా మండిపడ్డారు. రైతుల శ్రమను పణంగా పెట్టి, పొలాలు ఎండబెట్టి కాంగ్రెస్ పార్టీ రాజకీయ వికృత క్రీడ ఆడుతున్నదని ధ్వజమెత్తారు.
‘‘నాడు కేసీఆర్ గారి పాలనలో
ఎండాకాలంలో దుంకిన మత్తడులు
నేడు ఏడాది కాంగ్రెస్ పాలనలో
ఎండుతున్న వరి మడులు.
నాడు ఉప్పొంగిన గంగమ్మ
నేడు అడుగంటుతున్న భూగర్భజలాలు
పదేళ్ల పాలనలో దేశంలోనే అత్యధికంగా పెరిగిన భూగర్భజలాలు
నేడు కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యంతో
వేగంగా పడిపోతున్న భూగర్భజలాలు
నాలుగు నెలలలో 2 మీటర్ల లోతుకు..
32 జిల్లాలలో ప్రభావం.
రాజకీయ కక్షతో కాళేశ్వరాన్ని ఎండబెట్టి.. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలను పడావుపెట్టిన ఫలితం
నాడు ఎత్తిపోతలతో చెరువులు, కుంటలు, వాగులు వంకలు నీటితో పారిస్తే
నేడు ఎత్తిపోతలను గాలికి వదిలి.. గాలి ఆరోపణలతో కాలం వెల్లదీస్తున్నారు.
రైతుల శ్రమను పణంగా పెట్టి, పొలాలు ఎండబెట్టి.. కాంగ్రెస్ ఆడుతున్న రాజకీయ వికృత క్రీడ ఇది.’’ అంటూ కేటీఆర్ ట్వీట్ చేశారు.