హైదరాబాద్: పచ్చని తాడ్వాయిపై ప్రకృతి కన్నెర్ర చేసినట్లు ఉంది. సుమారు లక్ష చెట్లు కూలిన .. 95 రోజుల్లోనే.. ఆ ప్రాంతం మళ్లీ ప్రకృతి ప్రకోపానికి(Medaram Earthquake) గురైంది. ఈ ఏడాది ఆగస్టు 31వ తేదీన వచ్చిన వర్షం, ఈదురుగాలులతో.. మేడారం అడవుల్లో సుమారు 85 వేల చెట్లు కూలాయి. దాంట్లో భారీ వృక్షాలు ఉన్నాయి. సుమారు 50 నుంచి వంద ఏండ్ల నాటి మహావృక్షాలు కూడా ఆ నాటి ప్రకృతి ప్రకోపానికి నేలరాలాయి. అయితే ఇవాళ ఆ ప్రాంతమే కేంద్రంగా భూకంపం సంభవించింది. ములుగు జిల్లాలోని మేడారం కేంద్రంగా 5.3 తీవ్రతతో భూమి కంపించింది. భూమిలో సుమారు 40 కిలోమీటర్ల లోతులో భూకంప తీవ్రత నమోదు అయ్యింది.
తాడ్వాయి అడవుల్లో ఆగస్టు 31న జరిగిన ప్రకృతి బీభత్సం కారణంగా రూ.152.64 కోట్ల నష్టం వాటిల్లిందని అటవీ అధికారులు ఇటీవల అంచనా వేశారు. ఆ నాటి భారీ వర్షానికి బలమైన గాలులు తోడు కావడంతో తాడ్వాయి, ఏటూరునాగారం, గోవిందరావుపేట మండలాల్లోని అడవులకు తీవ్ర నష్టం కలిగింది. 332.02 హెక్టార్లలో 85,125 చెట్లు కూలిపోవడమో, విరిగిపోవడమో జరిగిందని అధికారులు డ్రోన్ ఫొటోలు, వీడియోల ద్వారా అంచనా వేశారు.
ములుగు జిల్లాలో జరిగిన ప్రకృతి విపత్తుపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సెప్టెంబర్ 11వ తేదీన తన ట్విట్టర్ అకౌంట్లో ఓ వీడియోను పోస్టు చేశారు. సుమారు లక్షకుపైగా చెట్లు మేడారం అడవుల్లో కూలాయని, వాతావరణ మార్పులు, పర్యావరణ సమస్యలను పరిష్కరించుకోవాల్సిన అవసరం ఉందని ఆ ట్వీట్లో ఆయన తెలిపారు. ప్రకృతి విపత్తులను అడ్డుకోవాలంటే కలిసికట్టుగా పర్యావరణ సంరక్షణ చేపట్టాలని ఆయన ఆ ట్వీట్లో కోరారు.
The natural calamity in the forests of Mulugu district is deeply distressing
The recent tornado in the Medaram-Tadwai forest, Mulugu district, has uprooted over 1 lakh trees, highlighting the urgent need to address climate change and ecological imbalances
Collective efforts for… pic.twitter.com/ddqGwTGL1w
— KTR (@KTRBRS) September 11, 2024
గోదావరి నది సమీపంలో ఉన్న ఈ అటవీ ప్రాంతంపై ప్రకృతి ప్రభావం ఎలా ఉందో శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. నదీ పరివాహక ప్రాంతానికి సమీపంలోనే బొగ్గు గనులు కూడా ఉన్నాయి. దీంతో భూగర్భ నిపుణులు ఈ ప్రాంత సెసిమిక్ యాక్టివిటీపై లోతుగా అధ్యయనం చేయాల్సి ఉంటుందని అంచనా వేస్తున్నారు.