Sabitha Indra Reddy | హైదరాబాద్ : ఎక్కడ పడితే అక్కడ.. విద్యార్థులు, టీచర్ల ముందు కేసీఆర్‌ను విమర్శించడమే మీ విధానమా..? అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని బీఆర్ఎస్ ఎమ్మెల్యే సబితా రెడ్డి సూటిగా ప్రశ్నించారు. గడిచిన పది నెలలలో కేసీఆర్ పేరు ఎత్తకుండా ఒక్క సభలో అయినా మాట్లాడారా..? అని అడిగారు. నిన్న డీఎస్సీ నియామక పత్రాల అందజేత సందర్భంగా కేసీఆర్‌ను రేవంత్ రెడ్డి విమర్శించిన తీరుపై సబితా ఇంద్రారెడ్డి ఎక్స్ వేదికగా స్పందించారు.
రేవంత్ రెడ్డి మాట్లాడేటప్పుడు అది ప్రభుత్వ కార్యక్రమా లేక పార్టీ కార్యక్రమా మర్చిపోతున్నారు. మీరు ఇచ్చాం అని చెప్తున్న టీచర్ పోస్టులు కేసీఆర్ మంజూరు చేసినవి కావా..? ఉన్నత విద్యాశాఖలో 3202 పోస్టులు, యూనివర్సిటీలలో 1081 పోస్టులు కేసీఆర్ ప్రభుత్వం మంజూరు చేసినవి కావా..? అని సబితా ఇంద్రారెడ్డి నిలదీశారు.
ఇంటర్, టెక్నికల్, కాలేజియేట్ ఎడ్యుకేషన్ సంబంధించి 3896 కాంట్రాక్టు ఉద్యోగులను కేసీఆర్ రెగ్యులర్ చేశారు అని చెప్తే బాగుండేది. ఎన్నికల ముందు మీరు చెప్పిన 25,000 టీచర్ పోస్టులు ఎందుకు ఇవ్వలేదు అని ఆ గురువుల ముందు చెప్తే బాగుండేది. ఎన్నికలప్పుడు 6000 పాఠశాలలు మూతపడ్డాయి అని అబద్దం చెప్పిన మీరు, ఆ పాఠశాలల లిస్ట్ విడుదల చేస్తే బాగుండేది. మన ఊరు మన బడి కార్యక్రమం ఎందుకు ఆపేశారో చెప్తే బాగుండేది. 6 లక్షల మంది పేద విద్యార్థులు చదువుతున్న కేసీఆర్ ప్రవేశ పెట్టిన గురుకులాలను ఈ ప్రభుత్వం నిర్వీర్యం చేద్దాం అనుకుంటున్నది అని చెప్తే బాగుండేది. ప్రభుత్వ పాఠశాలలో బ్రేక్ ఫాస్ట్ స్కీమ్ ఎందుకు ఆపేశారో చెప్తే బాగుండేది. ఎన్నికల సమయంలో చెప్పినట్టు ప్రతి విద్యార్థికి 5 లక్షల విద్య భరోసా కార్డు ఎప్పుడు ఇస్తారో చెప్తే బాగుండేది. 19 ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ ఏర్పాటు చేస్తున్న మీరు మిగితా పాఠశాలలను గాలికి వదిలేశాము అని చెప్తే బాగుండేది అని ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి ధ్వజమెత్తారు.
ఇవి కూడా చదవండి..
KTR | పువ్వులనే పూజించే అరుదైన పండుగ బతుకమ్మ : కేటీఆర్
Vinod Kumar | నేను పదవుల కోసం ఏనాడూ పాకులాడలేదు.. రేవంత్‌కు వినోద్ కుమార్ చురకలు