MLC Kavitha | హైదరాబాద్ : రేవంత్ రెడ్డి సర్కార్ మహిళలను నమ్మించి మోసం చేసిందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ధ్వజమెత్తారు. కాంగ్రెస్ పాలనలో క్రిస్మస్ గిఫ్ట్, రంజాన్ తోఫా, బతుకమ్మ చీరల పంపిణీ ఎగిరిపోయాయని ఆమె ఎద్దెవా చేశారు. మెదక్ చర్చిని సందర్శించిన అనంతరం కవిత మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరిని ఎండగట్టారు.
మహిళలకు నెలకు రూ. 2500 ఇస్తామని సీఎం ప్రకటిస్తారని మహిళలకు ఆశించారు. కళ్యాణ లక్ష్మీతో పాటు తులం బంగారం ఇస్తామని ప్రకటన చేస్తారని ఊహించారు. కానీ ప్రభుత్వం ఎటువంటి ఆలోచన చేయడం లేదు. రాష్ట్రంలోని ఒక్కో ఆడబిడ్డకు ప్రభుత్వం రూ. 30 వేలు బాకీ పడింది. 18 ఏళ్లు నిండిన ఆడపిల్లలకు స్కూటీ ఇవ్వలేదు. తక్షణమే స్కూటీల పంపిణీ కార్యక్రమాన్ని మొదలుపెట్టాలని కవిత డిమాండ్ చేశారు.
రాష్ట్రంలో 40 శాతం నేరాలు పెరిగాయి. నేరాల పెరుగుదల.. ప్రభుత్వం మహిళల పట్ల చూపిస్తున్న నిర్లక్ష్యానికి నిదర్శనం. మహిళలకు ఇచ్చిన హామీలను అమలు చేసే సోయి ప్రభుత్వానికి లేదు. మహిళలు చూస్తూ ఊరుకోబోరు.. కచ్చితంగా ప్రశ్నిస్తారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతు బంధును ఎగ్గొట్టింది. తక్షణమే రైతు భరోసా పథకాన్ని అమలు చేయాలి. రైతు భరోసా కింద అర్హులను తగ్గించే ప్రయత్నం చేయవద్దు. కేంద్ర ప్రభుత్వపు నిబంధలను అమలు చేస్తే 30 శాతం రైతులకు కూడా రైతు భరోసా రాదని కవిత పేర్కొన్నారు.
మొక్కజొన్నలు, కందులు, సోయాబీన్, పత్తి వంటి పంటలను మద్ధతు ధరను పెంచుతామని ఇచ్చిన హామీ ఏమైంది..? ఏడాది కాలంగా ఏ ఒక్క పంటకు మద్ధతు ధర ఇవ్వడం లేదు. చక్కెర ఫ్యాక్టరీలను ఎప్పుడు ఓపెన్ చేస్తారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఏడాది గడిచినా రేషన్ కార్డులు ఇవ్వలేదు. ఇంట్లో ఎంత మంది ఉంటే అంత మందికి రేషన్ బియ్యం పంపిణీ చేయాల్సిందే.
తక్షణమే రేషన్ కార్డులు మంజూరు చేయాలని కవిత డిమాండ్ చేశారు.
తెలంగాణకు తలమానికం మెదక్ చర్చి. బీఆర్ఎస్ పార్టీకి, కేసీఆర్‌కు క్రైస్తవులకు పేగుబంధం ఉంది. తెలంగాణ కోసం ప్రార్థన చేయని చర్చి లేదు. మత సహనానికి నిదర్శనం మెదక్. మెదక్ జిల్లాను కేసీఆర్ ఎంతో అభివృద్ధి చేశారు. కేసీఆర్ గోదావరి జలాలతో సింగూరును నింపారు. మెదక్‌కు నీళ్లు వచ్చే కాళేశ్వరం ప్యాకేజీ 19 పనులను ప్రభుత్వం నిలిపివేడయం దారుణం. కేసీఆర్‌పై కోపాన్ని మెదక్ ప్రజలపై తీర్చుకుంటే ఏమొస్తుంది..? కాళేశ్వరం ప్యాకేజీ 19 పనులను కొనసాగించాలి అని ఎమ్మెల్సీ కవిత డిమాండ్ చేశారు.
ఇవి కూడా చదవండి..
Road Accident | భువనగిరి వద్ద ఘోర ప్రమాదం.. ఇద్దరు దుర్మరణం
Daaku Maharaaj | క్రిస్మస్ స్పెషల్ పోస్టర్.. బాలకృష్ణ డాకు మహారాజ్ టీం ఇదే