MLC Kavitha | హైదరాబాద్ : ఎటువంటి లోటుపాట్లు లేకుండా స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాల్సిందే అని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. 42 శాతం రిజర్వేషన్లు ఇచ్చిన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తామని సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారని కవిత గుర్తు చేశారు. ఇందిరా పార్క్ వద్ద తలపెట్టిన బీసీ మహాసభలో కవిత పాల్గొని ప్రసంగించారు.
జనగణనలో భాగంగా కులగణన చేయాలని బీజేపీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. తెలంగాణ జాగృతి ఉద్యమం చేయడం, హైకోర్టు మొట్టికాయలు వేసేంత వరకు రేవంత్ ప్రభుత్వం డెడికేటెడ్ కమిషన్ వేయలేదు. బీసీల లెక్కలు ఒక కమిషన్ తీస్తుంటే… మరో కమిషన్ నివేదిక ఇస్తుంది. ఇలా చేస్తే కోర్టుల్లో నిలబడుతుందా..? బీసీల గురించి ఎందుకు మాట్లాడుతున్నావంటూ కాంగ్రెస్ నాయకులు నన్ను ప్రశ్నిస్తున్నారు. సందర్భం వచ్చింది కాబట్టి మాట్లాడుతున్నా… ఎన్నికలు పూర్తయ్యాక ఎందుకు మాట్లాడలేదని మళ్లీ కాంగ్రెస్ నాయకులే అంటారు. ఎటువంటి లోటుపాట్లు లేకుండా స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాల్సిందే. 42 శాతం రిజర్వేషన్ల హామీ ఇచ్చారు కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయాల్సిందే. లేదంటే బీసీల జనాభా ఎంత ఉంటే అంత వాటా ఇచ్చి ఎన్నికల్లోకి వెళ్లాలి. దొంగ లెక్కలు, కాకిలెక్కలు కాకుండా వాస్తవ లెక్కలు తీయాలి అని ఎమ్మెల్సీ కవిత డిమాండ్ చేశారు.
మన ఉద్యమాల వల్లే సావిత్రీబాయి పూలే జయంతిని అధికారికంగా నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. మన ఉద్యమాలతో జంగుపట్టిన ప్రభుత్వ రథచక్రాలు కదులుతున్నాయి. బీసీలకు మంచి రోజులు వస్తాయి. కులం ఆధారంగా రాజ్యంగ నిర్మాతలు కొన్ని రక్షణలు కల్పించారు. అంబేద్కర్ కృషి చేయకుంటే ఎస్సీ, ఎస్టీలకు ఎటువంటి ఫలాలు దక్కకపోతుండేది. అదే సమయంలో బీసీ కులాలను రాజ్యాంగంలో రక్షణ కల్పించాల్సింది. ఆనాడే బీసీలకు రాజ్యంగపరమైన రక్షణ కల్పించి ఉంటే అభివృద్ధిలో భారతదేశం అమెరికాను దాటేసేది అని కవిత పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి..
KTR | రైతులు మళ్లీ కొత్తగా ఎందుకు ప్రమాణ పత్రాలు ఇవ్వాలి..? రేవంత్ సర్కార్ను నిలదీసిన కేటీఆర్
KTR | రైతుబంధును బొంద పెట్టేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం పన్నాగం : కేటీఆర్