KTR | హైదరాబాద్ : బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ మీద కోపంతో తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్చితే చరిత్ర క్షమించదు అని సీఎం రేవంత్ రెడ్డిని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తేల్చిచెప్పారు. తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన తెలంగాణ సాహితీ సమావేశంలో కేటీఆర్ పాల్గొని ప్రసంగించారు.
సింహాలు తమ గాథ తాము చెప్పుకోకపోతే.. వేటగాళ్లు చెప్పే పిట్ట కథలే చరిత్రగా నిలిచిపోతాయనేది అక్షర సత్యం. యుద్ధంలో గెలిచిన వాడే పరాజితుల చరిత్రను చెరిపేసే ప్రయత్నం చేస్తుంటారు.. అదే తెలంగాణలో జరుగుతుంది. కేసీఆర్ మీద కోపంతో ఎన్టీఆర్ ట్యాంక్ బండ్ మీద పెట్టిన విగ్రహాల గురించి రేవంత్ రెడ్డి ప్రస్తావిస్తాడు. కానీ కేసీఆర్ హయాంలో ఏర్పాటు చేసిన 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాం గురించి ఒక్క మాట రాదు. శ్వేతసౌధం లాంటి అంబేద్కర్ సచివాలయం గురించి ఒక్క మాట రాదు. పోలీసు కమాండ్ కంట్రోల్ సెంటర్ గురించి ఒక్క మాట రాదు.. ఈ పదేళ్లలో జరిగిన నిర్మాణాల గురించి సీఎంకు మాట రాదు. ఎందుకంటే పరాజితుల చరిత్రను చెరిపేయాలనే మూర్ఖపు నాయకులు ఉన్నారు. కేసీఆర్ మీద కోపంతో తెలంగాణ తల్లి రూపాన్నే మార్చే ప్రయత్నం చేస్తే చరిత్ర క్షమించదు. దేశంలోనే అత్యంత సుసంపన్నమైన రాష్ట్రంగా ఆర్బీఐ లెక్కల ప్రకారం తలసరి ఆదాయంలో తెలంగాణ ముందుంది. మూర్తీభవించిన ఒక దేవతలాగా తెలంగాణ తల్లిని కేసీఆర్తో పాటు కొందరు ఉద్యమకారులు 2007లో రూపొందించారని కేటీఆర్ గుర్తు చేశారు.
ఈ ముఖ్యమంత్రి తెలంగాణ తల్లి విగ్రహాన్ని పేదరికానికి, సమస్యలకు చిహ్నంగా ప్రతిష్టించాలని అనుకుంటున్నారు. కేసీఆర్ చేసిన పోరాటాన్ని రూపుమాపుతా అంటున్నారు.. ఇది ఆమోదయోగ్యం కాదు. అధికారం ఎవరికి శాశ్వతం కాదు. ఇందిరాగాంధీ నేతృత్వంలో రూపొందించబడ్డ భరతమాత విగ్రహాన్ని వాజపేయీ మార్చలేదు. తెలుగు తల్లి విగ్రహం మారలేదు. ఇక్కడ సీఎం లేకిబుద్దితో, కేసీఆర్ మీద కోపంతో తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్చేందుకు ప్రయత్నిస్తున్నాడు. తెలంగాణ తల్లి విగ్రహాన్ని మారిస్తే చరిత్ర క్షమించదు. ప్రజల నుంచి ఛీత్కారాలు వస్తాయి. ఇప్పటికైనా విజ్ఞతతో ప్రభుత్వం విరమించుకోవాలి. మళ్లీ నాలుగేండ్ల తర్వాత తప్పకుండా జరగాల్సిన కార్యక్రమం జరుగుతది. తెలంగాణ తల్లే తన సరైన స్థానంలో ఉంటది. రాజీవ్ గాంధీ స్థానంలో తెలంగాణ తల్లి నిటారుగా నిలబడుతది. నిన్ను చూస్తనే ఉంటది. అధికారం ఉంది కాబట్టి నాలుగు రోజుల పాటు సాయుధ బలగాల మధ్య నీ నాటకాలు కొంతకాలం సాగుతాయి. ఎల్లకాలం మాత్రం సాగవు అని రేవంత్ రెడ్డిని కేటీఆర్ హెచ్చరించారు.
ఇవి కూడా చదవండి..
Telangana | తెలంగాణలోని పలు చెక్పోస్టుల్లో ఏసీబీ అధికారుల దాడులు
Patnam Narender Reddy | పట్నం నరేందర్ రెడ్డి క్వాష్ పిటిషన్ కొట్టివేసిన హైకోర్టు